అమెరికాలో ఈ రోజు ( అంటే 6వ తేదీ ) జరిగిన సంఘటన అమెరికా చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయం. 1776 లో స్వాతంత్రం పొందిన అమెరికా ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థకి రోల్ మోడల్ . అటువంటి దేశంలో ట్రంప్ లాంటి అధ్యక్షుడు వలన ఆ వ్యవస్థకే చెడ్డపేరు వచ్చింది. రిపబ్లికన్ పార్టీ సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. ట్రంప్ చర్యల్ని అమెరికా కాంగ్రెస్ అభిశంచించటం మాత్రమే సరిపోదు, శిక్షించాలి కూడా. లేకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ఈ స్పూర్తితో మరింతమంది బరితెగించే అవకాశముంది. ఈ రోజు జరిగింది ఏదో చిన్న పొరపాటుగా సరిపెట్టుకోలేము. అధ్యక్షుడే జనాన్ని పిలిచి కాపిటల్ హిల్ భవనం మీదికి వుసి కొల్పటం ఏ ప్రజాస్వామ్యదేశంలోనూ జరగదు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి వూపిరులూదాలంటే ట్రంప్ కి శిక్ష పడాల్సిందే. ఇదే ప్రజాస్వామ్యవాదులందరి డిమాండ్ కావాలి. ప్రజాస్వామ్యమా, అరాచక వాదుల నుండి నిన్ను కాపాడటమెలా?
అసలేం జరిగింది
అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయ్యాడు. బైడెన్ గెలిచాడు. ఎన్నికల్లో ఒకరు గెలుస్తారు, ఇంకొకరు ఓడిపోతారు. ఇది తప్పదు. ఓటమి పాలైన వారు హుందాగా ఓటమిని స్వీకరించాలి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో సహజంగా జరిగేది. కొన్ని దేశాల్లో దీనికి భిన్నంగా తిరుగుబాటులు జరిగిన సంఘటనలు వున్నాయి. అమెరికా ఇందుకు భిన్నం. గత 250 సంవత్సరాల్లో ఏరోజు ఓటమిని అంగీకరించకుండా తిరుగుబాటు చేసిన సంఘటన లేదు. ఎందుకంటే అమెరికాలో వ్యవస్థలు చాలా బలంగా వున్నాయి. వ్యక్తులకన్నా వ్యవస్థలు గొప్పవని అమెరికా ప్రజలు భావిస్తూ వుంటారు. అందుకనే ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచింది. ఈ ఖ్యాతిని రెండున్న శతాబ్దాలుగా ప్రజలు కాపాడుకుంటూ వచ్చారు. అటువంటిది ట్రంప్ పాలనలో అది నీరుగారటమే కాకుండా నిన్నటి సంఘటనతో దానికి మాయని మచ్చ ఏర్పడింది.
ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ట్రంప్ ఆరోపించటం వరకూ కొంతమేర ప్రజలు సహించారు. దానికి పరిష్కారమార్గాలు రాజ్యాంగంలో వున్నాయి కాబట్టి వాటిని ట్రంప్ వినియోగించటం వరకూ కూడా కాదనలేకపోయారు. కాని ఒకసారి సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇంకా దీనిపై రాద్ధాంతం చేయటం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే. అదే ఇప్పుడు జరిగింది. ట్రంప్ తన ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. అందుకే ఎన్నికతర్వాత ప్రక్రియని అడ్డుకోవాలని ప్రయత్నించాడు. దానికోసం అవసరమయితే అరాచక పద్ధతుల్ని అవలంబించటానికి కూడా వెనుకాడలేదు. ఈరోజు దాదాపు 30 వేలమంది జనాన్ని పోగేయటమే కాకుండా వాళ్ళను రెచ్చగొట్టటం అందరూ ప్రత్యక్షంగా టివిల్లో చూసారు. మీరు ఏమి చేతకాని దద్దమ్మలు, బలహీనులు, తప్పుని ఖండించలేని అసహాయకులు లాంటి పదాలు ఉపయోగించటమే కాకుండా కాపిటల్ హిల్ ( అమెరికా కాంగ్రెస్ వుండే ప్రాంతం) కి వెళ్లి నిరశన తెలపమని నేను కూడా పాల్గొంటానని ఉద్రేకాల్ని రెచ్చగొట్టాడు. ఆ ఆవేశంతో జనం నిషేధాజ్ఞలు ఉల్లంఘించి కాపిటల్ హిల్ ని చుట్టుముట్టారు. అంతేకాదు గోడలు ఎక్కి మరీ భవనం లోకి ప్రవేశించారు. మూసివున్న సెనేట్ హాల్, ప్రతినిధుల సభల ద్వారాలను పగలగొట్టారు. స్పీకర్ స్థానాల్లో కూర్చున్నారు. భీభత్సం సృష్టించారు. అదృష్టవశాత్తు అప్పటికే కాంగ్రెస్ సభ్యుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లేకపోతే ఎంత ప్రమాదం జరిగేదో ఊహించలేము. ఈ చర్యల్ని ఉగ్రవాదంతో సమానంగా చూడాలి. ఎంతమంది కాంగ్రెస్ సభ్యులు ఈ పర్యవసానంతో మానసిక క్షోభను అనుభవించారో ముందు ముందు తెలుస్తుంది.
ట్రంప్ ని ప్రధాన ముద్దాయిగా ప్రకటించాలి
ఈ మొత్తం అరాచక చర్యలకి కారణం అధ్యక్షుడు ట్రంప్. తక్షణం అమెరికా కాంగ్రెస్ సమావేశమై అధ్యక్షుడ్ని అభిశంచించటమే కాకుండా తను 20వతేదీ దిగిపోవటానికి ముందే శిక్షించాలి. ఇది అరాచకవాదులకి ఓ గుణపాఠం కావాలి. భవిష్యత్తులో ఏ అధ్యక్షుడూ ఇటువంటి దురాగతానికి పాల్పడకుండా ఉండాలంటే కఠిన శిక్ష విధించాల్సిందే. అమెరికా కాంగ్రెస్ భద్రతా రక్షణలో రేపే సమావేశం కావాలి. లేకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అమెరికా కాంగ్రెస్ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి గుండెకాయ. దాని ప్రతిష్టను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి అమెరికా పౌరుడు మీదా వుంది. ప్రజాస్వామ్యానికి చేటు తెచ్చిన ట్రంప్ ని ప్రధాన ముద్దాయిగా ప్రకటించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Trumps behavior is blot on american democracy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com