Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గుడువు సమీపిస్తోంది. అన్నివర్గాల ఓటర్లను ఆకట్టుకునేందకు అధ్యక్ష రేసుకలో ఉన్న నేతలు ప్రచారం స్పీడు పెంచారు. ప్రధాన పోటీ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్యనే నెలకొంది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో ఇరు పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా జరిగిన డిబేట్‌లో అధికార డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా పైచేయి సాధించారు. స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు. మరోవైపు ప్రీపోల్ సర్వేల్లోనూ కమలా ఆధిపత్యం కనబరుస్తున్నారు. దీంతో మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని రేసులో ముందు నిలవాలని ట్రంప్ భావిస్తున్నారు. మరోవైపు అధికార డెమొక్రటిక్ పార్టీ ఇదే దూకుడు ప్రదర్శిస్తూ.. మరోమారు అధికారం చేపట్టాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆఫ్రికా, ఆసియా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కమలా ప్రవాస ఆఫ్రికా, ఆసియా సంతతి నేత కావడమే ఇందుకు కారణం. స్వింగ్ స్టేట్స్‌లో ఆధిపత్యం కనబర్చడమే ఇందుకు నిదర్శనం. దీనిని మరింత పెంచుకునేందుకు బైడెన్ కొత్త ఎత్తుగడ వేశారు. ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటున్న వేళ అమెరికాకు రావాలని ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ భారత ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించారు.
క్యాడ్ సభ్య దేశాల సమావేశం..
అమెరికా క్యాడ్ సభ్య దేశాల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వబోతోంది. సెప్టెంబర్ 21న డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో ఈ సదస్సు ఏర్పాటు చేయనున్నారు. ఇన్– పర్సన్ క్వాడ్ సమ్మిట్ ఈ ఏడాది విల్మింగ్టన్‌లో ఏర్పాటు కాబోతోండటం ఇదే తొలిసారి. క్యాడ్‌లో అతిథ్య అమెరికాతోపాటు ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్‌కు సభ్యత్వం ఉంది. జో బైడెన్, మోదీతోపాటు ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులు ఆంథోని అల్బెనీస్, ఫ్యూమియో కిషిడ ఇందులో పాల్గొంటారు. 2021లో వైట్‌హౌస్‌లో మొట్టమొదటి క్వాడ్ లీడర్స్ సమ్మిట్ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఏటా సమావేశం జరుగుతుంది.
ఇటీవలే విదేశాంగ మంత్రుల భేటీ..
ఇదిలా ఉంటే.. క్యాడ్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు ఎనిమిదిసార్లు సమావేశమయ్యారు. సభ్య దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపొందిచడం, ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో– పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వడం, ఆరోగ్య భద్రత, విపత్తుల నిర్వహణ, సరిహద్దుల భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ అంశాలపై చర్చిస్తారు.
ట్రంప్ జిగిరీ దోస్త్ మోదీ..
ఇదిలా ఉంటే.. నరేంద్ర మోదీ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో మోదీ ట్రంప్ తరఫున ప్రచారం కూడా చేశారు. కానీ, బైడెన్ గెలిచారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బైడెన్ నుంచి మోదీకి ఆహ్వానం వచ్చింది. ఎన్నికల వేళ.. మోదీ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా.. లేక సమావేశానికి మాత్రమే పరిమితమవుతారనా అన్నది చూడాలి.
మిగిలింది 50 రోజులే..
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 50 రోజులే ఉంది. ఈ ఏడాది నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ తరుణంలో అమెరికా నుంచి ఆహ్వానం అందడం చర్చనీయాంశమైంది. ప్రవాస భారతీయ ఓటర్లను ఆకట్టుకునేందుకే బైడెన్ మోదీని ఆహ్వానించారన్న చర్చ జరుగుతోంది. అయితే బైడెన్ ఆహ్వానంపై మోదీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మోదీ అమెరికా పర్యటనపై శుక్రవారం(సెప్టెంబర్ 13న) విదేశాంగ శాఖ ప్రకటన చేసే అవకాశం ఉంది. పర్యటన ఖరారైతే షెడ్యూల్ కూడా విడుదల చేస్తుందని తెలుస్తోంది.