Sivalenka Krishna Prasad: ప్రియాంక చోప్రా నుంచి మంచు లక్ష్మి దాకా ఇప్పుడు అంతా సరోగసి విధానంలోనే పిల్లల్ని కన్నారు.. కాదు కాదు అద్దె గర్భం ద్వారా అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఒక దశాబ్దం క్రితం వరకు మనదేశంలో సరోగసి అంటే అంతగా తెలియదు. కానీ కాలక్రమేణా ఇప్పుడు వందల కోట్ల వ్యాపారంగా మారిపోయింది. ఇక ఈ అద్దె గర్భం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి? సరోగసి పేరుతో సమాజంలో జరుగుతున్న దారుణాలు ఏ విధంగా ఉన్నాయి? వీటిపై శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా రూపొందిన చిత్రం యశోద. ఈ సినిమాలో సమంత టైటిల్ పాత్రలో నటించింది. నవంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు మీకోసం.

సమంత నా పెద్ద కుమార్తె
యశోద సినిమాలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్యనే చూపించారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా దీనిని విడుదల చేస్తున్నారు. ఈ కథ అనుకున్నప్పటి నుంచి టైటిల్ రోల్ కు సమంత సరిపోతుందని భావించారు. గత ఏడాది ఆమెకు కథ చెప్పారు.. కథ విన్న 45 నిమిషాల్లోనే ఆమె పచ్చ జెండా ఊపారు. సినిమా చేసేందుకు అంగీకరించారు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి బాధ్యత ఆమె తీసుకున్నారు. దీంతో ఈ చిత్ర నిర్మాత కృష్ణ ప్రసాద్ ఆమెను తన పెద్ద కూతురుగా అభివర్ణించారు.
కొత్త కాన్సెప్ట్
కృష్ణ ప్రసాద్ గతంలో ఆదిత్య 369 సినిమా నిర్మించారు. ఈ సినిమాకి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. బాలకృష్ణ హీరోగా నటించారు. అప్పట్లో ఇది సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆదిత్య 369 కథ విన్నప్పుడు ఎంత ఉత్సాహానికి గురయ్యానో.. యశోద సినిమా కథ విన్నప్పుడు కూడా అంతే అనుభూతిని పొందానని ఈ చిత్రం నిర్మాత కృష్ణ ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో సమంత ఎంతో అద్భుతంగా నటించిందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ సినిమా విషయంలో పూర్తి నమ్మకంతో ఉన్నానని, మంచి సినిమా తీశానన్న సంతృప్తి ఉందని ప్రసాద్ పేర్కొన్నారు. ఇక ఇటీవల సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి బాగుందని మెచ్చుకున్నారు. నేపథ్యం కొత్తగా ఉందని నిర్మాతను ప్రశంసించారు.
బెడ్ పై పడుకునే
ఇక సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నది. దానికి చికిత్స కూడా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో యశోద డబ్బింగ్ సమయంలో అనారోగ్యానికి గురైంది. ఈ విషయం కూడా అప్పుడే ఈ చిత్ర నిర్మాతకు తెలిసింది. అయినప్పటికీ తెలుగు, తమిళంలో తన పాత్రకు ఆమే డబ్బింగ్ చెప్పింది. తమిళంలో డబ్బింగ్ చెబుతున్న సమయంలో సమంత పూర్తిగా నీరసించి పోయింది. డాక్టర్ పర్యవేక్షణలో సెలైన్ పెట్టుకొని డబ్బింగ్ చెప్పింది. హిందీ వెర్షన్ కి గాయని చిన్మయితో డబ్బింగ్ చెప్పించారు.

బడ్జెట్ పెరిగింది
ఈ సినిమాను మొదట్లో మూడు కోట్ల బడ్జెట్ తో తీయాలి అనుకున్నారు. కాకపోతే కథ డిమాండ్ చేయడం వల్ల బడ్జెట్ పెరిగింది. ఈ సినిమా కోసం నానక్ రామ్ గూడలో రెండు భారీ సెట్లు వేశారు. అందులో దాదాపు 55 రోజులపాటు షూటింగ్ చేశారు. సుమారు 180 మంది మహిళలు ఈ సినిమా కోసం పని చేశారు. ఇక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా బాలకృష్ణ హీరోగా అప్పట్లో ఆదిత్య 369 ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. సైన్స్ ఫిక్షన్ కేటగిరిలో అది ఒక కొత్త ఒరవడి సృష్టించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నట్టు బాలకృష్ణ ప్రకటించారు. దానికి “ఆదిత్య 999 మ్యాక్స్” అని టైటిల్ కూడా ఖరారు చేశారు. అయితే ఈ సినిమా ప్రకటన పట్ల కృష్ణ ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు.. కానీ ఆ సినిమాకు పెట్టేంత బడ్జెట్ తన వద్ద లేదని తేల్చి చెప్పేశారు..