US Presidential Election 2024: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో జరుగనున్నాయి. ఈమేరు ఆదేశ ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఓటరు నమోదు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. గ్రీన్‌కార్డు పొందిన భారతీయులు ఓటుహక్కు నమోదు చేసుకునేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. అధికార డెమోక్రటిక్ పార్టీ కూడా భారతీయులు ఓటుహక్కు నమోదు చేసుకునేలా కృషి చేస్తోంది. ఇక అభ్యర్థుల ప్రచారం కూడా ఊపందుకుంది. ప్రధాన పార్టీలైన అధికార డెమోక్రటిక్ పార్టీ, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులుగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి కూడా నేతలు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. కానీ, డెమోక్రటిక్, రిపబ్లికన్‌పార్టీ అభ్యర్థులకు పోటీ ఇవ్వడం లేదు. దీంతో కమలా, ట్రంప్ మధ్యనే ప్రధాన పోటీ ఉంది. ఇక ఈ ఎన్నికల్లో మొదట అధికార పార్టీ అభ్యర్థిగా జోబైడెన్ ఉండగా, ఆయన అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఉపాధ్యక్షురాలు, భారతీయ, ఆఫ్రికన్ మూలాలున కమలా హారిస్ రేసులోకి వచ్చారు. బైడెన్ అభ్యర్థిగా ఉన్న సమయంలో డెమోక్రటిక్ పార్టీ గెలుపు అవకాశాలు తగ్గాయి. ఈ క్రమంలో ట్రంప్‌పై కాల్పులు జరగడం కూడా అమెరికన్లను ఆయనవైపు మళ్లించింది. ట్రంప్‌వైపే మెజారిటీ అమెరికన్లు మొగ్గు చూపారు. ఇప్పుడు కమలా బరిలో నిలవడంతో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. క్రమంగా కమలా రేసులో దూసుకుపోతోంది. తాజాగా నిర్వహించిన సర్వేల్లో ట్రంప్ కన్నా కమలా ముందు ఉన్నట్లు పలు సంస్థలు తెలిపాయి.
తప్పుకునే ఆలోచనలో రాబర్ట్ ఎఫ్.కెన్నడీ..
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు నుంచి స్వతంత్ర అభ్యర్థి రాబర్ట్ ఎఫ్.కెన్నడీ జూనియర్ వైదొలగనున్నారు. ఈవిషయాన్ని అమెరికా మీడియా సంస్థలు న్యూయార్క్ టైమ్స్, సీఎన్‌ఎన్ వెల్లడించాయి. ప్రస్తుతం కెన్నడీకి దేశవ్యాప్తంగా 8.7 శాతం ఓటర్ల మద్దతు ఉన్నట్లు ది హిల్ పత్రిక నిర్వహించిన సర్వే పేర్కొంది. ఆయన భవిష్యత్తులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్సో్ల ట్రంప్–హారిస్ మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కెన్నడీ మద్దతు ఆయనకు లభించడంతో స్వింగ్ స్టేట్స్‌లో ఎన్నికల ఫలితాలను ఇది ప్రభావితం చేసే అవకాశం ఉంది.
ప్రముఖ రాజకీయ కుటుంబ వారసుడిగా..
ఇదిలా ఉంటే.. అమెరికాలోని ప్రముఖ రాజకీయ కుటుంబ వారసుడిగా, లాయర్‌గా జూనియర్ కెన్నడీ సుపరిచితం. ప్రజారోగ్యానికి సంబంధించిన కుట్ర కోణాలను కెన్నడీ ప్రమోట్ చేస్తారనే విమర్శలున్నాయి. ఆయన కూడా ట్రంప్, కమలాకు పోటీగా ఎన్నికల బరిలోకి దిగారు. కానీ, ప్రచారంలో అనుకున్నంత దూకుడు లేదు. ముఖ్యంగా ప్రధాన ఓటర్ల నుంచి స్పందన కరవైంది. ఈనేపథ్యంలో ఆయన శుక్రవారం అమెరికాలోని అరిజోనా నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆయన ప్రచార బృందం వెల్లడించింది. అదే సమయంలో ఆయన తన ప్రచారాన్ని కూడా సస్పెండ్ చేయవచ్చని సీఎన్‌ఎన్ అంచనా వేసింది. మరోవైపు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ కెన్నడీని పొగడ్తలతో ముంచెత్తారు. ‘అతడో బ్రిలియంట్. అతడితో నాకు చాలా రోజులుగా పరిచయం ఉంది. ఆయన వైదొలగుతున్నారనే విషయం నాకు తెలియదు. ఒకవేళ ఆయన ఆ దిశగా ఆలోచిస్తే.. స్వాగతిస్తాను‘ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో కెన్నడీ వైదొలుగుతారని అమెరికా మీడియా ప్రచారం చేస్తోంది.