Earthquake In America: వియత్నాంలో భారీ భూకంపం సంభవించిన 48 గంటల వ్యవధిలోనే అగ్రరాజ్యం అమెరికాను భూ ప్రకంపనలు భయపెట్టాయి. వియత్నాంలో 7.2 తీవ్రతతో భూమి కంపించగా, అమెరికాలో మాత్రం 4.8 తీవ్రతతో కంపించింది. దీంతో అమెరికన్లు ఊపిరి పీల్చుకున్నారు. న్యూజెర్సీలో ఈ భూప్రకంపనలు ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. యూఎస్ జియోలాజికల్ సర్వే ఈమేరకు ప్రకటన చేసింది. అయితే వైట్ హౌస్ స్టేషన్‌కు ఏడు కిలోమీటర్ల దూరంలో భూమి ఉపరితలం నుంచి 4.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
పరుగులు తీసిన జనం..
స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10:30 గంటలకు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో న్యూజెర్సీ వాసులు భయంతో వణికిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే తీవ్రత తక్కువగా ఉండడంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. కొన్ని సెకన్లపాటే భూమి కంపించడం, తర్వాత సాధారణ స్థితికి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
భద్రతా మండలి సమావేశం జరుగుతుండగా…
న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో గాజా పరిస్థితిపై భద్రతా మండలి సమావేశం మొదలైన కొద్ది సేపటికే భూమి కంపించింది. దీంతో అధికారులు సమావేశం తాత్కాలికంగా నిలిపివేశారు. ఇది భూకంపమా మాట్లాడుతున్న సమయంలో సేవ్ ది చిల్డ్రన్ ప్రతినిధి జాంటీ సోరిప్టో అన్నారు. బాల్టిమోర్, ఫిలడెల్ఫియా తదితర ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు స్థానికులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.