BJP
BJP: అసలు ఏపీలో పొత్తు ధర్మం నడుస్తోందా? బిజెపికి సరైన గౌరవం దక్కుతోందా? టిడిపి, జనసేన ల నుంచి ఆశించిన సహకారం అందుతోందా? అంటే మౌనమే సమాధానమవుతోంది. సీఎం రమేష్, సుజనా చౌదరి, పురందేశ్వరి, విష్ణు కుమార్ రాజు,సత్య కుమార్ వంటి నేతల విషయంలో మాత్రం ఆశించిన సహకారం అందుతోంది. కానీ మిగతా నేతల విషయంలో మాత్రం అడుగడుగున ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ రెండు పార్టీల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. కానీ సరిదిద్దే స్థితిలో రాష్ట్ర నాయకత్వం లేదు. పట్టించుకునే స్థితిలో కేంద్ర నాయకత్వం లేదు. దీంతో పొత్తులో భాగంగా టిక్కెట్లు దక్కించుకున్న వారు ఆపసోపాలు పడాల్సి వస్తోంది.
పొత్తులో భాగంగా అనపర్తి సీటును బిజెపికి కేటాయించారు. అక్కడ బిజెపి అభ్యర్థిగా శివరామకృష్ణంరాజు ఖరారయ్యారు. దీంతో అక్కడ టిడిపి మైండ్ గేమ్ ఆడటం ప్రారంభించింది. అక్కడ టిడిపి ఇన్చార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టికెట్ ఆశించారు. దీంతో శివ కృష్ణంరాజుపై టిడిపి శ్రేణులు ఓ రేంజ్ లో విరుచుకు పడడం ప్రారంభించాయి. ఆయన పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడుగా కూడా గెలవలేదని.. అటువంటి వ్యక్తికి టిక్కెట్ ఇస్తే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న ఆ రెండు పార్టీల నుంచి వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోశివరామకృష్ణంరాజును మార్చి.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది.
అటు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు. కానీ వెనక్కి తగ్గలేదు. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన శ్రేణులు బిజెపి అభ్యర్థి పట్ల అమర్యాదగా ప్రవర్తించాయి. ప్రచారంలో భాగంగా శివరామకృష్ణంరాజు ఉండగా.. ఆయన మెడలో ఉన్న టిడిపి, జనసేన కండువాలను తీసేయాలని ఆ రెండు పార్టీల శ్రేణులు డిమాండ్ చేయడం సంచలనం కలిగిస్తోంది. కండువాలకు ఒప్పుకోలేని వారు.. ఓట్లు ఎలా వేస్తారని.. ఓట్ల బదలాయింపు ఎలా జరుగుతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇది పొత్తు ధర్మానికి విఘాతం కలిగించడమేనని బిజెపి శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
అయితే దీనిపై బిజెపి రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ఏం జరిగిందని ఆరా తీయలేదు. ఇలా ఉంటే పొత్తు ఎలా పొడుస్తుందని… దాని ఫలితం ఎలా ఉంటుందని.. ఓట్ల బదలాయింపు సక్రమంగా జరిగే పరిస్థితి ఉండదని బిజెపినేతలు భావిస్తున్నారు. కేవలం ఒకరిద్దరు నేతల కోసమే బిజెపి పొత్తు వర్క్ అవుట్ అవుతుందని.. ఆ ముగ్గురి కోసమే అన్నట్టు.. మిగతా వారి కోసం లేదన్నట్టు జరుగుతున్న పరిణామాలు బిజెపి శ్రేణులను కలిచివేస్తున్నాయి. ఇలానే కొనసాగితే పొత్తుతో టిడిపి, జనసేన లకు మేలు జరగవచ్చు కానీ.. బిజెపికి మాత్రం ఎనలేని నష్టం జరుగుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కానీ కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు పట్టించుకోకపోయేసరికి వారికి ఏం చేయాలో పాలు పోవడం లేదు.