Israel nuclear strategy : ఇజ్రాయెల్.. అతి చిన్న దేశం. కానీ, ప్రపంచంలో చాలా దేశాలకన్నా టెక్నాలజీలో ముందు ఉంది. పెద్ద పెద్ద దేశాలు నిర్వహించలేని, సాధ్యం కాని ఆపరేషన్లు చేస్తుంది. పలు దేశాలతో యుద్ధాలను తట్టుకుని శక్తివంతంగా మారింది. ఇజ్రాయెల్ శక్తివంతంగా మారడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి.
1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన నాటి నుంచే పొరుగు అరబ్ దేశాల నుంచి తీవ్ర ముప్పు ఉంది. వరుస యుద్ధాల్లో అమెరికా సహాయం ఉన్నా, భవిష్యత్తులో తమ భద్రత కేవలం ఆయుధాలపై ఆధారపడదని, అణుశక్తిగా మారితేనే దేశ రక్షణ కుదురుతుందని ప్రధాని డేవిడ్ బెన్ గురియన్ గ్రహించారు. ఇదే ఇజ్రాయెల్ గుప్త అణు మార్గయాత్రకు అడుగు పడింది.
రహస్య అణు ప్రాజెక్ట్..
1950లలో ఇజ్రాయెల్ అటామిక్ ఎనర్జీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 1956 సుయజ్ సంక్షోభం తర్వాత అమెరికాపై నిరాశతో, ఫ్రాన్స్‌తో సఖ్యత ఏర్పడి, డిమోనా అణు రియాక్టర్ నిర్మాణానికి ప్రాధమిక ఒప్పందం జరిగింది. ఫ్రాన్స్ సాంకేతిక నిపుణులు, బ్లూప్రింట్‌లు అందించగా, ఈజిప్ట్‌పై వ్యూహాత్మక ఆధిపత్యం కోసం ఫ్రాన్స్ కూడా ప్రోత్సాహం ఇచ్చింది. డిమోనాలోని భూగర్భ బంకర్లలో ప్లూటోనియం ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఇది అణు విద్యుత్తు కంటే ఆయుధ ఉత్పత్తి కోసమే అని అమెరికా నిఘా గుర్తించింది.
అమెరికా–ఇజ్రాయెల్ అణు సంక్షోభం
అమెరికా నిఘా విమానాలు నెగెవ్ ఎడారిపై తీసిన చిత్రాలను విశ్లేషించి ఇది అణు రియాక్టర్ అని నిగ్గుతేల్చాయి. అధిక ఒత్తిడికి లోనైన ఇజ్రాయెల్ తన సౌకర్యాలను ‘‘టెక్సై్టల్ ఫ్యాక్టరీ’’గా చూపించి బహిరంగ తనిఖీలను తప్పించుకుంది. పరిశీలన బృందం రాకముందే మొస్సాద్ నకిలీ నిర్మాణాలు, గోడలు ఏర్పాటు చేసింది.ఈ మోసం డిమోనా రహస్యాన్ని బహిర్గతం కాకుండా కాపాడింది.
అమెరికాలో యురేనియం దొంగతనం..
డిమోనా ప్రాజెక్ట్ విస్తరించడానికి శుద్ధ యురేనియం అవసరమైంది. మొస్సాద్ ఏజెంట్లు అమెరికాలోని న్యూక్లియర్ మెటీరియల్ అండ్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ (ఎన్‌యూఎంఈసీ) కేంద్రాన్ని లక్ష్యంగా తీసుకున్నారు. యజమాని జల్మాన్ షపిరో యూదు మద్దతుదారు కావడంతో అక్కడి భద్రతా లోపాలను ఉపయోగించారు. 200–600 పౌండ్ల యురేనియం దశలవారీగా ఇజ్రాయెల్‌కు చేర్చారు. హెన్రీ కిసెంజర్ 1969లో దీనిపై విచారణ చేయగా, ఇది ఇజ్రాయెల్‌కే చేరిందని గుర్తించారు. కానీ రాజకీయ కారణాలతో అమెరికా ఈ విషయాన్ని బహిరంగం చేయలేదు.
మొస్సాద్ అద్భుత ఆపరేషన్..
1967 యుద్ధం తర్వాత ఫ్రాన్స్ యురేనియం సరఫరా నిలిపివేయడంతో ఇజ్రాయెల్‌కి కొత్త మార్గం అవసరమైంది. ఈ క్రమంలో ‘ఆపరేషన్ ప్లమ్‌బాట్’ పేరుతో మొస్సాద్ చరిత్రలో అత్యంత క్లిష్ట మిషన్ ప్రారంభమైంది. బెల్జియంలోని యూనియన్ మైన్స్ కంపెనీ నుంచి 200 టన్నుల ముడి యురేనియంను ఒక జర్మన్ కంపెనీ పేరిట కొనిపించింది. మొస్సాద్ లైబీరియాలో షిప్పింగ్ కంపెనీ ఏర్పాటు చేసి, ప్లమ్‌బాట్‌గా చూపిన నౌకలో యురేనియం లోడ్ చేసింది. సముద్ర మధ్యలో ఆ సరుకు ఇజ్రాయెల్ నౌకకు మార్చబడింది. ఎనిమిది రోజుల తర్వాత ఆ నౌక ఖాళీగా టర్కీ రేవులో కనిపించింది. ఇది అణు చరిత్రలోనే అత్యంత విజయవంతమైన గూఢచారి ఆపరేషన్‌గా నిలిచింది.
అణు పరీక్షలు చేసినా నిగ్గు తేలని మిస్టరీ..
1979 సెప్టెంబర్ 22న దక్షిణాఫ్రికా సమీపంలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ దీవుల్లో రెండు కాంతి మెరుపులను అమెరికా ఉపగ్రహం గుర్తించింది. గామా కిరణాలు, ఎక్స్ రేఖలు, న్యూట్రాన్ ఉద్గారాలు అణు పేలుడుని సూచించాయి. కొన్ని బ్రిటన్ ప్రయోగశాలలు కూడా దీన్ని అణు పరీక్షగానే గుర్తించాయి. ఆస్ట్రేలియా వాయువుల్లో అయోడిన్–131 అణు మూలకం కనిపించింది. అయితే ఏ దేశమూ ఇజ్రాయెల్‌పై బహిరంగంగా దర్యాప్తు జరపలేదు. అంతర్జాతీయ ఒత్తిడి లేకుండా ఇజ్రాయెల్ అణుశక్తిగా స్థిరపడింది.
ఇజ్రాయెల్ ఎప్పుడూ ‘‘అణుశక్తి దేశం’’ అని సాక్షాత్తుగా ప్రకటించకున్నా, దాని అణు సామర్థ్యం అరబ్ ప్రపంచాన్ని దాడులకు భయపెట్టే ప్రతిఘటన ఆయుధంగా నిలిచింది. మొస్సాద్ నిఘా, మోసపూరిత ఆపరేషన్లు, రాజకీయ కచ్చితత్వం దీనివెనుక ఉన్న అసలైన రహస్యం.