https://oktelugu.com/

Israel vs. Hezbollah : ఇజ్రాయెల్‌ వర్సెస్‌ హెజ్‌బొల్లా..పశ్చిమాసియాలో భీకర యుద్ధం.. విస్తరిస్తుందా?

పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ యుద్ధం చేస్తోంది. ఇటీవలే హమాస్‌ చీఫ్‌ను హతమార్చింది. దీంతో హెజ్‌బొల్ల, ఇరాన్‌ ఇజ్రాయెల్‌పై ఆగ్రహంగా ఉన్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 25, 2024 / 01:10 PM IST

    Israel vs. Hezbollah

    Follow us on

    Israel vs. Hezbollah :  హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాదాపు ఏడాదిగా యుద్ధం చేస్తోంది. పాలస్తీనపై హమాస్‌ ప్రాంతాలపై రాకెట్లు, బాంబులతో విరుచుకుపడుతోంది. బంకర్లను ధ్వంసం చేసింది. హమాస్‌ బందీలుగా పట్టుకున్న ఇజ్రాయెల్‌ వాసులను విడిపించింది. అయినా ఇంకా కొందరు హమాస్‌ వద్ద బందీగా ఉన్నట్లు అనుమానిస్తోంది. ఈ క్రమంలో హమాస్‌ను పూర్తిగా తుడిచిపెట్టాలని ఇజ్రాయెల్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో పక్కా ప్రణాళికతో హమాస్‌ చీఫ్‌ను హతమార్చింది. దీంతో ఇరాన్‌కు కోపం వచ్చింది. దీనికి ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. హెజ్‌బుల్లాతో కలిసి ప్రతిదాడులు చేస్తామని ప్రకటించింది. కానీ, ఆచితూచి మిన్నకుండిపోయింది. తాజాగా హమాస్, హెజ్బాల్లా అగ్రనేతల హత్యానంతరం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. ఆదివారం తెల్లవారుజామున లెబనాన్లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. ఈ విషయాన్ని ఇరు దేశాలు ధ్రువీకరించాయి. రాకెట్లు, క్షిపణులతో హెజ్‌బొల్లా తమపై భారీ దాడికి సిద్ధమైందని.. దీన్ని ముందే గుర్తించామని ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. ఆత్మ రక్షణలో భాగంగానే ముందస్తు దాడులు చేసినట్లు పేర్కొంది.

    హెజ్‌బుల్లా వ్యూహం పసిగట్టి..
    త్వరలో రాకెట్లు, క్షిపణులతో ఇజ్రాయెల్లోనిపౌర నివాసాలపై హెజ్బల్లా దాడికి దిగే అవకాశం ఉందని ఆ దేశ సైనిక అధికార ప్రతినిధి అడ్మిరల్‌ డేనియల్‌ హగారీ హెచ్చరించారు. ఇజ్రాయెల్‌పై ఆ ఉగ్రవాద ముఠా విస్తృత దాడికి సిద్ధమవుతోందని పేర్కొన్నారు. ఫలితంగా లెబనాన్‌ సామాన్య పౌరుల ప్రాణాల మీదకు తెస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో హెజ్‌బొల్లా స్థావరాల సమీపంలో ఉన్న పౌరులు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ఈ ప్రకటన వెలువడిన కాసేపటికే ఉత్తర ఇజ్రాయెల్లోని పౌరులను అప్రమత్తం చేస్తూ సైరన్లు మోగాయి. హెజ్‌బొల్లా దాదాపు 6 వేల రాకెట్లు, డ్రోన్లతో దాడికి సిద్ధమైనట్లు సమాచారం. ఇజ్రాయెల్‌ తాజాగా సుమారు 200 హెజ్‌బ్బొల్లా స్థావరాలను ధ్వంసం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. దీంతో దాదాపు 320 డ్రోన్లతో ఇజ్రాయైల్‌పై హెజŒ బొల్లా విరుచుకుపడినట్లు సమాచారం. మరోవైపు తమ దేశ దక్షిణ ప్రాంతంలో దాడులు జరిగినట్లు పేర్కొంటూ లెబనాన్‌ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

    విమానాల దారిమళ్లింపు..
    తాజా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని బెన్‌ గురియన్‌ ఇంటర్నేషనల్‌ విమానాశ్రయం పలు విమానాలను దారి మళ్లించింది. టేకాఫ్‌ కావాల్సిన మరికొన్నింటిని ఎక్కడికక్కడ నిలిపివేసింది. మరోవైపు తాజా సైనిక కార్యకలాపాలను ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, సహా రక్షణ మంత్రి యోవ్‌ గాలంట్‌.. టెల్‌ అవీవ్‌ లోని మిలిటరీ ప్రధాన కేంద్రం నుంచి పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితి నెలకొని ఉన్నట్లు గాలంట్‌ ప్రకటించడం గమనార్హం.