IPL 2024 SRH Vs CSK: చెన్నై ఓటమికి సన్ రైజర్స్ గెలుపునకు మధ్య ఆ ఒక్కడు

హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, కమిన్స్, ఉనద్కత్, నటరాజన్, షాబాజ్ అహ్మద్ తలా ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు బౌలింగ్ సరికొత్తగా కనిపించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 6, 2024 10:39 am

IPL 2024 SRH vs CSK

Follow us on

IPL 2024 SRH vs CSK: సొంత మైదానంలో హైదరాబాద్ జట్టు మరోసారి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో అభిషేక్ శర్మ పేరు మారుమోగిపోతోంది. ఈ హైదరాబాద్ ఆటగాడు శుక్రవారం రాత్రి హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టుపై వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై జట్టు 165 పరుగుల స్వల్ప లక్ష్యమే విధించినప్పటికీ..నెట్ రన్ సాధించాలనే ఉద్దేశంతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 12 బంతులు మాత్రమే ఎదుర్కొని మూడు ఫోర్లు, నాలుగు సిక్స్ లతో మెరుపులు మెరిపించాడు. బౌలర్ ఎవరనేది లెక్కచేయకుండా కేవలం బాదుడునే మంత్రంగా ఎంచుకున్నాడు. దీపక్ చాహర్, మహీష్ తీక్షణ, ముఖేష్ చౌదరి, తుషార్ దేశ్ పాండే, రవీంద్ర జడేజా.. ఇలా చెన్నై జట్టు అగ్రశ్రేణి బౌలర్లందరినీ అభిషేక్ శర్మ ఒక ఆట ఆడుకున్నాడు.

హెడ్ తో కలిసి..

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచినప్పటికీ హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. చెన్నై ఓపెనర్లు రచిన్ రవీంద్ర (12), కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్(26).. మెరుగైన ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. 12 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో క్యాచ్ అవుటయ్యాడు. అప్పటికి చెన్నై జట్టు 25 పరుగులు మాత్రమే చేసింది. ఈ దశలో వన్ డౌన్ బ్యాటర్ గా అజింక్య రహానే మైదానంలోకి వచ్చాడు.. తన పూర్వపు ఫామ్ కనబరిచాడు. అతడు 30 బంతుల్లో 35 పరుగులు చేశాడు..రుతు రాజ్, రహనే జోడి రెండో వికెట్ కు 29 పరుగులు జోడించింది. ఈ నేపథ్యంలో జట్టు స్కోరు 54 పరుగులకు చేరుకున్న సమయంలో కెప్టెన్ గైక్వాడ్ షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో శివమ్ దూబె మైదానం లోకి వచ్చాడు.. ఇతడు కేవలం 25 బంతుల్లోనే రెండు ఫోర్లు, 4 సిక్స్ లతో 45 పరుగులు చేసి చెన్నై స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. రహనే, దూబె మూడో వికెట్ కు 65 పరుగులు జోడించారు. ఈ క్రమంలో దూకుడుగా ఆడుతున్న దూబె ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో క్యాచ్ అవుటయ్యాడు. అప్పటికి చెన్నై జట్టు స్కోరు మూడు వికెట్లు నష్టానికి 119 పరుగులు. ఈ దశలో రవీంద్ర జడేజా మైదానంలోకి వచ్చాడు. అతడు, రహానే కలిసి చెన్నై జట్టును ముందుకు నడిపించే బాధ్యత తీసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఉనద్కత్ బౌలింగ్ లో రహనే క్యాచ్ అవుట్ అయ్యాడు. అయినప్పటికీ రవీంద్ర జడేజా మెరుగ్గానే బ్యాటింగ్ చేశాడు. 23 బంతుల్లో 31 పరుగులు చేశాడు. రహనే ఆడిన తర్వాత వచ్చిన మిచెల్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. అతడు ఔటయిన తర్వాత ధోని మైదానంలోకి వచ్చినప్పటికీ.. అతడికి కేవలం మూడువంతులు మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. మూడు బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇలా చెన్నై జట్టు 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది.

హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, కమిన్స్, ఉనద్కత్, నటరాజన్, షాబాజ్ అహ్మద్ తలా ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు బౌలింగ్ సరికొత్తగా కనిపించింది. అడుగడుగునా కెప్టెన్ కమిన్స్ మార్క్ దర్శనమిచ్చింది. ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఫలితంగా చెన్నై స్థాయి లాంటి జట్టు 165 పరుగులకు మాత్రమే పరిమితమైంది. ఇక అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టు అభిషేక్ శర్మ (37), హెడ్(31), మార్క్రమ్(50) సత్తా చాటడంతో హైదరాబాద్ జట్టు 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించి సునాయాస విజయాన్ని అందుకుంది.. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, తీక్షణ చెరో వికెట్ పడగొట్టారు. మొయిన్ అలీ రెండు వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ గురించి.. అతడు కేవలం 12 బంతుల్లోనే 37 పరుగులు సాధించి.. హైదరాబాద్ జట్టుకు బలమైన పునాది వేశాడు. అతడి జోరును అడ్డుకునేందుకు రుతు రాజ్ గైక్వాడ్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. మైదానం నలు వైపులా షాట్లు కొట్టడం తో అభిమానులు కేరింతలు కొట్టారు. అభిషేక్ శర్మ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.