Hardik Pandya : రెండు వరుస విజయాలు సాధించిన ముంబై జట్టు.. ఆదివారం రాత్రి సొంత మైదానంలో చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో చెన్నై గెలిచింది అనేదానికంటే ముంబై చేజేతులా ఓడిపోయిందనడం సబబు. అటు బౌలింగ్లో విఫలమైంది.. ఇటు బ్యాటింగ్లో రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ మినహా మిగతా వారంతా రాణించలేదు. ఫలితంగా చెన్నై జట్టు చేతిలో 20 పరుగుల తేడాతో ముంబై ఓటమిపాలైంది. భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో చేతులెత్తేసింది. ముంబై ఓటమి నేపథ్యంలో అన్ని వేళ్ళూ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వైపు చూపిస్తున్నాయి.
వాస్తవానికి ముంబై మైదానం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఈ మైదానంపై 200+ స్కోర్ చేస్తే.. చేజింగ్ చేసే జట్టుకు ఆ లక్ష్యం కష్టమైపోతుంది. ఈ విషయం హార్దిక్ పాండ్యాకు తెలుసు. అయినప్పటికీ అతడు టాస్ నెగ్గి బౌలింగ్ వైపు మొగ్గు చూపించాడు. బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 70 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్, శివం దుబే బీభత్సమైన ఆట ఆడారు. చివర్లో మహేంద్రసింగ్ ధోని పెను తుఫాను సృష్టించి వెళ్ళాడు. వాస్తవానికి చెన్నై బ్యాటర్లు ఆ స్థాయిలో స్కోర్ చేసే అవకాశం కల్పించింది ముమ్మాటికి హార్దిక్ పాండ్యా నే.. తన వద్ద మెరుగైన బౌలింగ్ వనరులు ఉన్నప్పటికీ హార్దిక్ పాండ్యా సరిగా వినియోగించుకోలేదు. ఉదాహరణకు శ్రేయస్ గోపాల్ ఒక ఓవర్ వేసి తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత అతడికి అవకాశం ఇవ్వలేదు. ముంబై జట్టు పేసు గుర్రం బుమ్రా కు నాలుగో ఓవర్ లో బౌలింగ్ వేసే అవకాశం ఇచ్చాడు.. మళ్లీ మరో ఓవర్ వేసేందుకు బుమ్రా నాలుగు ఓవర్ల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. గత మ్యాచ్లో బుమ్రా ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికీ హార్దిక్ పాండ్యా అతడిని పట్టించుకోలేదు. బుమ్రా ఈ మ్యాచ్లో వికెట్లు పడగొట్టకపోయినప్పటికీ 6.75 ఎకానమీ రేటు కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మహమ్మద్ నబీ 3 ఓవర్లలో 19 పరుగులు సమర్పించుకున్నాడు..
స్పిన్నర్ల బౌలింగ్లో శివం రెచ్చిపోతాడని భావించి హార్దిక్ పాండ్యా ఫాస్ట్ బౌలర్లతో బౌలింగ్ చేయించాడు. అలాంటప్పుడు నబి లేదా శ్రేయస్ గోపాల్ ఎందుకు బౌలింగ్ చేయించలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇక చివరి ఓవర్లో ధోని నాలుగు బంతుల్లో 20 పరుగులు చేస్తుంటే హార్దిక్ పాండ్యా చూస్తూ ఉండిపోయాడు. గత రెండు మ్యాచ్ లలో ముంబై గెలవడంతో హార్దిక్ పై విమర్శలు తగ్గాయి. కానీ చెన్నై జట్టుతో చేతులారా ఓటమిని కొని తెచ్చుకోవడం తో మళ్ళీ ట్రోల్స్ మొదలయ్యాయి.. మైదానంలో ఇలా వ్యవహరిస్తుంటే హార్దిక్ పాండ్యా భావి కెప్టెన్ ఎలా అవుతాడో అతడికే తెలియాలి.