76 members coalition opposition media : ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఎన్నికలు జరిగి పట్టుమని సంవత్సరం అవుతోంది. అయినా కానీ ఏపీలో రాజకీయ వాతావరణం వేడిగా ఉంది. మరోవైపు సర్వేలు అంటూ చాలామంది హల్చల్ చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ఐ వి ఆర్ ఎస్ సర్వే చేపట్టిందని.. అందులో ఆసక్తికర ఫలితాలు వచ్చాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. కూటమి పని అయిపోయిందని.. 76 మంది ఎమ్మెల్యేలపై ఘోర వ్యతిరేకత ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంత మీడియాలో అయితే బిగ్ డిబేట్ పెట్టి మరీ చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఇదే వైరల్ అంశంగా మారుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం దీనినే ట్రోల్ చేస్తున్నాయి.
* సర్వేల హల్ చల్
ఏపీలో కూటమి( Alliance ) బంపర్ విక్టరీ కొట్టింది. కనీవినీ ఎరుగని మెజారిటీతో దూసుకుపోయింది. 164 అసెంబ్లీ స్థానాల్లో పాగావేసింది. 21 పార్లమెంటు స్థానాలను దక్కించుకుంది. జనసేన అయితే 100% స్ట్రైక్ రేట్ తో సూపర్ విక్టరీ కొట్టింది. బిజెపి సైతం గణనీయమైన సీట్లు ఓట్లు సాధించింది. అయితే కూటమి ఏడాది పాలన పూర్తి అవుతున్న తరుణంలో ప్రముఖ సెఫాలాజిస్టులు, సర్వే సంస్థలు తమ సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత అధికంగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ టిడిపి కూటమి కొట్టిపారేస్తోంది. కానీ లోలోపల మాత్రం భయపడుతోంది.
* మూడు పార్టీల ఎమ్మెల్యేలపై..
మరోవైపు కూటమి ప్రభుత్వం ఐ వి ఆర్ ఎస్ సర్వే( ivrs survey ) చేపట్టిందని.. అందులో షాక్ కొట్టిన ఫలితాలు వచ్చాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాలో డిబేట్ పెట్టి మరీ చర్చిస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా 135 స్థానాల్లో విజయం సాధించింది. అయితే అందులో ఓ 54 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని ఈ సర్వేలో తేలినట్లు సమాచారం. వీరిపై వ్యతిరేకత పతాక స్థాయిలో ఉందని.. వచ్చే ఎన్నికల్లో ఈ 54 నియోజకవర్గాల్లో టిడిపి గెలుపు కష్టమేనని వైసిపి అనుకూల మీడియా విశ్లేషిస్తోంది. మరోవైపు జనసేన పార్టీ సైతం 21 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఓ నలుగురు తప్ప 17 మందిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో తేలింది. మరోవైపు బిజెపి ఎమ్మెల్యేలు 8 మందిలో ఐదుగురు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు ఈ సర్వే తేల్చింది. అయితే ఇప్పుడు ఈ సర్వే వైసిపి అనుకూల మీడియా డిబేట్ కొనసాగిస్తోంది.
* ప్రత్యర్థి మీడియాకు ఎలా వచ్చింది?
అయితే సర్వేల విషయంలో కొన్ని సంస్థలకు మాత్రమే విశ్వసనీయత ఉంది. అయితే ప్రభుత్వం చేపట్టే ఈ సర్వే వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ మీడియాకు ఎలా వచ్చింది? అన్నది ఇప్పుడు ప్రశ్న. సర్వేలో వాస్తవం ఉండవచ్చు కానీ.. అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంత మీడియాలో ప్రసారం కావడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సర్వేను ప్రజలు నమ్మే స్థితిలో లేరని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. పైగా సొంత మీడియాలో నిత్యం డబ్బా కొట్టే వారితో డిబేట్ పెట్టడం కూడా ఈ సర్వే విశ్వసనీయతను దెబ్బతీస్తోంది. అయితే కూటమి ఎమ్మెల్యేలు పై వ్యతిరేకత ఉందన్న ప్రచారం మాత్రం పెరుగుతోంది. దీనిపై కూటమి ఆత్మ విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది.