India has become cold: భారతదేశం మొత్తం చల్లగా మారింది. సాధారణంగా శీతాకాలంలో జమ్ము కాశ్మీర్, సిమ్లా లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా చల్లదనం ఉంటుంది. దీంతో ఇక్కడ మంచు వర్షాలు కురుస్తాయి. దక్షిణంలోనూ కొన్ని ప్రాంతాల్లో మంచు ఉండి చల్లటి వాతావరణం ఉంటుంది. కానీ ఈ ఏడాది ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో మైదానాల్లోనూ చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శీతాకాలంలో రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. కానీ ఈసారి అతి తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే సిమ్లా లాంటి ప్రాంతాల్లో అత్యల్పంగా -13.1డిగ్రీలు నమోదు కావడంతో ఈ ప్రభావం మైదానాల ప్రాంతాలపై పడుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
సోమవారం నమోదైన ఉష్ణోగ్రతల ప్రకారం.. సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్, కుఫ్రీ తో పాటు సిర్మౌర్ వంటి ప్రాంతాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటిలో లహౌల్- స్పితిలోని రోహ్తంగ్ పాస్, బరాలాచా, టాబోల్లో అత్యల్పంగా -13.1డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అలాగే నర్కండ, మనాలి, సోలన్ తో సహా కొన్ని ప్రాంతాల్లో 0 డిగ్రీలు నమోదయ్యాయి. కులు, బిలాస్ పూర్ లోని కొన్ని ప్రాంతాలతో పాటు చంబాలోని గిరిజన ప్రాంతాల్లో 30 సెంటిమీటర్ల వరకు మంచు కురిసింది. ఉత్తరాఖండ్ లోనూ ఆకస్మికంగా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ సీజన్ లో8 నైనిటాల్, కుమావోన్ లోని ఎత్తైన ప్రాంతాల్లో తీవ్రంగా మంచు కురుస్తుంది. నైనిటాల్ లో అయితే పెద్దపెద్ద గడ్డలుగా మంచు కురుస్తోంది. ఇక్కడ కొన్నేళ్ల తరువాత డిసెంబర్ లో మంచు కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు.
అయితే శీతాకాలంలో మైదానాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతి రోజు ఉద్యం సూర్యరశ్మి సమయంలో చల్లటి గాలి మాత్రమే వస్తుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ మార్పులు కనిపించవు. కానీ ఈసారి రాజస్థాన్ లోని డిసెంబర్ 11 నుంచి 13 వరకు తేలికపాటి చలి గాలులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. రాబోయే ఐదు రోజుల్లో మైదానాల్లో కొత్తగా చల్లగాలులు వీచే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం హిమాచల్ లాంటి కొండ ప్రాంతాల్లో మంచు కురుస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కానీ కొన్ని రోజుల తరువాత మైదానాల్లో కూడా చలి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో రాజస్థాన్ తో పాటు మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా లాంటి ప్రాంతాల్లో కూడా చలి గాలులు ఉంటాయన్నారు.
ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా దక్షిణ భారత దేశంలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే మరికొన్ని రోజుల్లో దక్షిణ కర్ణాటకతో పాటు కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, త్రిపుర, మేఘాలాండ్, నాగాలాండ్ వంటి ప్రాంతాల్లో చల్లగా మారనున్నాయి. దీంతో మొత్తంగా భారతదేశంలో చల్లటి వాతావరణం ఉండనుంది. ఈ పరిస్థితి డిసెంబర్ చివరి వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు.