Joe Biden: జోబైడెన్‌కు ఏమైంది.. ఇటలీలో వింత ప్రవర్తన!

ఇటలీ వేదికగా నిర్వహిస్తున్న జీ7 దేశాల సదస్సుకు హాజరయ్యాడు బైడెన్‌. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్‌ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.

Written By: Raj Shekar, Updated On : June 14, 2024 1:35 pm

Joe Biden

Follow us on

Joe Biden: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. తీరు అప్పుడుప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వృద్ధాప్యం కారణంగా ఆయనకు మతిమరుపు వచ్చిందని చాలా మంది పేర్కొంటున్నారు. తాజాగా మరోమారు ఆయన అధ్యక్ష రేసులో నిలిచారు. ఈ క్రమంలో ఇటలీ వేదికగా నిర్వహిస్తున్న జీ7 దేశాల సదస్సుకు హాజరయ్యాడు బైడెన్‌. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్‌ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇక ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యేక ఆహ్వానం అందడంతో ఆయన జూన్‌ 13న ఇటలీ బయల్దేరి వెళ్లారు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్ స్కీ సహా పరిమితంగా ఎంపిక చేసిన దేశాల అధ్యక్షులు ఉన్నారు.

అపూలియాలో సదస్సు..
ఇక జీ7 సందస్సు ఇటలీ తీర ప్రాంత నగరం అపూలియాలో రెండు రోజులు జరుగనుంది. ఇందులో అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయెల్‌ మాక్రాన్, బ్రిటన్, కెనడా ప్రధానులు రిషి సునాక్, జస్టిన్‌ ట్రుడో, జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ ష్కాల్జ్‌ యూరోపియన్‌ కమిషన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్‌ ఇటలీ చేరుకున్నారు. ఈ జీ7 సదస్సు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అధ్యక్షతన జరుగుతుంది.

వాణిజ్య ఒప్పందాలు.. ఉక్రెయిన్‌ సమస్య..
ఇక ఈ సదస్సులో పలు అంశాలు చర్చకు రానున్నాయి. జీ7 దేశాల వాణిజ్య ఒప్పందాలు జరుగనున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని కట్టడి చేసే అంశంపైనా చర్చించే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం కల్పించే అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

తీరప్రాంత సందర్శన..
ఇక సదస్సు ప్రారంభానికి ముందు జీ7 దేశాధినేతలు అపూలియా తీరప్రాంతాన్ని సందర్శించారు. వాటర్‌ స్పోర్ట్స్‌ను వీక్షించారు. పారాగ్లైడింగ్‌ చేస్తున్న దృశ్యాలను తిలకించారు. ఈ క్రమంలో బైడెన్‌ వింతగా ప్రవర్తించాడు. రిషి సునాక్, జస్టిన్‌ ట్రూడో, మెలోనీ, ఉర్సులా వాన్‌ డెర్‌.. ఒకవైపు ఉండి వాటర్‌ స్పోర్ట్స్‌ను తిలకిస్తోండగా.. జో బైడెన్‌ మాత్రం వారికి దూరంగా వెళ్లి మరోవైపు చూస్తూ నిల్చున్నారు. అక్కడ ఎవరూ లేకపోయినా.. ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కుడిచెయ్యి ఎత్తి పలకరిస్తున్నట్లు సైగలు చేశారు. దీనిని గమనించిన మోలోనీ జో బైడెన్‌ వద్దకు వెళ్లి.. ఆయన చెయ్యి పట్టుకుని వెనక్కి లాగారు. దీంతో బైడెన్‌ తేరుకుని, మళ్లీ వారితో కలిసిపోయారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌..
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. బైడెన్‌కు ఏమైంది.. ఎందుకలా ప్రవర్తిస్తున్నాడని కొందరు.. అమెరికాను ఆ దేవుడే కాపాడాలి అంటూ మరికొందరు కామెంట్స్‌ పెడుతున్నారు.