America: అగ్రరాజ్యంలో మళ్తీ జాత్యహంకారం.. నల్ల జాతీయులే లక్ష్యంగా మెస్సేజ్‌లు!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలవడంతో ఆ దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు 4బీ ఉద్యమం జరుగుతోంది. మరోవైపు గర్భ నిరోధక మాత్రలకు డిమాండ్‌ పెరిగింది. ఇంకోవైపు జాత్యహంకార మెస్సేజ్‌లు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Written By: Raj Shekar, Updated On : November 12, 2024 5:51 pm

America(4)

Follow us on

America: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ జాత్యహకారం గొడవలు జరుగబోతున్నాయా.. ట్రంప్‌ గెలుపుతో అమెరికన్లు నల్ల జాతీయులను టార్గెట్‌ చేశారా.. అంటే అవుననే అంటున్నారు అమెరికాలోని నల్లజాతీయులు. తమకు కొంతమంది బెదిరింపు మెస్సేజ్‌లు పంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యూయార్క్, అలబామా, కాలిఫోర్నియా, ఓహాయో, పెన్సిల్వేనియా, టెనెసి వంటి రాష్ట్రాల్లో ఈ మెస్సేజ్‌లు ఎక్కువగా వస్తున్నాయని. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మెస్సేజ్‌లలో వాడిన పదాలు భిన్నంగా ఉన్నా.. బెదిరింపులు మాత్రం ఒకేలా ఉన్నాయని బాధితులు పేర్కొంటున్నారు. కొందరిని స్వస్థలం చిరునామా చెప్పాలని బెదిరిస్తుండగా, మరికొందరిని రాబోయే అధ్యక్ష పాలన గురించి హెచ్చరిస్తున్నారు. మరోవైపు బెదిరింపు మెస్సేజ్‌లపై ఎఫ్‌బీఐ అధికారులు విచారణ చేపట్టారు. ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్, స్టేట్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తు చేస్తున్నాయి.

కించపరిచే వ్యాఖ్యలు
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ నవంబర్‌ 5న జరిగింది. 6వ తేదీనాటికి ఫలితాలు వెల్లడయ్యాయి. వారం తిరగకుండానే నల్ల జాతీయులకు జాత్యహంకార మెస్సేజ్‌లు రావడం కలవరపెడుతోంది. కౌంటింగ్‌ పూర్తయిన రోజే తన 16 ఏళ్ల కూతురు ఫోన్‌కు మెస్సేజ్‌ వచ్చిందని కాలిఫోర్నియాలోని లోడికి చెందిన తాషా డన్హామ్‌ తెలిపారు. నార్త్‌ క రోలినాలోని ఒక తోటకు రావాలని అందులో ఉందని తెలిపారు. ఆరా తీస్తే అక్కడ ఒక మ్యూజియం ఉందని పేర్కొన్నారు. పెన్సిల్వేనియాలోని మాంట్తోమెరి కౌంటీలో ఆరుగురు మిడిల్‌ స్కూల్‌ విద్యార్థులకు కూడా ఇలాంటి మెస్సేజ్‌లు వచ్చాయని తెలిపారు. దక్షిణ కరోలినాలోని క్లెమ్సన్, అలబామా వంటి యూనివర్సిటీ విద్యార్థులకు కూడా మెస్సేజ్‌లు వస్తున్నాయి. టెనెసీలోని నాష్విల్లేలో ఉన్న చారిత్రక నల్లజాతి విశ్వవిద్యాలయం ఫస్క్‌ ఈమేరకు ప్రనకటన విడుదల చేసింది. నల్లజాతి విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మెస్సేజ్‌లు వస్తున్నాయని తెలిపింది. మిస్సోరి స్టేట్‌ యూనివర్సిటీ విద్యార్థులకు కూడా మెస్సేజ్‌లు వచ్చాయని పేర్కొంటున్నారు. వాటిలో ట్రంప్‌ గెలుపు గురించి ప్రస్తావించారని చెబుతున్నారు. నల్ల జాతి విద్యార్థులను పత్తి ఏరడానికి ఎంపిక చేశారంటూ పేర్కొంటున్నారని మిస్సోరి ఎన్‌ఏఏసీపీ అధ్యక్షుడు నిమ్రోద్‌ చాపెల్‌ తెలిపారు. విద్వేషాలకు అమెరికాలో స్థానం లేదని పేర్కొన్నారు. 2024లో బానిసత్వ ప్రస్తావనలు తీవ్రంగా కలవరపెడుతున్నాయని వెల్లడించారు.