Larry Ellison: ప్రపంచ కుబేరుడిగా అర్ధ దశాబ్దంపాటు కొనసాగాడు ఎలాన్ మస్క్. అయితే మస్క్ ఆధిపత్యానికి చెక్ పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో విభేదాలు వచ్చిన కొన్ని రోజులకే మస్క్ నంబర్ వన్ స్థానం కోల్పోయాడు. ఇప్పుడు ప్రపంచ కుబేరుడిగా ట్రంప్ ఫ్రెండ్ ఒరాకిల్ సంస్థ అధినేత ఎల్లిసన్ నిలవడం చర్చనీయాంశంగా మారింది.
ఒరాకిల్ కంపెనీ ఇటీవల విడుదల చేసిన ఆదాయ నివేదిక ఆర్థిక మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) కస్టమర్ల నుంచి డేటా సెంటర్ సామర్థ్యానికి భారీ డిమాండ్‌తో ఒరాకిల్ షేర్లు ఒక్క రోజులో 40% పెరిగాయి. ఈ ఆర్థిక విజయం ల్యారీ ఎల్లిసన్ సంపదను 101 బిలియన్ డాలర్లకు పెంచి, 393 బిలియన్ డాలర్లకు చేర్చింది. దీంతో ఎలాన్ మస్క్‌ను (385 బిలియన్ డాలర్లను) అధిగమించి, బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో అగ్రస్థానానికి చేరాడు.
ఒరాకిల్ ఏఐ వ్యూహం..
ఒరాకిల్ సీఈవో సఫ్రా కాట్జ్ ప్రకారం, కంపెనీ ఈ త్రైమాసికంలో నాలుగు బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్‌లపై సంతకం చేసింది. రాబోయే నెలల్లో మరిన్ని భారీ ఒప్పందాలు ఖాయమని ఆమె తెలిపారు. ఏఐ సాంకేతికతకు సంబంధించిన డేటా సెంటర్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను ఒరాకిల్ సమర్థవంతంగా అందిపుచ్చుకోవడం ఈ విజయానికి ప్రధాన కారణం. ఈ వ్యూహం కంపెనీ మార్కెట్ విలువను గణనీయంగా పెంచింది, ఎల్లిసన్ సంపదను కొత్త శిఖరాలకు చేర్చింది.
ఒరాకిల్ విజయం వెనుక..
81 ఏళ్ల ల్యారీ ఎల్లిసన్ 1977లో ఒరాకిల్‌ను స్థాపించాడు. 2014 వరకు సీఈవోగా సేవలందించారు. ప్రస్తుతం ఛైర్మన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా కొనసాగుతున్న ఆయన, కంపెనీ సాంకేతిక ఆవిష్కరణలకు మార్గదర్శకుడిగా ఉన్నారు. ఎల్లిసన్ వ్యాపార దూరదృష్టి, ఏఐ, క్లౌడ్ సాంకేతికతలపై దృష్టి సారించడం వల్ల ఒరాకిల్ ప్రపంచ టెక్ దిగ్గజంగా ఎదిగింది. ఆయన వ్యక్తిగత సంబంధాలు, ముఖ్యంగా ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలు, ఒరాకిల్‌కు వ్యాపార అవకాశాలను మరింత విస్తరించాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎలాన్ మస్క్‌పై ఎల్లిసన్ ఆధిపత్యం..
ఎలాన్ మస్క్ గతంలో ప్రపంచ కుబేరుడిగా ఆధిపత్యం చెలాయించినప్పటికీ, ఒరాకిల్ షేర్ల ఊపందిస్తూ ఎల్లిసన్ అతన్ని అధిగమించారు. టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి కంపెనీలతో మస్క్ సంపద గణనీయంగా ఉన్నప్పటికీ, ఒరాకిల్ ఇటీవలి ఆర్థిక విజయం ఎల్లిసన్‌ను ముందంజలో నిలిపింది. ఈ ఆర్థిక మైలురాయి టెక్ పరిశ్రమలో ఏఐకు పెరుగుతున్న ప్రాముఖ్యతను, అలాగే ఒరాకిల్ యొక్క వ్యూహాత్మక విజయాన్ని సూచిస్తుంది.