Rare Earth Metal: భారత్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారీ పథకంపై (ECMS) ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్ కారణంగా ప్రమాదంలో పడింది. ఈ మెటల్ సరఫరా చేయడాన్ని చైనా నిలిపివేయడంతో ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న కొన్ని కంపెనీలు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేశాయి. ఇదే పరిస్థితి మరో ఆరు నెలలు కొనసాగితే ఇన్సెంటివ్‌లతో కూడిన ఉత్పత్తి, ఎగుమతి లక్ష్యాలను చేరుకోలేమని ఆ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనివల్ల ప్రభుత్వ పథకం అనుకున్నంతగా విజయం సాధించకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు ECMS పథకం కింద ఇప్పటికే 110కి పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అయితే, కనీసం 10 కంపెనీలు రేర్ ఎర్త్ మెటల్స్ కొరత వల్ల తమ ప్రణాళికలు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి. కొన్ని కంపెనీలు ఇప్పుడు చైనా నుంచి వచ్చే వాటి గురించి కాకుండా ప్రత్నామ్యాయ మార్గాలపై అన్వేషణ కొనసాగిస్తున్నాయి. అయితే అధికారులు ఇది పెద్ద సమస్య కాదని, రేర్ ఎర్త్ మెటల్ అవసరమైతే దిగుమతి చేసుకోవచ్చని అంటున్నారు. దీనికి ఆల్టర్నేటివ్ టెక్నాలజీ లేదా సరఫరా మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
Also Read: భారత్‌పై చైనా వాటర్ బాంబ్.. జలయుద్ధం తప్పదా?
ఎగుమతులు, ఉత్పత్తిని పెంచడానికి ఆటో పరిశ్రమ ప్రయత్నిస్తున్న సమయంలో ECMS ప్రారంభమైందని, అయితే రేర్ ఎర్త్ మాగ్నెట్ల కొరత ఈ రంగాన్ని బాగా ప్రభావితం చేసిందని ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ చాండక్ అన్నారు. రూ.22,919 కోట్ల విలువైన ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం మల్టీ-లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, లిథియం-అయాన్ సెల్స్, రెసిస్టర్లు, కెపాసిటర్లు, డిస్‌ప్లే మాడ్యూల్స్ వంటి ప్యాసివ్ కాంపోనెంట్ల దేశీయ తయారీ వ్యవస్థను డెవలప్ చేయడం.
చైనా మే నెలలో కఠినమైన ఎగుమతి నియమాలను అమలులోకి తీసుకువచ్చింది. ఇది ముఖ్యంగా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు తయారీపై తీవ్ర ప్రభావం చూపింది. ఇండియన్ ప్రింటెడ్ సర్క్యూట్ అసోసియేషన్ సెక్రటరీ కేఎస్ బాబు మాట్లాడుతూ.. కాపర్ క్లాడ్ లామినేట్ వంటి ముడిసరుకులు, ఇవి పూర్తిగా చైనా నుండి దిగుమతి అవుతాయి. ఇప్పుడు వాటి ధరలు పెరిగాయని తెలిపారు. చైనా డిస్ట్రిబ్యూటర్లు షిప్‌మెంట్ సమస్యలను సాకుగా చూపి ధరలను పెంచుతున్నారని తెలిపారు.
Also Read: చైనాలో ఉచిత విద్య ఈ స్థాయిలో.. వందేళ్లయినా మనకు కష్టమే
ECMS లో పీసీబీ ఇండస్ట్రీకి బాగా డిమాండ్ ఉంది, కానీ గ్లోబల్ సప్లై చైన్లో ఉన్న ఇబ్బందులు లక్ష్యాలను చేరుకోవడం కష్టతరం చేశాయి. ప్రభుత్వం మద్దతు ఇస్తామని హామీ ఇచ్చింది. జూలై 31తో ముగియనున్న పథకం దరఖాస్తు గడువును పొడిగించాలని నిర్ణయించింది. చైనా కూడా ఎక్కువ కాలం ఎగుమతి నిషేధాన్ని కొనసాగించదని పరిశ్రమ నిపుణులు ఆశిస్తున్నారు, రాబోయే నెలల్లో పరిస్థితి మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు.