Hindus Population In Bangladesh : బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్జీలపై దాడులు ఆగడం లేదు. ఈ దాడుల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది ఆస్తులు, ఉన్న ఇళ్లు కోల్పోయి అనాథలుగా మారారు. డజన్ల కొద్దీ హిందూ సంఘాల నాయకులపై అక్కడి ప్రభుత్వం దేశద్రోహం కేసులు నమోదు చేస్తోంది. దీంతో అక్కడి మైనార్టీ హిందువులు తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు, నిరసనలు చేస్తున్నారు. ముస్లింలు మెజారిటీగా ఉన్న బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టి ఏర్పడిన కొత్త ప్రభుత్వం హిందువులపై దాడులు, వేధింపులు పెరిగిపోయాయని, వీటి నుంచి తమకు రక్షణ కల్పించాలని, హిందూ సంఘాల నేతలపై దేశద్రోహం కేసులను ఎత్తివేయాలని అక్కడి హిందువులు డిమాండ్ చేస్తున్నారు.
బంగ్లాదేశ్‌లో విస్తృత నిరసనల తరువాత అప్పటి ప్రధాని షేక్ హసీనా తన పదవి నుండి వైదొలగవలసి వచ్చింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అదే సమయంలో భారత్-బంగ్లాదేశ్ దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. నిజానికి, బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై హింసాత్మక ఘటనల కారణంగా ఉద్రిక్తత పెరిగింది. అయితే, బంగ్లాదేశ్‌లో హిందువుల సంఖ్య ఎంతో తెలుసా? అదే సమయంలో, పాకిస్తాన్ నుండి విడిపోయే ముందు బంగ్లాదేశ్‌లో వారి సంఖ్య ఎంత ఉందో ఈ వార్తా కథనంలో తెలుసుకుందాం.
బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా ఎంత తగ్గింది?
బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా భారీగా తగ్గింది. 1947లో ఈ పూర్వ పాకిస్తాన్‌లో (బంగ్లాదేశ్) 25 శాతం హిందువులు ఉండేవారట, కానీ నేడు ఆ సంఖ్య కేవలం 8-9 శాతానికి తగ్గింది. వారు ఎక్కడికి వెళ్లారనేది ఇప్పుడు ప్రశ్న. వారంతా మతం మారాడా? లేక వాళ్ళు ఇండియాకు తిరిగి వచ్చారా ? లేక వాళ్లందరినీ హత్య చేశారా? ఈ అంశంపై చర్చ కొనసాగుతోంది. అయితే బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న హింస మరోసారి ఈ ప్రశ్నపై చర్చకు దారితీసింది.
చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్ట్ తో టెన్షన్ పెరిగిందా?
ఇస్కాన్‌తో సంబంధం ఉన్న చిన్మయ్ కృష్ణ దాస్ బంగ్లాదేశ్‌లో అరెస్టయ్యాడు. చిన్మోయ్ కృష్ణ దాస్‌ను దేశద్రోహం ఆరోపణలపై అరెస్టు చేశారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. అలాగే, త్రిపుర రాజధాని అగర్తలాలో బంగ్లాదేశ్ సబ్-హైకమిషన్ భవనాన్ని ధ్వంసం చేశారు. దీనిపై బంగ్లాదేశ్ ఘాటుగా స్పందించింది. ఆ తర్వాత ఈ విషయంపై భారత్ విచారం వ్యక్తం చేసింది.