Munugode By Election: కొన్నిసార్లు కాంగ్రెస్కు జై కొట్టింది. ఇంకా కొన్నిసార్లు కమ్యూనిస్టులను ఆదరించింది. 2014 కారు ప్రభంజనంలో గులాబీని అక్కున చేర్చుకుంది. 2018లో మళ్లీ చేయి కి చేయూతనందించింది. ఇప్పుడు మళ్లీ ఉప పోరుకు సిద్దమైంది. ఇంతకీ మునుగోడు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎవరిని గెలిపించాలని అనుకుంటున్నారు? గత ఫలితం పునరావృతం అవుతుందా? లేకుంటే ఈసారి ఏమైనా కొత్తది జరుగుతుందా?

ఇదీ గత చరిత్ర
మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి నవంబర్లో ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ అధికారికంగా సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నెల రోజుల్లో ఉపఎన్నికతంతో ముగుస్తుంది. వాస్తవానికి దసరా పండుగ తర్వాత నోటిఫికేషన్ వస్తుందని నేతలంతా భావించారు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్నికల కమిషన్ విజయదశమి పండుగకు రెండు రోజుల ముందుగానే నోటిఫికేషన్ వెలువరించింది. దీంతో ప్రధాన పార్టీల నేతలంతా అప్రమత్తమయ్యారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని తానై వ్యవహరిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి, బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటల యుద్ధం మొదలుపెట్టారు. మునుగోడు నియోజకవర్గం నల్లగొండ, భువనగిరి జిల్లాలోని ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీల పరిధిలో విస్తరించి ఉంది. మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుపల్ మండలాలు నల్లగొండ జిల్లా పరిధిలోకి వస్తుండగా, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాలు యాదాద్రి జిల్లా పరిధిలోకి వస్తున్నాయి. నల్లగొండ జిల్లాలోని చండూరు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలుగా ఉన్నాయి. మునుగోడు పూర్తిగా గ్రామీణ నియోజవర్గం కాగా.. 2,27,265 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కేవలం 32, 407 ఓట్లు చౌటుప్పల్ చండూరు మున్సిపాలిటీ ల పరిధిలో ఉన్నాయి. 1967లో ఈ నియోజవర్గం ఏర్పాటయింది. ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆరుసార్లు కాంగ్రెస్, ఐదుసార్లు సిపిఐ, ఒకసారి టిఆర్ఎస్ గెలుపొందింది. 1967 నుంచి 1985 వరకు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విజయాలు సాధించారు. 1985 నుంచి సిపిఐ అభ్యర్థి ఉజ్జిని నారాయణరావు మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1999లో కాంగ్రెస్ నుంచి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విజయం సాధించగా, 2004లో జరిగిన ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థి పల్లా వెంకట్ రెడ్డి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో సిపిఐ నుంచి బుజ్జిని యాదగిరిరావు పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో 2014లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు.
ఇప్పుడు పరిస్థితి ఏంటి
టిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించకపోయినా ఆ ప్రభావం కనిపించకుండా ఉండేందుకు జగదీష్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి కూతురు స్రవంతి రెడ్డి పోటీ చేస్తున్నారు. బిజెపి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఈ ముగ్గురిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే నియోజకవర్గ మొత్తం చుట్టివచ్చారు. ఆర్థిక బలం మెండుగా ఉన్న నాయకుడు కావడంతో ఓట్లను బాగానే ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎలాగూ వస్తుందని భావించి ఇప్పటికే రెండు దఫాలుగా ప్రచారం పూర్తి చేశారు.

నోటిఫికేషన్ విడుదలలో జాప్యం వల్ల కొంత విరామం ఇచ్చారు. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లాస్ పీకడంతో మళ్లీ ప్రచారంలో క్రియాశీలకంగా మారారు. అయితే స్రవంతి రెడ్డి కూడా కాలికి బలపం కట్టుకొని నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు. తన తండ్రికి ఉన్న స్ట్రాంగ్ ఓటు బ్యాంకును తన వైపు మళ్ళించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిని ప్రకటించకపోయినా.. మంత్రి జగదీష్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించుకున్నట్టు తెలుస్తోంది. పైగా ప్రభాకర్ రెడ్డి జగదీష్ రెడ్డికి నమ్మిన బంటు పోవడంతో టికెట్ ఆయనకే వచ్చేలా కృషి చేస్తున్నారు. ఇటీవల నియోజకవర్గానికి చెందిన కొంతమంది నేతలు ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వంపై ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వారందరినీ ప్రగతి భవన్ కు పిలిపించుకొని మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో మునుగోడులో ఉప ఎన్నికల వాతావరణం వేడి ఎక్కింది.
ఓవరాల్ గా చూస్తే మునుగోడులో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ టగ్ ఆఫ్ వార్ నడువనుంది. ఇక కాంగ్రెస్ ను తక్కువ చేయడానికి లేదు. ఈ ముగ్గురి సంకుల సమరంలో కోమటిరెడ్డిపై వ్యతిరేకత బీజేపీకి మైనస్ గా మారుతోంది. అభివృద్ధి కోణంలో చూస్తే టీఆర్ఎస్ నే జనాలు ఎంచుకునే అవకాశాలు ఉంటాయి. కానీ అక్కడి టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిపై వ్యతిరేకత జనాల్లో ఉంది.. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయిపై సానుభూతి క్లీన్ నీట్ ఇమేజ్ కారణంగా ఆమెకు గెలుపు అవకాశాలు ఉంటాయని అర్థమవుతోంది.
[…] Also Read: Munugode By Election: మునుగోడు గత చరిత్ర ఇది.. ఇప్పు… […]