Donald Trump: భారత దేశంలోని ఒడిశా రాష్ట్రంలో పూరీ జగన్నథ రథయాత్ర కొనసాగుతోంది. మరోవైపు పూరీలోని స్వామివారి రత్నభాండాగారాన్ని సైతం ఒడిశా ప్రభుత్వం ఆదివారం(జూలై 14న) తెలిరించింది. ఈ రెండు అంశాలు భారత్‌లో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జగన్నాథ రథయాత్రలో నేరుగా పాల్గొనలేని భక్తులు టీవీలు, సోషల్ మీడియాలో చూసి తరిస్తున్నారు. ఇక స్వామివారి రత్నభాండాగారం గురించి ఇంటర్నెట్‌లో ఆరా తీస్తున్నారు. అందులో ఎంత నిధి ఉంది.. దానిని ఇప్పటి వరకు ఎన్నిసార్లు తెరిచారు. పూరీ జగన్నాథుడికి ఎవరెవరు విరాళాలు ఇచ్చారు.. తదితర అంశాల కోసం సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది అమెరికాలో ఆదివారం జరిగిన కాల్పుల ఘటన. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఆదివారం పెన్సిల్వేనియాలో కాల్పులు జరిగాయి. తృటిలో ఆయన తప్పించుకున్నారు.
జగన్నాథుడి కృపతో తప్పిన గండం..
ఇదిలా ఉంటే… ట్రంప్‌పై కాల్పుల ఘటనకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కాల్చింది ఎవరు.. ఎందుకు కాల్చారు.. ఎన్నికల వేళ ఈ ఘటన వెనుక ఇంకేదైనా కారణం ఉందా.. దీనిపై అమెరికా దర్యప్తు సంస్థ ఎఫ్‌బీఐ ఏం చెబుతోంది అని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఇస్కాన్ సంస్థ చేసిన ప్రకటన ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని అటువైపు మళ్లేలా చేసింది. ట్రంప్‌కు ప్రాణగండం తప్పడానికి పూరీ జగన్నాథుడే కారణమని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) ప్రకటించింది. పూరీ జగన్నాథ రథయాత్రతో ట్రంప్‌కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా వెల్లడించింది.
జగన్నాథుడితో అనుబంధం..
ఇస్కాన్ ప్రకారం.. ట్రంప్‌కు ప్రాణాపాయం తప్పడానికి జగన్నాథుడి కృపే కారణం.. 48 ఏళ్ల క్రితం ట్రంప్ పూరీ జగన్నాథ రథయాత్రకు సహకారం అందించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రథయాత్రలు సాగుతున్నాయి. ఈ సమయంలోనే ట్రంప్‌పై కాల్పులు జరగడం, ఆయన హత్యాయత్నం నుంచి తప్పించుకోవడం భగవంతుడి అనుగ్రహమే అని ఇస్కాన్ వెల్లడించింది.
ట్రంప్ అందించిన సహకారం ఇదీ..
ఇక ట్రంప్ 48 ఏళ్ల క్రితం చేసిన సహాయం ఏమిటంటే.. 1976లో ఇస్కాన్ భక్తులు రథయాత్ర కోసం రథాలు సిద్ధం చేసేందుకు ఉచితంగా తన ట్రైన్ యార్డును ఇచ్చి సహకరించారు. దీంతో జగన్పాథుడి కృప డొనాల్డ్ ట్రంప్‌పై ఉందని పేర్కొంటున్నారు. స్వామివారి దీవెనతోనే ప్రాణ గండం తప్పిందని ఇస్కాన్ ప్రతినిధి రాధారమణ్ దాస్ అభిప్రాయపడ్డారు.
దుండగుడి కాల్పుల్లో గాయాలు..
ఇదిలా ఉంటే.. డొనాల్డ్ ట్రపంప్ పెన్సిల్వేనియాలో బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ చెవికి తీవ్ర గాయమైంది. తృటిలో ఆయన మృత్యువు నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో సభలో ఉన్న ఓ వ్యక్తి పాణాలు కోల్పోయాడు. రక్తమోడుతున్న ట్రంప్‌ను భద్రతా సిబ్బంది చుట్టముట్టింది. వలయంగా ఏర్పడింది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్‌ను సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు.
దుండగుడి కాల్చివేత..
ఇక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు.. అప్రతమ్తమై ట్రంప్‌పై కాల్పులు జరిపిన దుండగుడిని మట్టుపెట్టాయి. ట్రంప్‌పైకి బుల్లెట్లు దూసుకు వస్తున్న సమయంలోనే సీక్రెట్ ఏజెంట్లు రెప్పపాటులో దుండగుడిపై ఎదురు కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడే మృతిచెందాడు.
కొనసాగుతున్న పూరీ రథ యాత్ర..
ఇదిలా ఉంటే.. జూలై 7న పూరీలో ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర కొనసాగుతోంది. జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర ముగ్గురు మూర్తులను రథంపై ఉంచి పెంచిన తల్లి గుండిచాదేవి ఆలయానికి చేరుకున్నారు. రథయాత్ర సోమవారం(జూలై 15న) తిరిగి వెళ్తుంది. ఈ వేడుక బహుడా యాత్రగా పేర్కొంటారు. ఈ ఉత్సవంలో 8 లక్షల మంది పాల్గొన్నారు. 82 ప్లాటూన్ల పోలీసుల బలగాలను భద్రత కోసం ఏర్పాటు చేశారు.