
YCP- TDP: రాష్ట్రంలో అధికార వైసిపికి షాక్ మీద షాక్ తగులుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వైసిపికి మరో ఓటమి ఎదురయింది. వరుస ఓటములు ఆ పార్టీ అగ్ర నాయకులను ఆలోచనకు గురి చేస్తుండగా, కేడర్ లో ఆందోళనకు కారణం అవుతుంది.
రాష్ట్రంలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో వైసీపీకి రాష్ట్రంలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వరుస షాక్ లు తప్పడం లేదు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు స్థానాలని టిడిపికి కోల్పోయిన వైసీపీ తాజాగా మరో ఓటమి ఎదురైంది. పట్టబద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఓడిన వైసిపి ఈసారి అమరావతి ప్రాంతంలో ఓటమిపాలైంది.
గుంటూరు బార్ అసోసియేషన్ లో టిడిపి అభ్యర్థి విజయం..
గుంటూరు బార్ అసోసియేషన్ కు తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో వైసీపీకి ఓటమి ఎదురైంది. వైసిపి నిలబెట్టిన అభ్యర్థి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాసు వెంకటరెడ్డి పై టిడిపి అభ్యర్థి విజయం సాధించారు. గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరు పార్టీలు రెగ్యులర్ ఎన్నికల తరహాలో మోహరించాయి. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే వైసిపి అభ్యర్థి కాసు వెంకటరెడ్డిని టిడిపి లీగల్ సెల్ సెక్రెటరీ కూడా అయినా కెవికే సురేష్ ఓడించారు. గుంటూరు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా దాసరి ఉమ గెలుపొందారు.
సీఎం జగన్ భేటీకి ముందు..
రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై పార్టీలో సమీక్షించేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండి ఎమ్మెల్యేలతో కీలక భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతుంది. కేబినెట్ మార్పుతో పాటు ముందస్తు ఎన్నికల పైన జగన్ సంకేతాలు ఇస్తారని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలను వైసీపీ కోల్పోవడం ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బగా పరిగణిస్తున్నారు. గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన టిడిపి అభ్యర్థికి లీగల్ శుభాకాంక్షలు తెలియజేసింది.
వరుస ఓటములతో అంతర్మధనం..
వైసిపి బాహాటంగా చెప్పలేకపోయినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ గానే భావించాలి. పార్టీ సింబల్ తో ఎన్నికలు జరగలేదని, తమ ఓటు బ్యాంకు వేరే ఉందని వైసిపి నాయకులు బయటకు గట్టిగా మాట్లాడుతున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం ఒకంత ఒత్తిడికి గురవుతున్నారు. 2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తూ వస్తున్న వైసిపికి వరుస ఓటములు మింగుడు పడడం లేదు. ఈ ఓటమికి గల కారణాలపై విశ్లేషించుకునేందుకు పార్టీ అగ్ర నాయకత్వం సిద్ధమవుతోంది.

జోష్ లో ప్రతిపక్షాలు..
రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో వైసిపి విజయం సాధిస్తూ రావడంతో గత కొన్నాళ్లుగా ప్రతిపక్షాలు నైరాస్యంలో కూరుకుపోయాయి. వైసీపీని ఓడించడం సాధ్యం కాకపోవచ్చు అన్న భావనలోకి వెళ్లిపోయాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కసారిగా ప్రతిపక్షాలకి వేయి ఏనుగుల బలం వచ్చినట్టు అయింది. వైసిపి పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదన్న విషయం ప్రతిపక్షాలకు అర్థమైంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలన్నీ కూటమిగా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకపక్క ప్రతిపక్షాల ఐక్యత, మరోపక్క ఓటమి తెచ్చిన నైరాశ్యంతో అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయం ఉందన్న తరుణంలో జరిగిన ఎన్నికల్లో విజయంతో టీడీపీ, ప్రతిపక్షాలు ఉత్సాహంతో అడుగులు వేస్తుంటే, వైసీపీని నైరాస్యం అలుముకొని ఒకింత ఆందోళనతో ఎన్నికలకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార వైసీపీకి ఎదురవుతున్న వరుసవాటంలో వచ్చే ఎన్నికల్లో అధికార మార్పిడికి సంకేతం గానే భావించాల్సి వస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా 2019 తర్వాత వైసీపీలో కనిపించిన జోరు క్రమంగా తగ్గుతోందని, అది వైసీపికి ఓటమికి సూచనగానే భావించాల్సి ఉంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు.