Hurricane Milton : అమెరికా లోని ఫ్లోరిడా రాష్ట్రంలో హరికేన్ మిల్టన్ పెను విధ్వంసాన్ని సృష్టిస్తోంది. దీనిని అక్కడి అధికారులు ఐదో కేటగిరి తుఫాన్ గా ప్రకటించారు. ఫలితంగా ఫ్లోరిడా రాష్ట్రంలోని అనేక పట్టణాలు, నగరాలలో అత్యధిక స్థితి ప్రకటించారు. హరికేన్ మిల్టన్ వల్ల సుమారు గంటకు 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. బుధవారం రాత్రి ఈ తుఫాను తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. సరిగ్గా రెండు వారాల క్రితం ఫ్లోరిడా రాష్ట్రంలో హేలిన్ హరికేన్ బీభత్సం సృష్టించింది. దానివల్ల అపారమైన నష్టం కలిగింది. రోడ్లు ధ్వంసం అయ్యాయి. చెట్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దాన్నుంచి కోలు కోకముందే.. మళ్లీ ఇప్పుడు మిల్టన్ హరికేన్ విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. వర్షం తీవ్రత మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ పిలుపునిచ్చారు.
టోర్నడో మాదిరి..
ఐదో నెంబర్ హరికేన్ అని అమెరికా వాతావరణ నిపుణులు పేరు పెట్టిన నేపథ్యంలో.. అది ఒక టోర్నడో మాదిరిగా ఉంటుందని తెలుస్తోంది.. అయితే ఈ తుఫాన్ మరింత భీకరంగా మారితే ప్రమాదం తారస్థాయిలో ఉంటుంది కాబట్టి.. ప్రజల సౌకర్యార్థం ఫ్లోరిడా రాష్ట్రంలో విస్తారంగా షెల్టర్లు ఏర్పాటు చేసినట్టు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటీస్ వెల్లడించారు. ఇప్పటికే పెట్రోల్ స్టేషన్లలో ప్రజలు భారీగా బారులు తీరారు. కొన్ని ప్రాంతాలలో ఇంధనం పూర్తిగా నిండుకున్నది. కొన్ని స్టేషనులకు అదనంగా పెట్రోల్ పంపిస్తున్నారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ ఏర్పాటు చేసుకోవడానికి స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు.
పర్యటన రద్దు చేసుకున్న బైడన్
హరికేన్ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. జో బైడన్ జర్మనీతోపాటు అంగోలా దేశంలో ఆయన పర్యటించాల్సి ఉంది. తుఫాన్ తీవ్రత నేపథ్యంలో పునరావాస పనులను పర్యవేక్షించేందుకు ఆయన స్వదేశంలోనే ఉన్నారు. ఇక ప్రఖ్యాత టూరిస్ట్ ప్రాంతాలైన డిస్నీల్యాండ్, కెనడి స్పేస్ సెంటర్ ఫ్లోరిడా రాష్ట్రంలోనే ఉన్నాయి. తుఫాన్ నేపథ్యంలో ఆ కేంద్రాలను మూసివేశారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరం ఉన్నప్పటికీ బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ” తుఫాన్ తీవ్రత పెరుగుతోంది. వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. అలాంటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇళ్లలోనే ఉండడం శ్రేయస్కరం. లోతట్టు ప్రాంతాల ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. అత్యవసరం ఉన్నప్పటికీ బయటికి రావద్దు. నిత్యావసరాలు, ఇతర పదార్థాలను అందుబాటులో ఉంచుకోండని” ప్రజలకు ఫ్లోరిడా అధికారులు సూచిస్తున్నారు.