China : పాండా చాలా అందంగా కనిపిస్తుంది కదా. అత్యంత అరుదైన జంతువు కూడా ఇదే. అయితే ఈ జంతువు పుట్టిల్లు చైనా. ఈ పాండాలను జాతీయ సంపదగా భావిస్తుంది డ్రాగన్ కంట్రీ. అంతర్జాతీయంగా తమ ప్రతిష్ఠను మరింత బలోపేతం చేసుకోవడం కోసం విదేశాలకు పాండాలను బహూకరించడం, ఇతర దేశాలతో సత్సంబంధాలను కొనసాగించేందుకు ఆనవాయితీ కూడా చైనాకు ఉంది. రీసెంట్ గా రెండు పాండాలకు పేరు పెట్టడానికి హాంకాంగ్ ప్రభుత్వం చాలా ఖర్చు చేసింది. అది ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఓన్లీ పేరు పెట్టడానికి హాంకాంగ్ ప్రభుత్వం ఏకంగా రూ.76 లక్షలు వెచ్చించి పోటీలు నిర్వహించింది. ఇంత ఖర్చు చేసినా సరే చివరకు వాటిని పాత పేర్లతోనే పిలుస్తున్నారు. అంటే చేసిన ఖర్చు మొత్తం వృధానే అన్నమాట. ఆ వివరాలు తెలుసుకోండి.
ఈ సంవత్సరం మొదట్లో హాంకాంగ్ అధికారులకు చైనా రెండు పెద్ద పాండాలను గిఫ్ట్ గా ఇచ్చింది. అయితే వీటి పేరు మార్చడానికి ఒక పోటీ నిర్వహించింది ఆ ప్రభుత్వం. దీని కోసం రూ. 76 లక్షలు ($ 90,028) ఖర్చు చేసింది ఆ గవర్నమెంట్. ఇంత హంగామా చేసి, ఖర్చు చేసినా చివరకు మాత్రం అదే పేరు ఉంచారు.
ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌లో ఓ నివేదిక వెల్లడైంది. అక్టోబరు నెలలో ఒక పెద్ద పాండాకు పేరు మార్చే పోటీని పెట్టారు. ఈ పోటీలో సిచువాన్‌కు చెందిన రెండు పాండాలను ఉంచారు. అయితే ‘యాన్ ఆన్’, ‘కే కే’ అనే పాండాలకు కొత్త పేర్లను పెట్టడానికి కొందరు ప్రజలను ఆహ్వానించారు. దీనికోసం ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను తయారు చేశారు. సిబ్బందిని నియమించడం, ఇంటర్నెట్‌లో హాంకాంగ్‌లోని మాస్ ట్రాన్సిట్ రైల్వే (MTR) స్టేషన్‌లలో ప్రకటనలు పోస్ట్ చేయడం, వంటి వివరాలు తెలపడం, అలాగే విజేతలకు బహుమతులు అందించడం కోసం ఈ డబ్బు ఖర్చు చేశారు. ఇక వీరు పెట్టిన ఈ పోటీలో విజేతకు రూ.5.16 లక్షలు బహుమతిని కూడా ఇచ్చారు. ఇందులో టూర్‌బిల్లాన్ వాచ్, ఓషన్ పార్క్ సభ్యత్వం, రూ.4 లక్షల విలువైన వోచర్లు ను కూడా అందించారు.
ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అవార్డు ప్రకటించినప్పటికీ, పాండాల అసలు పేర్లను అలాగే ఉంచుతామని తెలిపారు న్యాయనిర్ణేతలు. వీరి సమాధానం విన్న కొందరు డబ్బు వృధా గురించి ప్రశ్నించారు. సంస్కృతి, క్రీడలు, పర్యాటక శాఖ కార్యదర్శి రోసన్నా లా షుక్-పుయ్ కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ పేరును ప్రజలు ఇష్టపడతారని.. అందుకే అసలు పేరును ఉంచడానికి ఇష్టపడుతున్నామని అధికారులు తెలిపారు.
పాండాలు ఎక్కువగా నైరుతి చైనాలోని పర్వతాలలో ఎత్తైన సమశీతోష్ణ అడవులలో కనిపిస్తుంటాయి. ఇక్కడ అవి దాదాపు పూర్తిగా వెదురుపై జీవిస్తాయి. పాండాలు తినే వెదురులో ఏ భాగాన్ని బట్టి అవి ప్రతిరోజూ 26 నుంచి 84 పౌండ్ల వరకు తినాలి. ఈ పాండాలు తమ విస్తారిత మణికట్టు ఎముకలను ఉపయోగిస్తారు, అవి వ్యతిరేక బొటనవేళ్లుగా పనిచేస్తాయి.