YCP Vs Lokesh: టిడిపి కూటమి( TDP Alliance) విజయోత్సవ సభ సక్సెస్ అయ్యింది. మూడు పార్టీల శ్రేణులు ఉరకలెత్తిన ఉత్సాహంతో సభకు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బిజెపి చీఫ్ మాధవ్, మూడు పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. రాయలసీమ నలుమూలల నుంచి భారీగా కూటమి పార్టీల శ్రేణులు తరలివచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేశాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రాంతంగా భావించే రాయలసీమలో కూటమి దూకుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపుతోంది. అన్నింటికీ మించి ఆ మూడు పార్టీల మధ్య మైత్రి మరింత పెరుగుతోంది. మూడు పార్టీలు జగన్మోహన్ రెడ్డిని ప్రత్యర్థి గానే భావిస్తున్నాయి. ఇది ఎంత మాత్రం వైసీపీకి మింగుడు పడడం లేదు.
* మరో 15 ఏళ్లు కూటమి..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ) తరచూ ఒక కామెంట్ చేస్తున్నారు. మరో 15 ఏళ్ల పాటు కూటమి కొనసాగుతుందని తేల్చి చెబుతున్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేస్తామని కూడా చెప్పుకొస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో లేనంత ధీమాను పవన్ వ్యక్తపరుస్తున్నారు. అలాగని తాను ముఖ్యమంత్రి అవుతానని చెప్పడం లేదు. చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేస్తామని చెప్తున్నారు. ఇది ఎంత మాత్రం సహించడం లేదు వైసీపీకి. పవన్ దూకుడు, ఆగ్రహం కారణంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు అనేది చెడిపోతుందని ఒక అంచనాకు వచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ కూటమి పాలన సజావుగా నడిచిపోతోంది. పవన్ కళ్యాణ్ సైతం కూటమికి వలయంగా మారుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి ప్రయత్నాన్ని నిలువరించగలుగుతున్నారు. ఇంకోవైపు బిజెపి సైతం ఎనలేని సహకారం అందిస్తోంది. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన మాధవ్ సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో చాలా దూకుడుగా ఉంటున్నారు. ఈ పరిణామాలన్నీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం సహించడం లేదు.
* మోడీకి జై కొట్టిన లోకేష్..
తాజాగా మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh) సైతం కీలక ప్రకటన చేశారు. 2029 లోనూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ తో పాటే ముందుకెళ్తామని తేల్చి చెప్పారు. మోడీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అదే సమయంలో కేంద్ర పెద్దలు లోకేష్ ను ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడడం కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆందోళనకు కారణం. గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉండేటప్పుడు కేవలం ఐదు నిమిషాల భేటీతో కేంద్ర పెద్దలు ముగించేవారు. కానీ లోకేష్ విషయంలో అలా కాదు. ప్రత్యేకంగా ఢిల్లీ పిలిపించి గంటలపాటు సమావేశం అవుతున్నారు. ఏకాంత భేటీలు నిర్వహిస్తున్నారు. తద్వారా ఏపీకి భావి నాయకుడు లోకేష్ అని సంకేతాలు పంపిస్తున్నారు కేంద్ర పెద్దలు. ఇది ఎంత మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రుచించడం లేదు. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకే వారంతా ఐక్యంగా ముందుకెళ్తున్నారన్న అనుమానం సగటు వైసీపీ శ్రేణుల్లో ఉంది.
* కలిసి పోటీ చేసిన ప్రతిసారి..
2014లో టిడిపి, బిజెపి కలిసి పోటీ చేశాయి. ఆ రెండు పార్టీలకు జనసేన మద్దతు ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో టిడిపి, కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాయి. 2019 ఎన్నికల్లో మాత్రం ఎవరికి వారు వేరువేరుగా పోటీ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. 2024 ఎన్నికలు వచ్చేసరికి మాత్రం సీన్ మారింది. మళ్లీ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఏకపక్ష విజయం సాధించాయి. అందుకే ఆ మూడు పార్టీలు కలిసి ఉండాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం లేదు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే మాత్రం భిన్నంగా ఉన్నాయి. రోజురోజుకు వారి మధ్య బంధం రెట్టింపు అవుతోంది. ఈ పరిస్థితిని చూస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటిమీద కునుకు లేకుండా గడుపుతోంది. ఇబ్బందికర పరిస్థితులు తప్పవని భయపడుతోంది. మరి చూడాలి పరిస్థితులు ఎటు దారితీస్తాయో..!