Obama Arrest: బారక్ ఒబామా.. అమెరికా మాజీ అధ్యక్షుడు. డెమొక్రటిక్ పార్టీ నేత. వరుసగా రెండుసార్లు అధ్యక్షుడిగా గెలిచి సమర్థవంతమైన పాలకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత్‌కు అనుకూలగా ఉంటూ సహకారం అందించారు. అయితే ఇన్నేళ్ల తర్వాత ఒబామాను అరెస్టు చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒబామాపై తీవ్ర విమర్శలు చేస్తూ ఒక ఏఐ వీడియోను తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఒబామా ఓవల్ ఆఫీసులో ఎఫ్‌బీఐ అధికారులు అరెస్టు చేసినట్లు.. చివరకు ఖైదీ దుస్తుల్లో జైలులో ఉన్నట్లు చూపించారు.
చట్టానికి ఎవరూ అతీతులు కారంటూ..
‘చట్టానికి ఎవరూ అతీతులు కారు’ అనే క్యాప్షన్‌తో ట్రంప్ ఈ వీడియో రూపొందించారు. ఇదే ఇప్పుడు అగ్రరాజ్యంలో చర్చనీయాంశమైంది. ఈ వీడియోలో ఒబామా ‘చట్టానికి అధ్యక్షుడు అతీతుడు’ అని మాట్లాడినట్లు చిత్రీకరించగా, దానికి వ్యతిరేకంగా రాజకీయ నాయకులు ’చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదు’ అని ప్రతిస్పందించినట్లు చూపించారు. ఈ దృశ్యాలు ట్రంప్, ఒబామా మధ్య సంభాషణ సన్నివేశంతో కొనసాగుతాయి, ఇందులో ఎఫ్‌బీఐ అధికారులు ఒబామాకు సంకెళ్లు వేస్తారు. ట్రంప్ నవ్వుతూ ఉండటం ఈ వీడియోలో ఉన్నాయి. ఇది డెమోక్రాట్లపై ట్రంప్ రాజకీయ దాడి వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. ఒబాబాను అరెస్టు చేయాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
Also Read: చైనా మస్కిటో డ్రోన్స్.. శత్రుదేశాలే లక్ష్యంగా తయారీ..!
ఒబామాపై ఆరోపణల నేపథ్యంలో..
ట్రంప్ ఈ వీడియోను పోస్ట్ చేయడానికి నేపథ్యం, ఒబామా 2020 అధ్యక్ష ఎన్నికల్లో భారీగా మోసాలకు పాల్పడ్డారని ఆయన చేసిన ఇటీవలి ఆరోపణలు కారణం. ఈ వీడియో ఆ ఆరోపణలను ఉద్దేశించి రూపొందించినట్లు తెలుస్తోంది. ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థులపై, ముఖ్యంగా డెమోక్రాట్లపై, సోషల్ మీడియా ద్వారా నిరంతరం విమర్శలు చేస్తున్నారు, ఈ వీడియో ఆ వ్యూహంలో ఒక భాగమే అని తెలుస్తోంది.
తులసీ గబ్బార్డ్ సంచలన వ్యాఖ్యలు..
యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ గత వారం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2016 ఎన్నికల్లో ట్రంప్ విజయం తర్వాత, ఒబామా సన్నిహిత వర్గాలు ఆయన పాలనను అస్థిరపరిచేందుకు అసత్య ప్రచారం చేశాయని, రష్యా ఎన్నికల్లో జోక్యం చేసుకుందని తప్పుడు ఆరోపణలు చేశాయని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించి బలమైన సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని, ఒబామా హయాంలో పనిచేసిన అధికారులను విచారించాలని గబ్బార్డ్ పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ ఏఐ వీడియో రాజకీయంగా ఉద్దేశపూర్వకంగా రూపొందించినవిగా భావిస్తున్నారు. ఒబామాను అరెస్టు చేయాలని చూస్తున్నట్లు కూడా చర్చ జరుగుతోంది. తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.