
Dharmapuri Election Controversy: ఓటంటే ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధం. ఆ హక్కు ద్వారా ప్రజలు తమకు నచ్చిన వారిని ఎన్నుకోవచ్చు. కానీ అలాంటి విశేషమైన హక్కును ఎలక్షన్ కమిషన్ నగుబాటుకు గురి చేసింది. అప్పట్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు వేలాది మంది ఓట్లు గల్లంతయ్యాయి. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది ఓట్లు కనుమరుగైపోయాయి. దీనిపై ఎలక్షన్ కమిషన్ సారీ చెప్పి ముగించింది. ఇవాల్టికి దొంగ ఓట్ల ఏరివేతకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ వద్ద ఒక నిర్దిష్టమైన యంత్రాంగం అంటూ లేదు. బతికున్న వారి ఓట్లను తొలగించడం ఎలక్షన్ కమిషన్ పనితీరుకు పరాకాష్ట . అక్కడి దాకా ఎందుకు 2018 ఎన్నికల్లో చాలామంది ఓట్లు గల్లంతయ్యాయి. ఎక్కడి నుంచో వచ్చి ఓటు వేద్దామని అనుకుంటే.. తీరా జాబితాలో పేరు లేకపోవడంతో ఉసురుమంటూ వెనుదిరిగిన వారు ఎందరో. కొందరు కోర్టులకు కూడా వెళ్లారు. ప్రతిపక్ష నాయకులు విమర్శలు కూడా చేశారు. అయినా ఏం ఉపయోగం?
టిఎన్ శేషన్ హయాంలో ఎలక్షన్ కమిషన్ నిక్కచ్చిగా పనిచేసేది. ఎన్నికల జాబితా నుంచి ఓటర్ల సవరణ వరకు ప్రతిదీ కూడా పకడ్బందీగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టెక్నాలజీ పెరిగినప్పటికీ దానిని సరైన స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకోలేకపోతోంది. ఫలితంగానే చాలా మంది ఓటర్లు తమ హక్కును కోల్పోతున్నారు. మరోవైపు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఓటర్ల జాబితా నిర్ధారించే క్రమంలో కింది స్థాయిలో విచారణ నిర్వహించకుండానే ఓటర్లను తొలగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ తరహా విధానం జరగడంతో చాలామంది ఓటు వేసే హక్కును కోల్పోయారు.
ఇక తాజాగా ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూముల తాళం చెవులు మాయమయ్యాయి. అధికారులు తాళాలను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించగా కాంగ్రెస్ అభ్యర్థి అట్లూరి లక్ష్మణ్ కుమార్ అభ్యంతరం తెలిపారు. వాస్తవానికి అధికారులు ఈవీఎంలను సుమారు నాలుగు ఏళ్ల క్రితం జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి శివారులో ఉన్న వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో మూడు గదుల్లో భద్రపరిచారు. గత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికారులు అవకతవకలకు పాల్పడ్డారంటూ లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. అధికారులు అక్రమంగా వ్యవహరించడం వల్ల తాను స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయానని, రాష్ట్ర సమితి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలిచారని లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.

అయితే ఈ పిటిషన్ విచారణలో భాగంగా హైకోర్టు ఇటీవల ఈవీఎం ల లెక్కింపులకు సంబంధించిన 17 సీ_ పత్రాలు, వీడియో, సీసీ కెమెరా ఫుటేజీలను సమర్పించాలని అధికారులను ఆదేశించింది. దీంతో ఎన్నికల అభ్యర్థులకు నోటీసులు అందించిన అధికారులు.. కలెక్టర్ యాస్మిన్ భాషా పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూముల తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. మూడు స్ట్రాంగ్ రూములలో ఈవీఎంలు భద్రపరచగా.. రెండు గదుల తాళం చెవులు కనిపించలేదు. తాళాలు పగలగొట్టేందుకు అధికారులు ప్రయత్నించగా లక్ష్మణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాళం చెవులు కనిపించకపోవడం వెనుక మంత్రి కొప్పుల ఈశ్వర్ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. దీంతో తలుపులు తెరవకుండానే అధికారులు వెనుతిరిగారు. తాళం చేయి ఉన్న గది తలుపులు తెరిచినా ఎలాంటి పత్రాలు సేకరించలేదు. ఆ గదికి తాళం వేసి, సీల్ వేశారు. ఇదే విషయాన్ని కోర్టుకు నివదిస్తామని కలెక్టర్ ప్రకటించారు.
ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో ఈవీఎంలు భద్రపరిచిన గదుల పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఈవీఎంలను అత్యంత దుర్భేద్యమైన ప్రాంతాల్లో భద్రపరచాలి. ఆ గదుల్లో రక్షణ చర్యలు పాటించాలి. కానీ వాటిని ఎలక్షన్ కమిషన్ గాలికి వదిలేసింది. కేవలం ఎన్నికలు నిర్వహించామా, తర్వాత గాలికి వదిలేసామా అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ వ్యవహారం సాగుతోంది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఎలక్షన్ కమిషన్ తన తీరు మార్చుకోవడం లేదు. చివరికి గత ఏడాది జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఎలక్షన్ కమిషన్ చేష్టలుడిగి చూసింది. చాలామంది పట్టభద్రులు ఓటు హక్కు కోల్పోయినప్పటికీ, డిగ్రీ పట్టా లేని వారు ఓట్లు వేస్తే కళ్ళప్పగించి చూసింది. దీనిపై కొంతమంది ఫిర్యాదు చేసినా వచ్చే ఎన్నికల్లో చూసుకుందామని చెప్పిన ఎలక్షన్ కమిషన్.. తర్వాత నిశ్శబ్దాన్ని ఆశ్రయించింది.