Modi: భారత్, చైనా మధ్య మూడే నాలుగేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కరోనా కాలం నుంచి చైనాతో ప్రధాని మోదీ కఠినంగా వ్యవహరిస్తున్నారు. గాల్వన్ ఘటన తర్వాత చైనా ఉత్పత్తులను నిషేధించారు. చైనా యాప్స్ బ్యాన్ చేశారు. భారత సమాచార వ్యవస్థలో జోక్యం చేసుకునేందుకు, భారత సైనిక రహస్యాలు తెలుసుకునేందుకు చేసే అనేక కుట్రలను భారత్ తిప్పికొట్టింది. మరోవైపు భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను చైనా తమవిగా ప్రకటించుకుంటోంది. ఇటీవల కొన్ని ఊళ్లకు పేర్లు కూడా పెట్టి మ్యాప్ రిలీజ్ చేసింది. ఇలా భారత్, చైనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో మోదీ తాజాగా చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. చైనాతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని తెలిపారు. సరిహద్దు వివాదం త్వరగా సమసిపోవాలని ఆకాంక్షించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్‌గా చర్చనీయాంశమయ్యాయి. మోదీ తీసుకునే ప్రతీ నిర్ణయం వెనుక ఒక వ్యూహం ఉంటుందని, తాజాగా మోదీ చైనాతో స్నేహం కోరుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్న చర్చ జరుగుతోంది.
ఇరు దేశాలకు మేలు..
భారత్, చైనా మద్య స్థిరమైన, శాంతియుతమైన సంబంధాలు ఇరు దేశాలకే కాకుండా ప్రపంచానికి కూడా ముఖ్యమైనదని మోదీ అభిప్రాయపడ్డారు. ద్వైపాక్షిక చర్చల ద్వారా సరిహద్దు ఉద్రిక్త పరిస్థితులను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శాంతి సంబంధాలు నెలకొనడం ఇరు దేశాలకు అవసరమని తెలిపారు. ఇరు దేశాల మధ్య దౌత్య, మిలటరీ స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సరిహద్దుల్లో శాంతిని పునరుద్ధరించగలమన్న ధీమా వ్యక్తం చేశారు.
2020లో గాల్వాన్ ఘటన..
2020, జూన్‌లో తూర్పు లడక్‌లోని గాల్వన్ వ్యాలీ వద్ద చోట్టుచేసుకున్న ఘర్షణల నుంచి భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో అనేకసార్లు దౌత్య, ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే చైనా మాత్రం తరచూ ఏదో ఒక సరిహద్దు వద్ద కవ్వింపులకు దిగుతోంది. ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 30 ప్రాంతాల పేర్లు మార్చింది. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలో మోదీ స్నేహహస్తం ఇవ్వడం గమనార్హం.