Viral Video: ఒకే రన్వేపై రెండు విమానాలు.. వెంట్రుకవాసిలో ఘోరం తప్పింది.. వీడియో వైరల్

Viral Video: ఒకవేళ రెండు విమానాలకు చెందిన పైలెట్లు ఆ విషయాన్ని గమనించకపోతే ఘోరం జరిగి ఉండేది.. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 10, 2024 7:00 pm

2 planes take off land on same runway at Mumbai airport

Follow us on

Viral Video: అది ముంబై విమానాశ్రయం.. వచ్చి, పోయే విమానాలతో రద్దీగా ఉంది. విమానాలు వచ్చేందుకు, వెళ్లేందుకు రన్వేలు సిద్ధంగా ఉన్నాయి.. సిబ్బంది ఎప్పటికప్పుడు సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. పైలెట్లు వాటికి అనుగుణంగా విమానాలను నడిపిస్తున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతం నుంచి ఓ ఇండియా విమానం ల్యాండ్ అవుతోంది, అదే రన్వేపై ఎయిర్ ఇండియా కంపెనీ చెందిన విమానం తిరునంతపురం వెళ్లేందుకు టేక్ ఆఫ్ అయ్యింది. రెండు విమానాల మధ్య వందల మీటర్ల లోనే దూరం ఉంది. ఒకవేళ రెండు విమానాలకు చెందిన పైలెట్లు ఆ విషయాన్ని గమనించకపోతే ఘోరం జరిగి ఉండేది.. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.

వాస్తవానికి రన్వే పైకి వచ్చే విమానాలు.. టేక్ ఆఫ్ విమానాలకు ఎప్పటికప్పుడు సంకేతాలు అందుతూ ఉంటాయి. వాటి ఆధారంగానే పైలట్లు విమానాలను నడిపిస్తుంటారు. ఈ సిగ్నల్స్ సక్రమంగా అందేందుకు అధునాతన వ్యవస్థ కూడా ఉంటుంది. ఇన్ని ఉన్నప్పటికీ రెండు విమానాలు ఒకే రన్వే పైకి ఎలా వచ్చాయనేది అంతుపట్టడం లేదు. ఆ సమయంలో అటు ఇండిగో, ఇటు ఎయిర్ ఇండియా విమానాలలో భారీగా ప్రయాణికులు ఉన్నారు. ఏమాత్రం ప్రమాదం జరిగినా, దాని తాలూకు నష్టం తీవ్రంగా ఉండేది. ప్రాణ, ఆస్తి నష్టం భారీగా చోటు చేసుకునేది.. అప్పటికప్పుడు అప్రమత్తం కావడంతో రెండు విమానాలు క్రాష్ కాలేదు.

ఈ ఘటన పై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ప్రాథమిక విచారణలో భాగంగా ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిని విధుల నుంచి తప్పించారు. వారి నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ముంబై విమానాశ్రయ అధికారులు భావిస్తున్నారు. దీనిని కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా తీవ్రంగా పరిగణించడంతో దర్యాప్తు వేగంగా జరుగుతోంది. మరోవైపు ముంబైకి దేశ విదేశాలకు చెందిన విమానాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దేశ వాణిజ్య రాజధానిగా ముంబై నగరానికి పేరుంది. ముంబై విమానాశ్రయంలో ఏదైనా ప్రమాదం జరిగితే.. నష్టం తీవ్రంగా ఉండేది. ఆ ప్రభావం అంతర్జాతీయ సర్వీసులపై పడేది..