Congress: ఏపీ సీఎం జగన్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సిద్ధం పేరిట ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. లక్షలాదిమంది జనాలను ఈ సభలకు తరలిస్తున్నారు. దీంతో అధికార పార్టీలో ఒక రకమైన జోష్ నెలకొంది. మరోసారి అధికారాన్ని దక్కించుకుంటామన్న ధీమా కనిపిస్తోంది. సిద్ధం పేరిట నిర్వహిస్తున్న ఈ సభలు విపక్షాల్లో గుబులు రేపుతున్నాయి. హాజరవుతున్న జనాలను చూసి ఒక రకమైన ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ జగన్ ను కాపీ కొట్టడం విశేషం.
ఇప్పటికే రాష్ట్రంలో మూడు సిద్ధం సభలు పూర్తయ్యాయి. భీమిలిలో మొదటి సభ జరిగింది. దాదాపు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలివచ్చాయి. తరువాత దెందులూరు లో నిర్వహించారు. ఉభయగోదావరి తో పాటు కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి వైసీపీ శ్రేణులు హాజరయ్యారు. రాప్తాడు లో జరిగిన సభకు దాదాపు రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాదిమంది పార్టీ శ్రేణులు తరలి వచ్చాయి. అయితే ఇప్పటివరకు జరిగిన సభలకు.. సిద్ధం సభలకు చాలా తేడా ఉంది. సామాన్య జనాలను తరలించాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అందుకే జగన్ పార్టీ శ్రేణులకు రవాణా సదుపాయం కల్పించడంతో ఎక్కువ మంది హాజరవుతున్నారు. సభలు కూడా సక్సెస్ అవుతున్నాయి.
సిద్ధం సభలు వెనుక ప్రత్యేక వ్యూహం ఉంది. విపక్షాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న భావనతోనే సిద్ధం సభలను రూపకల్పన చేశారు. టిడిపి సంస్థాగతంగా బలంగా ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని అక్కడ సిద్ధం సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభల నిర్వహణకు ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. భారీ హోర్డింగులతో పాటు చివరకు స్టిక్కర్లను సైతం ఇంటింటా అతికించి పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. వారిని సిద్ధం సభలకు తరలించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మొన్నటి రాప్తాడు సభకు భారీగా జనాలు తరలి రావడానికి వైసిపి ప్రత్యేక వ్యూహమే కారణం.
అయితే ఇప్పుడు తెలంగాణలో సైతం సిద్ధం అంటూ స్టిక్కర్లు, హోర్డింగులు వెలుస్తుండడం విశేషం. అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ సీఎం జగన్ ను అనుసరిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముంగిట భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ నాయకులు సిద్ధం అంటూ భారీ ఫ్లెక్సీలతో ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తానికైతే ఏపీ అధికార పార్టీని తెలంగాణ అధికార పక్షం అనుసరిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.