America: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికా ఫస్ట్‘ అనే నినాదంతో హెచ్–1బీ వీసా ఫీజులను ఆకాశానికి ఎగరేలా చేసింది. భారతీయ ఐటీ నిపుణులను దూరం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే, ఈ నిర్ణయం అమెరికా కొంపముంచేలా ఉంది! ఈ వీడియోలు సెటైరికల్ హాస్యంతో భారత్ భవిష్యత్తును ఆకాశంలోకి ఎగరవేస్తూ, అమెరికాను అడుక్కోమని ఎగతాళి చేస్తున్నాయి.
భారతీయులు లేని అమెరికా..
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఒకప్పుడు ‘భారత్ లేకపోతే అమెరికా లేదు‘ అని అన్నారు. భారతీయ ఐటీ నిపుణుల వల్లే అమెరికా టెక్ రంగం ఆకాశాన్ని అంటిందని చెప్పారు. కానీ, ట్రంప్ విధానాలు ఈ నిపుణులను దూరం చేస్తే, అమెరికా ఐటీ రంగం ఒక్కసారిగా గాలిలో కలిసిపోయిన బెలూన్‌లా అవుతుందని వీడియోలు సెటైర్ చేస్తున్నాయి. భారతీయ టాలెంట్ ఇక అమెరికాకు బదులు భారత్‌లోనే ఉంటే, 2030 నాటికి బెంగళూరు సిలికాన్ వ్యాలీని మించిపోతుందని, అమెరికా టెక్ కంపెనీలు లాప్‌టాప్‌లు మూసుకుని ఇంటికి వెళ్లిపోతాయని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
రూపాయి రాజ్యం, డాలర్ దిగజారుడు..
ఒక వైరల్ వీడియోలో 2030లో భారత్‌ను సందర్శించిన ఓ అమెరికన్, ఇక్కడి అభివృద్ధి చూసి ఆశ్చర్యపోతూ, ‘ఇది భారతమా, స్వర్గమా?‘ అని అడుగుతాడు. రూపాయి విలువ ఆకాశాన్ని తాకగా, డాలర్ అడుక్కునే స్థితికి వచ్చిందని ఈ వీడియోలు సెటైర్‌గా చూపిస్తున్నాయి. ఒక సన్నివేశంలో భారతీయ కస్టమర్ అమెరికన్ రెస్టారెంట్ సర్వర్‌కు డాలర్లలో కాక, రూపాయల్లో టిప్ ఇస్తాడు. ‘డాలర్‌తో ఏం చేస్తాం సార్, రూపాయి ఇవ్వండి!‘ అని సర్వర్ అడిగే సీన్‌ను చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టం! ఈ వీడియోలు మరో అడుగు ముందుకేసి, 2050 నాటికి అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, అమెరికన్లు రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టుల వద్ద ట్యాక్సీ డ్రైవర్లుగా, రెస్టారెంట్ సర్వర్లుగా పనిచేస్తున్నట్లు చూపిస్తున్నాయి. ఒక సీన్‌లో ఓ అమెరికన్ అమ్మాయి భారతీయ టూరిస్ట్ వద్ద రూపాయలు అడుగుతూ కనిపిస్తుంది. ‘మీ నిర్ణయాలే మమ్మల్ని ఇలా చేశాయి సార్!‘ అని ఆమె ట్రంప్‌ను ఎద్దేవా చేస్తూ కనిపిస్తుంది. ఇది సెటైర్ అయినా, భారతీయ టాలెంట్‌ను దూరం చేసుకుంటే అమెరికా భవిష్యత్తు ఇలాగే ఉంటుందని ఈ వీడియోలు హెచ్చరిస్తున్నాయి.
భారత్ సూపర్‌పవర్..
ట్రంప్ నిర్ణయాలు భారత్‌కు నష్టం చేయకపోగా, భారత్‌ను సూపర్‌పవర్‌గా మార్చేస్తాయని ఈ వీడియోలు ఊహిస్తున్నాయి. భారతీయ నిపుణులు స్వదేశంలోనే ఉంటే, భారత్ ఐటీ, టెక్నాలజీ రంగాలు గణనీయంగా అభివృద్ధి చెందుతాయని, 2050 నాటికి భారత్ ఆర్థిక సంపదలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందని చెబుతున్నాయి. అమెరికా మాత్రం టాలెంట్ కొరతతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని సెటైర్‌గా చూపిస్తున్నాయి. ‘భారత్‌ను దూరం చేసుకుంటే, అమెరికా ఖాళీ డబ్బాలా మిగిలిపోతుంది!‘ అని ఒక వీడియోలో ఓ కామెంట్ నవ్వు తెప్పిస్తుంది.
ఈ వైరల్ వీడియోలు హాస్యంగా ఉన్నా, వాటిలో ఒక సందేశం స్పష్టంగా కనిపిస్తోంది. భారతీయ టాలెంట్‌ను గౌరవించకపోతే, అమెరికా నష్టపోయ ప్రమాదం ఉంది. హెచ్–1బీ వీసాల ఫీజుల పెంపు, ఇమిగ్రేషన్ విధానాల కఠినత వల్ల భారత్‌కు నష్టం జరగకపోవచ్చు, బదులుగా భారత్ మరింత శక్తివంతంగా ఎదిగే అవకాశం ఉంది.