Director Venky Atluri: యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి పెళ్ళికి సిద్ధమయ్యారు. ఆయనకు నిశ్చితార్థం జరిగింది. వెంకీ మనువాడబోయే అమ్మాయి పేరు పూజా అని తెలుస్తుంది. కాగా వెంకీ అట్లూరి నటుడిగా పరిశ్రమకు పరిచయం అయ్యాడు. 2010లో విడుదలైన స్నేహగీతం మూవీతో హీరోగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ చిత్రానికి వెంకీ డైలాగ్ రైటర్ కూడాను. స్నేహగీతం మూవీలో సందీప్ కిషన్ మరో హీరోగా నటించారు. స్నేహగీతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనంతరం ఇట్స్ మై లవ్ స్టోరీ,కేరింత చిత్రాలకు డైలాగ్స్ అందించారు.

మూడేళ్లు గ్యాప్ ఇచ్చి తొలిప్రేమ చిత్రంతో దర్శకుడు అయ్యాడు. వరుణ్ తేజ్-రాశి ఖన్నా హీరో హీరోయిన్స్ గా నటించిన తొలిప్రేమ సూపర్ హిట్ అందుకుంది. తొలిప్రేమతో వెంకీ అట్లూరి మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఆయనకు పరిశ్రమలో అవకాశాలు క్యూ కట్టాయి. అఖిల్ హీరోగా మిస్టర్ మజ్ను, నితిన్-కీర్తి సురేష్ కాంబినేషన్లో రంగ్ దే చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ రెండు అనుకున్న స్థాయిలో ఆడలేదు. అయినప్పటికీ ఓ క్రేజీ ప్రాజెక్ట్ పట్టేశాడు.
ధనుష్ హీరోగా బైలింగ్వల్ మూవీ చేస్తున్నాడు. సార్ టైటిల్ తో ధనుష్ మూవీని వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై పరిశ్రమలో అంచనాలున్నాయి. ధనుష్ కి జంటగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సంగీతం జీవి ప్రకాష్ అందిస్తున్నారు.

సార్ మూవీ మధ్యలో ఉండగానే వెంకీ అట్లూరి పెళ్ళికి సిద్ధం కావడం ఆసక్తి రేపుతోంది. పూజ అనే అమ్మాయి మెడలో వెంకీ అట్లూరి తాళి కట్టనున్నారు. వెంకీ-పూజాల నిశ్చితార్థం నిరాడంబరంగా అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది.వెంకీ నిశ్చితార్థం గురించి ఎవరికీ తెలియదు. కొద్ది మంది పరిశ్రమ ప్రముఖులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. సార్ మూవీ విడుదల తర్వాత వివాహం జరిగే అవకాశం కలదంటున్నారు. తన నిశ్చితార్థం ఫోటోలు వెంకీ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేశారు. ఆ విధంగా విషయం బయటకు వచ్చింది.