Israel: ఇరాన్ దాడులు చేస్తుంటే.. ఇజ్రాయిల్ “యారో”తో తిప్పికొట్టింది.. ఇంతకీ అదేంటో తెలుసా..

ఇజ్రాయిల్ దేశానికి శత్రు దేశాల నుంచి ముప్పు ఎక్కువ. లెబనాన్ లోని హిజబుల్లా, సిరియా, ఇరాక్ లోని ఇరాన్ అనుకూల ఉగ్రవాద గ్రూపులు, యెమెన్ లోని హౌతీలు, గాజా స్ట్రిప్ లోని హమాస్ నుంచి ఆ దేశం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 15, 2024 11:53 am

Israel countered with the Arrow

Follow us on

Israel: దూసుకొస్తున్న క్షిపణులు.. మీద పడుతున్న రాకెట్ లు.. ఇలా ఒకటా, రెండా.. చూస్తుండగానే బాంబుల వర్షం కురుస్తోంది.. భవనాలు ఎక్కడికి అక్కడ నేలమట్టమవుతున్నాయి. ఇంకో దేశమైతే ఎలా ఉండేదో తెలియదు కానీ.. అక్కడ ఉన్నది ఇజ్రాయిల్ కాబట్టి.. తనను తను కాపాడుకుంది. ప్రజలను రక్షించింది. బాంబు దాడుల నుంచి.. క్షిపణుల మోత వరకు.. బలమైన రక్షణ చత్రాన్ని అడ్డుపెట్టింది. సాధారణంగా ఇజ్రాయిల్ దేశానికి ఐరన్ డోమ్ రక్షణ కల్పిస్తుంది. ఆ మధ్య పాలస్తీనా దాడులు చేసిన నేపథ్యంలో ఐరన్ డోమ్ కు మించిన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది.

శనివారం రాత్రి నుంచి ఇజ్రాయిల్ మీద బాలిస్టిక్ క్షిపణులు.. డ్రోన్లు.. క్రూయిజ్ క్షిపణులతో ఇరాన్ దాడి చేసింది.. అయితే ఇజ్రాయిల్ కూడా ఇలానే బదులిచ్చింది.. అంతేకాదు కేవలం లిప్త పాటు కాలంలోనే ఇరాన్ పైకి బలమైన క్షిపణులను ఇజ్రాయిల్ ప్రయోగించింది.. ఈసారి కొత్తగా యారో అనే సమర్ధవంతమైన రక్షణ వ్యవస్థను ఉపయోగించింది. ఇరాన్ క్షిపణులను మధ్యలోనే కూల్చేసింది. పౌరాణిక సినిమాల్లో రెండు బాణాలు ఢీ కొట్టుకున్నట్టుగా ఇజ్రాయిల్ యారో రక్షణ వ్యవస్థ ద్వారా ఇరాన్ క్షిపణులను అడ్డుకున్నది. వాస్తవానికి ఇజ్రాయిల్ దేశానికి శత్రు దేశాల నుంచి ముప్పు ఎక్కువ. లెబనాన్ లోని హిజబుల్లా, సిరియా, ఇరాక్ లోని ఇరాన్ అనుకూల ఉగ్రవాద గ్రూపులు, యెమెన్ లోని హౌతీలు, గాజా స్ట్రిప్ లోని హమాస్ నుంచి ఆ దేశం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ ఉగ్రవాద గ్రూపులకు ఇరాన్ ఆర్థికంగా అండదండలు అందిస్తోంది. వీటన్నిటి నుంచి కాపాడుకునేందుకు మూడంచెల గగనతల భద్రతా వ్యవస్థను ఇజ్రాయిల్ ఏర్పాటు చేసుకుంది.

