Israel-Iran Tensions: ఇరాన్ పై అన్నంత పని చేసిన ఇజ్రాయెల్‌..

ఇరాన్‌లోని అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్‌ నగరంలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు.

Written By: Raj Shekar, Updated On : April 19, 2024 1:18 pm

Israel-Iran Tensions

Follow us on

Israel-Iran Tensions: ఇజ్రాయెల్‌ అన్నంత పని చేసింది. తమపై దాడులను తిప్పి కొడతామని చెప్పింది. ఈ ప్రకటన చేసిన కాసేపటికే ఇరాన్‌ ప్రధాని ప్రధాని ఇబ్రహీం రైసీ కూడా స్పందించారు. తమపై పరిమిత దాడిచేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ వరుస ప్రకటన సమయంలోనే ఇరాన్‌–ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలు పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులే అని అమెరికాకు చెందిన ఓ సైనికాధికారి వెల్లడించారు. అయితే దీనిని ఇరాన్‌ నిర్ధారించలేదు. దాడి జరిగినట్లు గుర్తిస్తే ఇజ్రాయెల్‌ మిగలదని ఇరాన్‌ ప్రధాని స్పష్టం చేశారు.

అణు కేంద్రం లక్ష్యంగా..
ఇదిలా ఉంటే.. ఇరాన్‌లోని అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్‌ నగరంలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. అవి ఏంటనేది ఇంకా అక్కడి ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. కానీ, ముందు జాగ్రత్తగా ఇరాన్‌ తమ దేశ గగనతలాన్ని మూసివేసింది. వాణిజ్య, పౌర విమానాలకు అనుమతులు రద్దు చేసింది. మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ఇస్పహాన్‌ నగరంలో అతిపెద్ద సైనిక శిబిరంతోపాటు పలు అణు కేంద్రాలు ఉన్నాయి. మరోవైపు ఇరాన్‌ తమ గగనతల రక్షణ వ్యవస్థను యాక్టివేట్‌ చేసినట్లు ప్రకటించింది. ఎయిర్, డిఫెన్స్‌ వ్యవస్థలను సిద్ధం చేసినట్లు తెలిపింది. గుర్తు తెలియని మినీ డ్రోన్లను ధ్వంసం చేయడానికి ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది.

ఎందుకీ ఉద్రిక్తత..
ఇరాన్‌–ఇజ్రాయెల్‌ మధ్య ఈ ఉద్రిక్తతకు కారణం ఏమిటంటే.. సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై ఇటీవల గగనతల దాడి జరిగింది. దీనికి ఇజ్రాయెల్‌ కారణమని ఇరాన్‌ భావిస్తోంది. ఆ దాడిలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ దళానికి చెందిన ఏడుగురు సైనికాధికారులు మృతిచెందారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఇరాన్‌.. ప్రతీకారం తీసుకుంటామని హెచ్చరించింది. ఈ క్రమంలో గత శనివారం 170 డ్రోన్లు, 30కిపైగా క్రూజ్, 120కిపైగా బాలిస్టిక్‌ క్షిపుణులతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. ‘ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌’ పేరుతో ఈ సైనిక చర్య చేపట్టింది. మొదట డ్రోన్లతో దాడి చేసి.. తర్వాత సైనిక స్థావరాలే లక్ష్యంగా క్రూజ్, బాలిస్టిక్‌ క్షిపుణులతో దాడిచేసింది.

అప్రమత్తమైన ఇజ్రాయెల్‌..
ఇరాన్‌ దాడితో ఇజ్రాయెల్‌ అప్రమత్తమైంది. ఇరాక్‌ గగనతలం మీదుగా తమ దేశం వైపు దూసుకొస్తున్న డ్రోన్లను బహుళ అంచెల రక్షణ వ్యవస్థతో కూల్చివేసింది. క్రూజ్‌ క్షిపుణులను విజయవంతంగా అడ్డుకుంది. ‘ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌’లో ఇరాన్‌తోపాటు ఆదేశానికి మద్దతు ఇస్తున్న లెబనాన్, సిరియా, ఇరాక్‌లోని మిలిటెంట్‌ సంస్థలు పాల్గొన్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌ ఎదురుదాడి మొదలు పెట్టింది. అమెరికా సహకారంతో ఇరాన్‌పై డ్రోన్లు ప్రయోగించింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.