Miyapur: మియాపూర్ ప్రాంతానికి చెందిన యువతి (మైనర్) చింటూ అనే యువకుడికి ఇన్ స్టా లో పరిచయం అయింది. అది కాస్తా ప్రేమగా మారింది.. అనంతరం వారు పలుమార్లు లైంగికంగా కలిశారు. అయితే పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేసరికి చింటూ దాటవేయడంతో.. ఆ యువతి అతడిని నిలదీయడం మొదలుపెట్టింది. దీంతో ఆమెను ఇంట్లో నుంచి రావాలని కోరడంతో 20 రోజుల క్రితం బయటికి వెళ్లిపోయింది. ఆ యువతి ఇంట్లో నుంచి వెళ్లిన రోజు రాత్రి చింటూ తన స్నేహితుడి ఇంటికి ఆ యువతిని తీసుకెళ్లాడు. అక్కడ వారు దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత చింటూ తన అసలు రూపాన్ని ఆ అమ్మాయికి చూపించాడు. తన స్నేహితుడి భార్య సహకారంతో ఆ యువతి ముఖంపై దిండును గట్టిగా అదిమిపెట్టి హత్య చేశాడు. ఆ తర్వాత ఆ యువతి మృత దేహాన్ని తుక్కుగూడలోని ఒక ప్లాస్టిక్ వస్తువులు తయారుచేసిన ఫ్యాక్టరీలో పడేశాడు.. తమ కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు చెప్పిన ఆధారాల ప్రకారం మియాపూర్ పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగు చూశాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
యువతి హత్య కేసు వివరాలను మియాపూర్ సిఐ క్రాంతికుమార్ వెల్లడించారు. ” మియాపూర్ ప్రాంతంలో ఉండే ఒక కుటుంబం తన కుమార్తె కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఈనెల 10న కంప్లైంట్ ఇచ్చారు.. 20 రోజుల క్రితం ఆ యువతి తన స్నేహితుడి వద్దకు వెళ్ళింది. అతని పేరు చింటూ అలియాస్ విగ్నేష్. అతని వద్దకు వెళ్లిన నాటి నుంచి ఆ యువతి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసేది. ఈనెల 8 నుంచి ఫోన్ చేయడం మానేసింది. అనుమానం వచ్చి వారు చింటూ కు ఫోన్ చేస్తే.. సరైన సమాధానం చెప్పలేదు. అయితే చింటూ తన స్నేహితుడైన సాకేత్ ఇంట్లో ఆ యువతిని ఉంచాడు. అతని ఇంట్లోనే వారు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె పెళ్లి చేసుకోవాలని పదేపదే ఒత్తిడి తీసుకురావడంతో పెళ్లి నాటకం ఆడినట్టు తెలుస్తోంది. సాకేత్, అతని భార్యతో ఆ యువతిని చంపడానికి చింటూ ఒక పథకం పన్నాడు. ఇందులో భాగంగా చింటూ స్నేహితుడైన సాకేత్ తన నివాసాన్ని ఉప్పు గూడ ప్రాంతం నుంచి మీర్ పేట కు మార్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చింటూ, స్నేహితుడు సాకేత్, అతని భార్య ఆ యువతి తలపై దిండును పెట్టి హత్య చేశారు. హత్య అనంతరం ఆ యువతి మృతదేహాన్ని తుక్కుగూడలోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పడేశారు. చింటూని.. అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చిందని” సిఐ క్రాంతికుమార్ పేర్కొన్నారు. కాగా, ఆ యువతిని హత్య చేసే పథకంలో భాగంగా చింటూ పదేపదే ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసేవాడు. ” మీ అమ్మాయి ఇంటికి వచ్చిందా” అని అడిగేవాడు.. ఆ దిశగానే పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.