Salman Bin Abdulaziz: ప్రభువెక్కిన పల్లకి కాదోయ్.. మోసిన బోయిలెవరు.. అని రాజరికాన్ని ప్రశ్నిస్తూ శ్రీ శ్రీ రాశాడు గాని.. నేటికీ రాజరికం అనేది ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాధినేతలు రాజులకంటే ఎక్కువగా చలామణి అవుతున్నారు. ఇక ప్రజాస్వామ్యం లేని దేశాలలో రాజులే ఆ దేశాలకు అధిపతులుగా కొనసాగుతున్నారు. మనదంటే ప్రజాస్వామ్య దేశం కాబట్టి.. ఎంత కొంత మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. ఓటు హక్కు ద్వారా మన నిర్ణయాన్ని అంతర్గతంగా చెప్పేందుకు అధికారం ఉంటుంది. అదే రాజరికపు పోకడలు ఉన్న దేశాలలో అది ఏమాత్రం కుదరదు. ఇష్టం ఉన్నా లేకున్నా.. అక్కడ రాజే దేవుడు. రాజే పాలకుడు, పరిపాలకుడు.. ఇటువంటి రాచరిక వ్యవస్థ అరబ్ దేశాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అరబ్ దేశాలకు పెద్దన్న పాత్రను సౌదీ అరేబియా పోషిస్తుంది. ఇప్పుడు ఆ దేశ రాజుకు జబ్బు చేసింది. ఇంకేముంది రాజ ప్రాసాదమే ఒక ఆసుపత్రిగా మారిపోయింది.
కోవిడ్ లాంటి సమయంలో సౌదీ అరేబియాలో విస్తృతంగా వైద్య సేవలు నిర్వహించినప్పటికీ.. రాజప్రాసాదాలను ఆస్పత్రులుగా మార్చే ప్రక్రియ మాత్రం జరగలేదు. చివరికి అందులో పని చేసే కార్మికులకు కోవిడ్ సోకినప్పటికీ.. వారికోసం అక్కడ క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు కాలేదు. అదే రాజ కుటుంబీకులలో ఎవరికైనా అనారోగ్యం అనిపిస్తే చాలు అప్పటికప్పుడు వైద్య సేవలు యుద్ధ ప్రాతిపదికన అందేవి. అంటే దీన్ని బట్టి ప్రజలకు, రాజుకు ఏ స్థాయిలో ప్రాధాన్యం దక్కుతుందో అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ప్రజలు చెల్లించిన పన్నులతో పాలకుడు స్వర్గసుఖాలను అనుభవిస్తాడు. ఇక సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఊపిరితిత్తుల వాపుతో బాధపడుతున్నాడు. పైగా అతడు వయసు 88 సంవత్సరాలు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. రాజు ఎలాగైనా బతకాలి.. అందుకు రాజ ప్రాసాదమే ఆస్పత్రిగా మారిపోయింది. జెద్దాలోని అల్ సలాం ప్యాలెస్ ను తాత్కాలిక ఆసుపత్రిగా మార్చి రాజుకు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకటించింది. ఊపిరితిత్తుల వ్యాధితో పాటు కీళ్లనొప్పులు, తీవ్రమైన జ్వరంతో సౌదీ రాజు బాధపడుతున్నాడు. ఆయనకు అల్ సలాం ప్యాలెస్ లోని రాయల్ క్లినిక్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు.. ఏప్రిల్ నెలలో ఆయన సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించుకోగా ఊపిరితిత్తుల వ్యాపు వ్యాధి బయటపడింది..
సల్మాన్ 2015 నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతి దారు అయిన సౌదీ అరేబియా దేశానికి రాజుగా వ్యవహరిస్తున్నారు. అతని కుమారుడు కౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ అరేబియా దేశానికి చెందిన ఇతర వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ వారం జపాన్ పర్యటనకు వెళ్తున్నారు మే 20 నుంచి 23 వరకు ఆయన ఆ దేశంలో పర్యటిస్తారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ను కలుస్తారు. గాజాలో యుద్ధం, సౌదీ అరేబియా, అమెరికా దేశాల మధ్య ముసాయిదా, వ్యూహాత్మక ఒప్పందాలు గురించి ఆయన చర్చిస్తారు. ఆదివారం మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లీవాన్ తో సమావేశం అయ్యారు. అమెరికా, సౌదీ అరేబియా దేశాల మధ్య భద్రతా హామీలు, ఇతర చారిత్రాత్మక ఒప్పందాలపై సల్మాన్, సుల్లీ వాన్ చర్చించారు. అంతకుముందు బిన్ సల్మాన్ బహ్రెయిన్ లోని 33వ అరబ్ సమ్మిట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా జోర్డాన్ రాజు అబ్దుల్లా – 11, ఇతర ప్రాంతీయ నాయకులతో సమావేశమయ్యారు. కాగా, సౌదీ రాజుకు తమ చికిత్స అందిస్తున్నామని.. ఆయన వాటికీ స్పందిస్తున్నారని.. త్వరలోనే కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. అయితే జెడ్డా ప్యాలెస్ ను తాత్కాలిక ఆసుపత్రిగా మార్చడం పట్ల సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. “రాజంటే దైవ స్వరూపుడు. మానవాతీతుడు.. మిగతావన్నీ జానేదాన్” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.