Alexei Navalny: రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్స్ నావల్నీ(Alexi Navaln అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నేపథ్యంలో.. అతడి మృతిని సహజ మరణమని రష్యా ప్రభుత్వం చెబుతోంది. కాగా అతడిని జైల్లో హింసించి చంపేశారని రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్స్ నావల్నీ మద్దతుదారులు అంటున్నారు. అలెక్స్ నావల్నీ మృతి పై కూడా ప్రపంచ దేశాల అధినేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతడి చావుకి ముమ్మాటికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కారణం అనే అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటికీ కూడా అలెక్స్ నావల్నీ మృతికి సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదని తెలుస్తోంది..
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం అలెక్స్ నావల్నీ ని జైల్లో హింసించి చంపేశారని అతడి మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. అలెక్స్ నావల్నీ ని కేజీబీ వన్ – పంచ్(KGB one – punch) టెక్నిక్ తో చంపేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా గూఢచార సంస్థ కేజీబీ.. ప్రత్యర్థులను చంపేసేందుకు దీనిని వాడుతుంటుంది. నావల్నీ ని కూడా ఇదే తీరుగా మట్టు పెట్టి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మానవ హక్కుల కార్యకర్త వ్లాది మిర్ ఒసెచ్కిన్ ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.. “అవతలి వ్యక్తి ఛాతీ పై గట్టిగా కొడితే ఒక్కసారిగా గుండెపోటు వస్తుంది. అలా అతడు వెంటనే చనిపోతాడు” దీనిని కేజీబీ (KGB) పంచ్ అంటారు. రష్యా గూడచర్య సంస్థ తన ప్రత్యర్థులపై కేజీబీ (KGB) ప్రయోగిస్తుందనే విమర్శలు ఉన్నాయి.
” నాకు అందిన సమాచారం ప్రకారం కొద్ది రోజులకు ముందుగానే నావల్నీ హత్యకు పథకాన్ని రూపొందించారు. దీనికి సంబంధించిన ఆపరేషన్ చేపట్టారు. సీసీ కెమెరాలు తొలగించి ఈ పని చేశారు. పై స్థాయి వ్యక్తుల ప్రమేయం లేకుండా ఇలాంటి పని చేపట్టడం దాదాపు అసాధ్యం” అని మానవ హక్కుల కార్యకర్త ఒసెచ్కిన్ అభిప్రాయపడినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. నావల్నీ మృతదేహాన్ని మార్చురీకి తరలించినప్పుడు అతడి ఛాతీ, తలపై కమిలిపోయిన గాయాలు ఉన్నట్టు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. నావల్నీ మృతిపై ఒసె చ్కిన్ వ్యాఖ్యల నేపథ్యంలో.. అతడిది సహజ మరణం కాదని నావల్నీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.
నావల్నీ చనిపోయి ఇన్ని రోజులవుతున్నప్పటికీ అతడి మృతదేహం ఎక్కడ ఉందనేది ఇప్పటికీ తెలియ రాలేదు.. తన కుమారుడి మృతదేహాన్ని కడసారి చూసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన తల్లి లియుడ్మిలా రష్యా అధ్యక్షుడు పుతిన్ ను వేడుకున్నారు. ఖననం చేసేందుకు తన కుమారుడి భౌతికకాయాన్ని అప్పగించాలని ఆమె కోరారు..” అతడి మృతికి కారణం ఇంకా తెలియ రాలేదు. ప్రాథమిక విచారణ కొనసాగుతోంది. రెండు వారాలపాటు వేచి చూడాలని” నావల్నీ కుటుంబ సభ్యులకు రష్యా ప్రభుత్వ అధికారులు చెప్పారు. కాగా, తన కుమారుడిని చంపి సాక్ష్యాలు దాచేందుకు రష్యా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని లియుడ్మిలా ఆరోపిస్తున్నారు.