
BJP Sathya Kumar: ఏపీలో ఎల్లో మీడియా తీరే వేరు. తన ప్రసారాలకు, కథనాలకు, వార్తలకు పరామార్ధం ఒక్కటే. అదే తెలుగుదేశం విశాల ప్రయోజనాలు. వాటి కోసం ఈ మీడియా ఎంతకైనా తెగిస్తుంది. ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై దాడి అంటూ పతాక శీర్షికన కథనాలు, వార్తలు రాయడం వెనుక కూడా టీడీపీ ప్రయోజనం దాగి ఉందన్న వార్తలు వస్తున్నాయి. బీజేపీ కంటే సత్యకుమార్ ఏమైనా తోపా అని నెటిజన్లు కామెంట్ చేసే పరిస్థితి వచ్చింది. రాజధాని ప్రాంతంలో బీజేపీ నేతలకు, మూడు రాజధానుల మద్దతుదారులైన వైసీపీ శ్రేణుల మధ్య గొడవ జరిగింది. సత్యకుమార్ వాహనంపై వైసీపీ శ్రేణులు దాడులు చేశాయి. కారు అద్దాలు పగిలిపోయాయి. సత్యకుమార్ పై దాడి అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పతాక శీర్షికన కథనాలు రాయడం నిజమైన బీజేపీ నేతలను కలవరపరుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడి సోము వీర్రాజు పేరును కూడా రాయడానికి ఇష్టపడని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా సత్యకుమార్ కు ప్రాధాన్యత ఇవ్వడాన్ని బీజేపీ హార్ట్ కోర్ ఫ్యాన్స్ నిశితంగా గమనిస్తున్నారు.
పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి..
కడపలోని ప్రొద్దుటూరుకు చెందిన సత్యకుమార్ బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి జాతీయ కార్యదర్శి పదవి సొంతం చేసుకున్నారు. ఆయన సొంత అజెండాతో ముందుకెళతారన్న అపవాదు ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో టీడీపీ, జాతీయ స్థాయిలో బీజేపీ అన్నట్టు వ్యవహరిస్తారన్న ప్రచారం ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ కలిసి నడవాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారని బీజేపీలోనే ఒక టాక్ ఉంది. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడడంలో ముందుండే ఈ కాషాయ నాయకుడికి ఎల్లో మీడియా ఎనలేని ప్రాధాన్యత ఇస్తుంది. ఎడిటోరియల్ పేజీలో ఒక కాలంనే కేటాయిస్తోంది. అటువంటి నాయకుడిపై దాడి జరిగిందంటూ ప్రాధాన్యతాంశంగా తీర్చుకొని బ్యానర్ కథనాలు రాయడం, హైప్ చేయడం వెనుక పెద్ద స్కెచ్ నడిచినట్టు తెలుస్తోంది. పోనీ ఇలాగైనా వైసీపీ బీజేపీ ఆగ్రహానికి గురవుతుందని చిన్న ఆశ. టీడీపీకి దగ్గర చేస్తామన్న ప్రయత్నంలోనే బీజేపీ కంటే సత్యకుమార్ కు ఎల్లో మీడియా ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందన్న టాక్ ఇప్పుడు తెలుగునాట ఊపందుకుంది.
బీజేపీ నాయకులను ఒకేలా చూడరు…
వాస్తవానికి ఎల్లోమీడియా ప్రాధాన్యతలు మారుతుంటాయి. టీడీపీకి, చంద్రబాబుకు పనికి వస్తారన్న నాయకులకే హైప్ చేస్తారు. ప్రచారం కల్పిస్తారు. బీజేపీ నాయకులందర్నీ ఒకే తాటిపై చూడరు. వీకెండ్ కామెంట్స్ జర్నలిస్టు పత్రిక అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు పేరును ఉచ్చరించేందుకు కూడా ఇష్టపడదు. ఒక సెక్షన్ బీజేపీ నాయకులు ఈ మీడియాకు కనిపించరు కూడా. ఈ విషయంపై చాలాసార్లు రాష్ట్ర బీజేపీ నాయకులు హైకమాండ్ కు ఫిర్యాదుచేశారు కూడా. కేవలం టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేసే బీజేపీ నేతలను తమ వాళ్లగా భావిస్తూ, వైసీపీని హెచ్చరించడానికి ప్రయోగిస్తుంటారనే చర్చ నడుస్తోంది. సత్యకుమార్‌పై వైసీపీ దాడి చేసిందనే ప్రచారాన్ని ఉధృతంగా సాగించి, కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసే వ్యూహంలో భాగంగానే ఈ ఘటనను వాడుకునే ప్రయత్నం ఎంత వరకు సత్ఫలితాలు ఇస్తుందో చూడాలి.

కాషాయదళంలో ఆవేదనలు ఎన్నో..
సత్యకుమార్ కంటే ముందు చాలా మంది బీజేపీ నాయకులపై వైసీపీ శ్రేణులు దాడిచేశాయి. చాలా మంది బాధితులుగా మిగిలారు కూడా. వారి విషయంలో పట్టించుకోని ఎల్లో మీడియా సత్యకుమార్ విషయంలో చాలా తొందరగా స్పందించింది. టీడీపీపై దాడి అన్న రేంజ్ లో రియాక్టయ్యింది. అయితే ఒక్క విషయంలో మాత్రం స్పష్టత వచ్చింది. బీజేపీ వ్యవహారాలను బయటకు, ముఖ్యంగా ఎల్లో మీడియాకు తెలుస్తోంది సత్యకుమార్ ద్వారానే అని బీజేపీ శ్రేణులకు నిర్థారణ అయ్యింది. బీజేపీలో చిన్నపాటి విభేదాలు, పరిణామాలు జరిగినా ఎల్లో మీడియా కథనాలు వెనుక సొంత నేతల హస్తం ఉండడంత కాషాయదళానికి మింగుడుపడడం లేదు. ఏపీలో బీజేపీని బలోపేతానికి కృషిచేయకుండా.. టీడీపీ, వైసీపీ ప్రయోజనాలకు పెద్దపీట వేసే నాయకులు ఉన్నంతవరకూ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించవు అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో పవర్ లో ఉన్నా ఏపీలో ఉనికి చాటుకునేందుకు సైతం ఇబ్బందిపడుతుండడానినికి ఇటువంటి నాయకులే కారణం అన్న బాధ సగటు బీజేపీ కార్యకర్తలో నెలకొని ఉంది.