ఐరన్ డోమ్

చాలామందికి ఇజ్రాయిల్ గురించి చెబితే ఐరన్ డోమ్ గుర్తుకు వస్తుంది. ఇది నాలుగు నుంచి 70 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకు వచ్చే స్వల్పశ్రేణి రాకెట్లు, ఆర్టిలరీ షెల్స్ ను దారిలో అడ్డుకొని తునాతునకలు చేస్తుంది. అప్పట్లో హమాస్ దాడులను ఈ ఐరన్ డోమే నిలువరించింది. ఇందులో డిటెక్షన్ అండ్ రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ, బ్యాటిల్ మేనేజ్మెంట్ అండ్ వెపన్ కంట్రోల్ వ్యవస్థ, మిస్సైల్ ఫైరింగ్ యూనిట్లు ఉంటాయి. ఇవి 24 గంటల పాటు అన్ని వాతావరణాలను తట్టుకుని పనిచేస్తాయి. ఈ వ్యవస్థ 90 శాతం ఇజ్రాయిల్ కు రక్షణ కల్పిస్తుంది.

డేవిడ్స్ స్లింగ్

బలవంతమైన ఒక వ్యక్తిని ఓ గొర్రెల కాపరి ఒడిసెలరాయితో హతమార్చుతాడు.. పురాణ జానపద కథల్లో చదువుకున్న వృత్తాంతం ఇది. అందులో గొర్రెల కాపరి వాడిన ఒడిసెల రాయి స్ఫూర్తితో దీనికి డేవిడ్ స్లింగ్ అని పేరు పెట్టింది ఇజ్రాయిల్. ఇది 40 నుంచి 300 కిలోమీటర్ల పరిధి నుంచి దూసుకువచ్చే డ్రోన్లు, టాక్టికల్ బాలిస్టిక్ మిస్సైళ్ళు, మీడియం -2 లాంగ్ రేంజ్ రాకెట్లు, క్రూయిజ్ మిస్సైళ్ళను స్టన్నర్ అనే ఇంటర్ సెప్టర్ తో మార్గమధ్యంలోనే ఈ వ్యవస్థ అడ్డుకుంటుంది.. దీనిని లెబనాన్, సిరియా హద్దుల్లో ఇజ్రాయిల్ మోహరింపజేసింది.

యూరో-3

ఇరాన్, యెమెన్ నుంచి దూసుకువచ్చే లాంగ్ రేంజ్ క్షిపణులను సమర్థవంతంగా నాశనం చేసేందుకు అమెరికాతో కలిసి ఇజ్రాయిల్ ఈ గగనగల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంది. ఇది ప్రపంచంలోనే తొలి యాంటీ టాక్టికల్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టం. వెయ్యికి పైగా కిలోమీటర్ల దూరం నుంచి దూసుకు వచ్చే బాలిస్టిక్ క్షిపణులను భూ వాతావరణానికి పైనే ఢీకొడుతుంది. శనివారం రాత్రి ఇరాన్ చేసిన దాడిని ఇజ్రాయిల్ ఇదేవిధంగా అడ్డుకున్నది. ఇరాన్ ప్రయోగించిన 131 బాలిస్టిక్ క్షిపణులలో.. 124 క్షిపణులను, 170 డ్రోన్లను, 30 క్రూయిజ్ క్షిపణులను యారో వ్యవస్థ కూల్చేసింది. 2023 నవంబర్లో యెమెన్ నుంచి హౌతీలు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని ఈ వ్యవస్థ ద్వారానే ఇజ్రాయిల్ అడ్డుకుంది. అయితే దీనికంటే సమర్థవంతంగా పనిచేసే గగనతల రక్షణ వ్యవస్థ యూరో -4 ను అభివృద్ధి చేసేందుకు అమెరికా, ఇజ్రాయిల్ కలిసి పని చేస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా పేట్రియాట్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి విమానాలు, డ్రోన్లను ఇజ్రాయిల్ కూల్చేస్తోంది. అంతేకాకుండా లేజర్ టెక్నాలజీ సంబంధిత ముప్పులు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఐరన్ భీమ్ అనే వ్యవస్థను ఇజ్రాయిల్ ఏర్పాటు చేస్తోంది.