
Bhaskar Reddy Arrest: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ తుది దశకు చేరుకుంటోంది. ఈ కేసులో ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు రిమాండ్ కు తరలించారు. భాస్కర్ రెడ్డి అరెస్టు అనంతరం కడపలో చోటు చేసుకున్న పరిణామాలపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినప్పుడు వైసీపీ శ్రేణులు నిరసన తెలియజేయడం ఏంటి..? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారులు జోరు పెంచారు. విచారణ అధికారులను మార్చిన తర్వాత ఈ కేసు ఎటు వెళుతుందో అన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తమయ్యాయి. అయితే, ఇది వరకు బృందం సాగించినట్లుగానే కొత్తగా చేరిన విచారణ బృందం కూడా ఈ కేసును విచారిస్తోంది. కేసులో కీలకంగా ఉన్నారని భావిస్తున్న అవినాష్ రెడ్డి, అయన తండ్రి భాస్కర్ రెడ్డి కేంద్రంగా ఉచ్చు బిగిసుకుంటోంది. కీలక ఆధారాలు సేకరించిన అనంతరం అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ముందు నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్న అవినాష్ రెడ్డి తరువాత లక్ష్యం అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఆనందం వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడం పట్ల ప్రజల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టిడిపి నాయకుల అరెస్టు సమయంలో చెప్పిన మాటలు ఏమిటి..?
పలు కేసులు సందర్భంగా రాష్ట్రంలో టిడిపి నాయకులను ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు అయినప్పుడు తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చేస్తే.. వైసీపీ శ్రేణులు దానికి ధీటుగా కౌంటర్ ఇచ్చాయి. ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేస్తే దానికి టిడిపి శ్రేణులు ఆందోళన చేయాల్సిన అవసరం ఏమిటని, న్యాయపరంగా కోర్టులో తేల్చుకోవాలని వైసిపి శ్రేణులు, నాయకులు నాడు గట్టిగా చెప్పారు. ఇప్పుడు అదే వైసిపి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అనంతరం నిరసనలు చేపట్టడం అనేక విమర్శలకు కారణం అవుతోంది. ఈ తరహా నిరసనలు చేపట్టడం ద్వారా ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
సింపితీ ప్రయత్నాలు విజయవంతం అయ్యేనా..?
భాస్కర్ రెడ్డి అరెస్ట్ అనంతరం వైసీపీ శ్రేణులు కడప, పులివెందులలో నిరసనలు తెలియజేయడం వెనక.. ప్రజల్లో సింపతి పొందాలన్నా భావన ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఈ తరహా కార్యక్రమాలతో సింపతి ఎలా వస్తుందన్నది సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి వైసీపీ నాయకులు, భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు కొద్ది రోజులుగా సునీత, ఆమె భర్త కేంద్రంగా విమర్శలు చేస్తూ వచ్చారు. సునీత భర్త హత్య చేయించాడు అంటే కొంతవరకు సబబుగానే ఉండేది.. కానీ సునీత చేయించిందని చేసిన విమర్శలు వైసీపీకి భూమ్ రాంగ్ అయ్యాయి. సునీత పై చేసిన విమర్శలతో ప్రజల్లో వైసిపి పట్ల కొంత వ్యతిరేకత అక్కడ వ్యక్తమైంది. ఇది అర్థం చేసుకోకుండా మరింత ముందుకు ఆందోళన చేస్తూ వెళ్లడం ద్వారా ప్రజల్లో వైసీపీ మరింత చులకన అయిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
జగన్ ను అరెస్టు చేసినప్పుడు కూడా ఇలానే..
అక్రమాస్తుల కేసులో గతంలో జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేసినప్పుడు కూడా శ్రేణులు ఇలానే ఆందోళన చేశాయి. అయితే, ఈ ఆందోళనలు ఏమీ కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఆపలేకపోయాయన్న విషయాన్ని ఇప్పుడు వైసీపీ శ్రేణులు గుర్తించకపోవడం గమనార్హం. జగన్మోహన్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ చేసిన కార్యక్రమాల వల్లే ఫలితం లేనప్పుడు.. భాస్కర్ రెడ్డి కోసం చేసే ఆందోళనల వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందని పలువురు చెబుతున్నారు. ఈ తరహా చర్యలు ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఒకంత చులకన భావనకు కారణమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

తరువాత పరిణామాలు ఎలా ఉండనున్నాయి..
వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు తరువాత ఈ కేసులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ కేసులో తర్వాత అరెస్టు ఎంపీ అవినాష్ రెడ్డిది కావచ్చు అని పలువురు పేర్కొంటున్నారు. తండ్రి అరెస్టు అనంతరం మీడియాతో మాట్లాడిన అవినాష్ రెడ్డి.. న్యాయపరంగా తమ పోరాటాన్ని సాగించి ఈ కేసులో నిర్దోషులుగా బయటపడతామని పేర్కొన్నారు. ఈ తరహా వ్యాఖ్యలు ఆయన అరెస్టుకు సంకేతంగానే భావించాల్సి ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వివేకానంద రెడ్డి హత్య కేసు తుది దశకు వస్తుండడంతో అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం కనిపిస్తోంది.