Nobel Prize 2022: జీవం పుట్టుక అనేది అనేక పరిణామాల తర్వాత జరుగుతుంది. ఆ పరిణామ క్రమాన్ని సోదాహరణంగా వివరించాడు కాబట్టే చార్లెస్ డార్విన్ జీవ పరిణామక్రమ సిద్ధాంతకర్త అయ్యాడు. ఆయన చూపిన బాట.. నేడు ఎన్నో ఆవిష్కరణలకు బీజం వేసింది. ఎంతోమంది శాస్త్రవేత్తలు కొత్త కొత్త సిద్ధాంతాలను ప్రవేశపెడుతున్నారు. నాడు చార్లెస్ డార్విన్ జీవ పరిణామ క్రమ సిద్ధాంతాన్ని కనుగొనకపోతే ఈరోజు ఈ భూమి మీద మనిషి జీవితం అనేది ఇంత సులభం అయ్యేది కాదు. కానీ చార్లెస్ డార్విన్ చేదించలేని సవాళ్లను ఈ విశ్వం ఇంకా మానవజాతి ముందు ఉంచుతూనే ఉంది. వాటిని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రేయింబవళ్లు ప్రయోగాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. అలాంటి వాటిల్లో చాలా మటుకు పరిశోధనలు నోబెల్ బహుమతులను సాధించాయి.. ఈ ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాల ప్రకటన ప్రారంభమైంది. వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గాను ఈ ఏడాది స్వాంటే పాబో కు నోబెల్ పురస్కారం లభించింది. మానవ పరిణామ క్రమం, అంతరించి పోయిన హొమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు గానూ ఆయనకు ఈ పురస్కారం లభించింది.

ఇంతకీ ఏం కనుగొన్నారు అంటే
జీవ పరిణామ క్రమం తర్వాత జీవీ ఎదుగుతున్న కొద్దీ కొన్ని జన్యువులు పరివర్తనాలు చెందుతాయి. ఆ క్రమంలోనే అంతరించిపోతాయి. ఇలాంటి వాటిల్లో నియాండెర్తల్ జన్యువు ఒకటి. దీనిని పాబో సీక్వెన్స్ చేయడంతో పాటు గతంలో ఎవరికీ తెలియని హోమినిన్ డేనిసోవా కు సంబంధించిన సంచలనాత్మక ఆవిష్కరణ చేశారు.. దీని ప్రకారం దాదాపు 70 వేల సంవత్సరాలకు పూర్వం ఆఫ్రికా నుంచి వలస వచ్చిన తర్వాత ప్రస్తుతం అంతరించిపోయిన ఈ హోమినిన్ ల నుంచి హోమో సేపియన్లకు జన్యువు బదిలీ జరిగిందని పాబో తన ప్రయోగాల ద్వారా కనుగొన్నారు. దీని ఫలితంగానే ప్రస్తుత మానవుల్లోనూ ఈ పురాతన జన్యువుల ప్రవాహం కొనసాగుతోంది. ఇది మన శరీరానికి సంబంధించి రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తోంది. అంటువ్యాధుల నివారణకు ప్రతి స్పందిస్తోంది.. పాబో సెమినల్ పరిశోధన పూర్తిగా నూతన శాస్త్రీయ డిసిప్లిన్ పాలియో జెనోమిక్స్ కు దారి తీసినట్టు నోబెల్ కమిటీ ప్రకటించింది. స్వాంటే పాబో ప్రస్తుతం జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంత్రో పాలజీ డైరెక్టర్ గా ఉన్నారు.. వైద్యశాస్త్రంలో గత ఏడాది అమెరికాకు చెందిన డేవిడ్ జూలియస్, అర్డేమ్ పటా పౌటియన్ లు సంయుక్తంగా నోబెల్ బహుమతి అందుకున్నారు. ఉష్ణ గ్రాహకాలు, శరీర స్పర్శ పై చేసిన పరిశోధనలకు గాను వీరికి ఈ అవార్డు లభించింది..
ఇప్పటివరకు ఎన్ని నోబెల్ బహుమతులు అందించారంటే
1901 నుంచి 2021 వరకు వైద్యశాస్త్రంలో 112 నోబెల్ బహుమతులు అందించారు. లో 12 మంది మహిళలు ఉన్నారు. నోబెల్ బహుమతి గ్రహీతలకు ఒక గోల్డ్ మెడల్, పది మిలియన్ క్రోనోర్ ( 1.14 మిలియన్ డాలర్లు) అందజేస్తారు. 1896లో మరణించిన స్వీడన్ కు చెందిన శాస్త్రవేత్త, ఇంజనీర్ ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి నోబెల్ బహుమతిని ప్రధానం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఏడాదికి సంబంధించి నోబెల్ బహుమతులు సాధించిన విజేతల వివరాలు వెల్లడిస్తున్నారు. ఐదు రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది.

మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి, శనివారం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పురస్కార గ్రహీతల పేర్లు ప్రకటిస్తారు. అయితే మన దేశం నుంచి సర్ సివి రామన్ సైన్స్ విభాగంలో రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గానూ నోబెల్ బహుమతి పొందారు.. ఇది భౌతిక శాస్త్రంలో ఎన్నో క్లిష్టమైన సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తోంది.. విశ్వంలో ఏర్పడే బ్లాక్ హోల్స్ లేదా కృష్ణ బిలాల గురించి రామన్ ఎఫెక్ట్ సోదాహరణంగా వివరిస్తుంది. దీని ఆధారంగా చేసుకుని విశ్వం పుట్టుకను తెలుసుకునే ప్రయత్నంలో నాసా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. సర్ సివి రామన్ మాత్రమే కాకుండా, అమర్త్యసేన్, రవీంద్రనాథ్ ఠాగూర్, మదర్ థెరిస్సా, హర్ గోవింద్ ఖురానా, సుబ్రహ్మణ్య చంద్రశేఖర్, వెంకట్రామన్ రామకృష్ణన్, కైలాస్ సత్యార్థి, అభిజిత్ బెనర్జీ వంటి వారు నోబెల్ బహుమతులను అందుకొని భారత దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేశారు.