
Amul Controversy On Karnataka: మరికొద్ది రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, జెడిఎస్ పీఠం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటకలో “అమూల్” రూపంలో మరో వివాదం తెరపైకి వచ్చింది.. దీని ఆధారంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ, జెడిఎస్ విమర్శల దాడిని ప్రారంభించాయి. దీంతో అక్కడి భారతీయ జనతా పార్టీ ఆత్మ రక్షణలో పడింది.
వాస్తవానికి కర్ణాటక రాష్ట్రంలో అక్కడి “కర్ణాటక మిల్క్ యూనియన్” నందిని బ్రాండ్ పేరుతో పాలు విక్రయిస్తోంది.. దీనిమీద ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక, కోస్తా కర్ణాటకలో లక్షలాది మంది రైతులు దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు.. అయితే ఇంతవరకు బాగానే ఉంది.. ఈ క్రమంలోనే రాష్ట్రంలో గుజరాత్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే అమూల్ బ్రాండ్ ను కర్ణాటక రాష్ట్రంలో ప్రవేశపెడతామని ఆమధ్య కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. నందిని బ్రాండ్, అమూల్ బ్రాండ్ కలిసి పనిచేయాల్సి ఉంటుందని వెల్లడించారు. దీంతో ఈ ప్రతిపాదనను అక్కడి రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.. గుజరాత్ బ్రాండ్ ను కర్ణాటక రాష్ట్రం మీద బలవంతంగా రుద్దొద్దని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికార బిజెపికి వ్యతిరేకంగా ఈ నినాదం చేస్తున్నాయి. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో కూడా అమూల్ కు వ్యతిరేకంగా పోస్టులు కొనసాగుతున్నాయి. అధికార బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ ఏకంగా క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తున్నాయి. దీంతో బసవరాజ్ సర్కార్ కు కొత్త తలనొప్పి మొదలైంది. నష్ట నివారణ చర్యల కోసం ఆయన అమూల్ కర్ణాటక ప్రవేశం చేయదని స్పష్టం చేశారు. ఎనప్పటికి గొడవలు సద్దుమణగడం లేదు.
ఇక ఇటీవల పెరుగు ప్యాకెట్ల పై కర్డ్ కు బదులు దహీ అని ముద్రించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఇది బలవంతంగా హిందీని దక్షిణాదిపై రాష్ట్రాలపై రుద్దడమే అని తమిళ నాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అభిప్రాయపడ్డారు. అతని వాదనను మిగతావారు సమర్ధించడంతో అది రాజకీయ రంగు పులుముకుంది. మరోవైపు కర్ణాటకలో నందిని బ్రాండ్ ను నాశనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య ఆరోపించారు. దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేశారు. అమూల్ కోసమే కావాలనే పాల ఉత్పత్తి సేకరణను తగ్గించారని ఆయన ఆరోపించారు.. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలకు ముందు రాజకీయ రగడ మొదలైంది. ఈ వివాదం అధికార భారతీయ జనతా పార్టీకి నష్టం చేకూర్చుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు అమూల్ ఏర్పాటును స్వాగతించాయి. ఆ ప్లాంట్ కోసం ప్రత్యేకంగా భూములు కూడా కేటాయించాయి. రైతులు ఎటువంటి గొడవలు చేయడం లేదు. కానీ ఎన్నికలు ఉన్న నేపథ్యం, అమూల్ గుజరాత్ రాష్ట్రానికి చెందినది కావడంతో కాంగ్రెస్, జెడిఎస్ రాజకీయ రగడ సృష్టిస్తున్నాయని బిజెపి ఆరోపిస్తోంది.. ప్రతిపక్ష పార్టీల ఎత్తులను తుత్తునీయలు చేస్తామని బసవరాజ్ సర్కార్ ప్రకటిస్తోంది.