HYDRA : తమ్మిడి కుంట చెరువు విస్తీర్ణం 29.6 ఎకరాలు. ప్రస్తుతం అది పది ఎకరాలకు పడిపోయింది. దాదాపు 19 ఎకరాల చెరువు స్థలం కబ్జాకు గురైంది. అందులో కొంతమంది ఇళ్లు నిర్మించుకున్నారు. మరి కొంతమంది బహుళ అంతస్తులు ఏర్పాటు చేసుకున్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత నేపథ్యంలో వారిలో భయం మొదలైంది. ఇదే సమయంలో ఏం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తం అవుతుంది. మరోవైపు చెరువుల్లో ఆక్రమణల కూల్చివేత నిరంతరం కొనసాగుతుందని హైడ్రాధికారులు చెబుతున్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన కళాశాలలు, హాస్టళ్లు చెరువుల ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మల్లారెడ్డి ప్రభుత్వ స్థలంలో ఆక్రమించి నిర్మించిన నిర్మాణాన్ని కూల్చివేయించారు. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పడగొట్టిన తర్వాత.. తదుపరి కూల్చివేతలు మల్లారెడ్డి కి సంబంధించిన నిర్మాణాలేనని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మల్లారెడ్డికి సంబంధించిన పలు నిర్మాణాలపై కోర్టు స్టేలు ఉన్నాయి. కాప్రా లోని మల్లారెడ్డికి సంబంధించిన ఒక నిర్మాణం ఉంది. అయితే దానిపై ఇటీవల స్టే వెకేట్ అయినట్టు తెలుస్తోంది. దీంతో చర్యలు తీసుకునేందుకు మేడ్చల్ అధికారులు సమాయత్తమవుతున్నారు.
గత ఏడాది వానా కాలంలో..
గత ఏడాది వానా కాలంలో మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆసుపత్రి లోకి వాన నీళ్లు వచ్చాయి. అప్పట్లో మల్లారెడ్డి పై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. ముఖ్యంగా అప్పటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలు దస్త్రాలను విలేకరులకు అందించారు. మల్లారెడ్డి అనేక అక్రమాలకు పాల్పడి కళాశాలలు, ఇతర భవనాలు నిర్మించాలని ఆరోపించారు. దీనిపై కోర్టులో కేసులు కూడా వేశారు. ఆ సమయంలో మల్లారెడ్డి బహిరంగంగా రేవంత్ రెడ్డికి తొడ కొట్టి సవాల్ విసిరారు. ఆ తర్వాత ఏడాది గడవగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పినట్టుగానే ఇప్పుడు అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించి.. నేలమట్టం చేస్తున్నారు. మల్లారెడ్డి కి సంబంధించినవి ఇవి మాత్రమే కాకుండా మేడ్చల్, ఇతర ప్రాంతాలలో నిర్మించిన కళాశాలలు కూడా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కట్టినవేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అంతకుముందు సంవత్సరం ఐటీ అధికారులు మల్లారెడ్డి విద్యాసంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికి కోర్టులో విచారణ కొనసాగుతోంది. మళ్లీ ఇప్పుడు ఆయన విద్యాసంస్థలపై హైడ్రా చర్యలు తీసుకుంటుందనే చర్చ జోరుగా సాగుతోంది.