Ecuador: ఆ దేశమంతా వర్క్‌ ఫ్రం హోం.. ఆదేశించిన అధ్యక్షుడు! కారణం ఇదే

దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్‌లోని ఉద్యోగులు గురు, శుక్రవారాలు ఇకపై ఇంటి నుంచే పనిచేయాలని అధ్యక్షుడు డేనియన్‌ నొబోవా ఆదేశించారు.

Written By: Raj Shekar, Updated On : April 19, 2024 3:49 pm

Ecuador

Follow us on

Ecuador: కరోనా సమయంలో పలు సంస్థలు వర్క్‌ఫ్రం హోం విధానం తీసుకువచ్చాయి. ఈ విధానంతో దాదాపు మూడునాలుగేళ్లు ఉద్యోగులంతా ఇళ్ల నుంచే పనిచేశారు. ఇటీవలే అన్ని సంస్థలు వర్క్‌ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. కచ్చితంగా ఆఫీస్‌కు రావాలనే నిబంధనను తీసుకొచ్చాయి. ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంటే.. ఓ దేశ అధ్యక్షుడు మాత్రం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరూ ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించారు. వర్క్‌ ఫ్రం హోం అమలు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. మరి ఎందుకలా చేశాడు.. ఏ దేశంలో అమలవుతోంది తెలుసుకుందాం.

ఈక్వెడార్‌లో..
దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్‌లోని ఉద్యోగులు గురు, శుక్రవారాలు ఇకపై ఇంటి నుంచే పనిచేయాలని అధ్యక్షుడు డేనియన్‌ నొబోవా ఆదేశించారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇలా చేయడానికి ఓ ప్రధన కారణం ఉంది. ఈక్వెడార్‌ ఇప్పటికే ఇంధన సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఇంధన సంక్షోభం నుంచి ఉపశమనం కల్పించేందుకు వర్క్‌ ఫ్రం హోం ప్రకటించారు. దేశంలోని హైడ్రోఎలక్ట్రిక్‌ ప్లాంట్ల లో నీటిమట్టాలు అడుగంటాయి. విద్యుత్‌ ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. ఆ దేశంలోని అతిపెద్ద పవర్‌ప్లాంట్‌ కొకాకొడా సిన్ క్లెయిర్‌లో నీటి మట్టాలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. ఇది సంక్షోభానికి దారితీసింది.

అవినీతి, నిర్లక్ష్యం కూడా..
పర్యావరణ పరిస్థితులకు తోడు ఈక్వెడార్‌లో అవినీతి, నిర్లక్ష్యం పెరిగింది. పరిస్థితి తీవ్రతను దాచి ఉన్నతాధికారులు విధ్వంసానికి పాల్పడ్డారని అధ్యక్షుడు డేనియల్‌ ఆరోపించారు. ప్రస్తుతమున్న ఎనర్జీ మంత్రిని తొలగించి, కొత్తవారిని నియమించారు. దేశంలో తగిన వర్షాలు లేకపోవడం, పొరుగున ఉన్న కొలంబియా విద్యుత్‌ ఎగుమతిని నిలిపివేయడంతో వర్క్‌ ఫ్రం హోమ్‌ ప్రకటన వచ్చింది.

శాంతిభద్రతల సమస్య…
ఇదిలా ఉంటే.. అవినీతి ఆరోపణలతో పూర్వ అధ్యక్షుడు గిలెర్మో లాస్సో పార్లమెంటును అర్థంతరంగా రద్దు చేశారు. మధ్యంతర ఎన్నికల్లో 35 ఏళ్ల డేనియల్‌ విజయం సాధించారు. 2023 చివర్లో ఆయన పదవి చేపట్టారు. అయితే ప్రస్తుతం ఆ దేశంలో శాంతిభద్రతల సమస్య నెలకొని ఉంది. జనవరిలో జైళ్ల నుంచి ఇద్దరు మాదకద్రవ్యాల స్మగ్లర్లు తప్పించుకున్నారు. ఆ తర్వాతే దేశంలో వరుసగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. స్వయంగా అధ్యక్షుడికే హెచ్చరిక సందేశాలు పంపారు. ఈనేపథ్యంలో కఠిన చర్యలకు దిగిన అధ్యక్షుడు ఉగ్ర ముఠాలకు చెందిన సభ్యులు ఎక్కడ కనిపించినా హత మార్చే అధికారం సైన్యానికి ఇచ్చారు.