Viral Video : డబ్బు సంపాదించడానికి పెద్ద పెద్ద డిగ్రీలు అక్కర్లేదని చాలా మంది అంటుంటారు. పెద్ద పెద్ద డిగ్రీలు చదివి, కార్పొరేట్ కంపెనీల్లో రోజుకు తొమ్మిది గంటలు కష్టపడుతున్న వారెంతో మంది ఉన్నారు. కానీ, కొందరు మాత్రం తమ తెలివితేటలతో, ఈ డిగ్రీలు ఉన్నవారికంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. అలాంటి ఒక ఆసక్తికరమైన సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన ఒక ఆటో డ్రైవర్ నెలకు రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ విషయం తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
లెంస్‌కార్ట్ (Lenskart) ప్రొడక్ట్ లీడర్ రాహుల్ రూపాని (Rahul Rupani) ఈ ఆటో డ్రైవర్ కథను తన లింక్డ్‌ఇన్ (LinkedIn) ఖాతాలో పంచుకున్నారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. రాహుల్ చెప్పిన దాని ప్రకారం, ఈ వ్యక్తి ఎలాంటి అదనపు కష్టం లేకుండా, తన ఆటో సహాయంతో నెలకు రూ.5 లక్షలు సులభంగా సంపాదిస్తున్నాడు. అతడి కథ వెలుగులోకి రాగానే ఎలా సాధ్యం అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. రాహుల్ ఈ కథను షేర్ చేస్తూ ఇంత డబ్బు సంపాదించడానికి అతను తన రిక్షాను ఒక చోట నిలబెట్టి రోజుకు సుమారు రూ.20 వేలు సంపాదిస్తున్నాడని పేర్కొన్నాడు.
రాహుల్ వివరించిన వివరాల ప్రకారం, ఈ ఆటో డ్రైవర్ వీసా ఆఫీస్ (Visa Office) బయట నిలబడతాడు. వీసా ఆఫీస్‌లోకి వెళ్లే వ్యక్తులను వారి ముఖ్యమైన పత్రాలు, వస్తువులు ఉన్న బ్యాగులను తన ఆటోలో పెట్టుకోవాలని సూచిస్తుంటాడు. దీనికి ప్రతిగా ఒక్కో బ్యాగుకు రూ.1000 వసూలు చేస్తాడు. ఈ విధంగా అతను రోజుకు సుమారు 20 మంది కస్టమర్లను పట్టుకుని రోజుకు రూ.20,000 సులభంగా సంపాదిస్తాడు. ఈ లెక్కన చూస్తే ఈ వ్యక్తి నెలకు రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడు.
సోషల్ మీడియాలో వైరల్
ఈ ఆటో డ్రైవర్ కథ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే, నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. ఒక యూజర్, “ఈ వ్యక్తికి డిగ్రీ లేకపోవచ్చు, కానీ డిగ్రీలు ఉన్నవారికంటే తెలివిగా సంపాదిస్తున్నాడు” అని రాశాడు. మరొకరు, “లక్షల రూపాయలు ఇంత చిన్న ఐడియాతో కూడా సంపాదించవచ్చని చూస్తే నమ్మలేకపోతున్నాను” అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంకొకరు, “నిజంగా ఆపదను అవకాశంగా మార్చుకోవడం అంటే ఇదే” అని వ్యాఖ్యానించారు. ఇంకా చాలా మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు.