Israel VS Hamas : ఉగ్రవాదమే తప్ప మానవత్వం అంటే ఏమిటో తెలియని హమాస్ మూకలు.. ఇజ్రాయెల్‌లోకి చొరబడి సాగించిన విధ్వంసం అంతాఇంతా కాదు. ఇలాంటి దారుణాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. వారు పసికందులనూ వదలకుండా నరమేధానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ నెల 11న గాజాస్ట్రిప్ నుంచి దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొబడిన ఉగ్రవాదులు క్ఫర్ అజా కిబూజ్ బీరీపై దాడికి దిగి 40 మంది చిన్నారులు, యువకులను నిర్బంధంలోకి తీసుకున్నారు. పిల్లల తలలను నరికివేశారు. మహిళలను, పిల్లల చేతులకు సంకెళ్లు వేసి నుదిటిపై కాల్చి చంపారు. ఈమేరకు శుక్రవారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) వర్గాలు వివరించాయి.
చెల్లాచెదురుగా మృతదేహాలు
‘ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయి. ఉగ్రవాదులు ఇళ్లకు నిప్పుపెట్టారు. చాలామంది సజీవ దహనమయ్యారు. మంటల ధాటికి బయటకు రాలేనివారు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోయారు. విచక్షణా రహితంగా జరిగిన ఈ దారుణం జాంబీ సినిమాల్లోని సీన్లను తలపించిందని’ ఐడీఎఫ్ వర్గాలు పేర్కొన్నాయి. ‘ మేము మొదట నమ్మకపోయినప్పటికీ.. ప్రత్యక్ష సాక్షులు, స్థానిక అధికారులు చెప్పాక పరిస్థితి తీవ్రత అర్థమైందని’ ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నారుల తలలు నరికి చంపినట్లుగా తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఐడీఎఫ్ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు మాత్రం నిర్ధారించలేదు. మరోవైపు పిల్లలపై ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా ప్రవర్తిస్తారని, తాను ఇలాంటి ఘోరాలను చూడాల్సి వస్తుందని అనుకోలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విస్మయం వ్యక్తం చేయడం అక్కడి పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. కాగా, హమాస్ పై దాడులను ఇజ్రాయిల్ మరింత తీవ్రం చేసింది. రాకెట్లతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా గాజా నగరంపైకి దీపావళి పండగ లాగా రాకెట్లతో దాడులు చేస్తోంది. లక్షలాది మంది సైన్యాన్ని మోహరించి ఏకకాలంలో అటు సిరియా, ఇటు ఈజిప్ట్, మధ్యలో హమాస్ పై యుద్ధం చేస్తోంది. ఏకంగా నెతాన్యాహూ కుమారుడు సైన్యంలోకి వెళ్లాడంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.