Digital Passport : డిజిటల్ పాస్‌పోర్ట్ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేస్తున్న, అమలు చేస్తున్న ఏకైక దేశం ఫిన్‌లాండ్ అని ఇన్ని రోజులు అనుకున్నారు. కానీ దీనికి చెక్ పెడుతూ ఫిన్లాండ్ మాత్రమే కాదని.. పోలాండ్, దక్షిణ కొరియా, యుఎస్, యుకె వంటి ఇతర దేశాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఎందుకంటే ఈ డిజిటల్ పాస్‌పోర్ట్‌లు ప్రయాణికులకు సౌలభ్యం, భద్రతను అందించడంలో సక్సెస్ ను సాధించి.. భవిష్యత్తులో ప్రజాధరణ పొందుతారనే నమ్మకాన్ని మూటగట్టుకున్నాయి. అయితే విమానాశ్రయ ఆపరేటర్‌ల సహకారంతో ఫిన్లాండ్ ఆగష్టు 28, 2023న పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా నిలిచింది.
ఇతర దేశాలు ఇప్పుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా.. ఈ డిజిటల్ పాస్‌పోర్ట్‌లను ప్రవేశపెట్టి ప్రపంచంలోనే మొదటి దేశంగా ఫిన్‌లాండ్ అవతరించింది. ఇంతకీ ఈ డిజిటల్ పాస్‌పోర్ట్ ఏంటి అనుకుంటున్నారా? ఇదొక మొబైల్ అప్లికేషన్. ప్రయాణికులు భౌతిక పాస్‌పోర్ట్‌ను తీసుకువెళ్లడానికి బదులుగా వారి పాస్‌పోర్ట్ సమాచారాన్ని వారి స్మార్ట్‌ఫోన్‌లలో నిల్వ చేయడానికి సంబంధిత అధికారులకు చూపించడానికి సులభంగా ఉంటుంది. అయితే ఫిన్‌లాండ్ తన డిజిటల్ పాస్‌పోర్ట్ ప్రాజెక్ట్‌ను ఎలా ప్రారంభించింది? ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుంది అనే వివరాలు కూడా తెలుసుకుందాం..
ఈ ప్రాజెక్ట్ ప్రయాణ సాంకేతికత, భద్రతను మెరుగుపరచడానికి డిజిటల్ పాస్‌పోర్ట్‌లను పరీక్షించడానికి ఎంతో కృషి చేశారు. ప్రయాణికులు తమ గుర్తింపును ధృవీకరించడానికి ఫేషియల్ రికగ్నిషన్ గానీ, బయోమెట్రిక్ డేటాను ఉపయోగించి ఈ పైలట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రయాణికులు బయలుదేరడానికి 36 నుంచి 4 గంటల ముందు ఫిన్నిష్ బోర్డర్ గార్డ్‌కు యాప్ ద్వారా వారి డేటాను అందించాలి. అంతేకాదు QR కోడ్‌ను స్కాన్ చేయడానికి వారి స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించవచ్చు. దీనికి సంబంధించిన డాక్యూమెంట్స్ ను మెరుగుపరచడం, మనుషుల పని భారం తగ్గించడమే దీని లక్ష్యం అంటున్నారు. దీని వల్ల ప్రయాణాన్ని వేగవంతంగా, సురక్షితంగా చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకున్నారట.
అయితే ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరి 2024 వరకు అమలులో ఉంటుంది. ప్రయాణీకుల సౌలభ్యం, వినియోగాన్ని ఈ సమయంలో పరీక్ష చేస్తారట. ఈ భాటలో ఉక్రెయిన్, సింగపూర్, చైనా, ఎస్టోనియా, ఇజ్రాయెల్ వంటి కొన్ని దేశాలు కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రయాణాన్ని సులభతరం చేయడానికి డిజిటల్ హెల్త్ లేదా వ్యాక్సిన్ పాస్‌పోర్ట్‌లను కూడా ప్రవేశపెట్టాయి.