
Central Intelligence Survey: ఏపీ విషయంలో అసలు బీజేపీ ప్లాన్ ఏమిటి? అన్నది తెలియడం లేదు. ఆ పార్టీకి ఒక ఎంపీ లేరు..ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదు. అయినా సరే ఏపీ తన ఖాతాలో ఉందన్నది బీజేపీ ఫిలింగ్. ప్రస్తుతానికి ఇక్కడ అధికార, విపక్షాలుగా వైసీపీ, టీడీపీ ఉన్నా..భవిష్యత్ లో అధికారం చేజిక్కించుకుంటామన్న ధీమా బీజేపీలో బలంగా ఉంది. అయితే ఇది ఎలా సాధ్యం అన్నది సామాన్యుడికి అంతుచిక్కని ప్రశ్నగా మిగులుతోంది. కానీ అదే సమయంలో టీడీపీ వైపు వెళ్లాలా? వైసీపీ వైపు వెళ్లాలా అన్నది బీజేపీకి కూడా అంతుపట్టడం లేదు. ఎటూ తేల్చుకోలేకపోతోంది. భవిష్యత్ లో అధికారం వైపు అడుగులేస్తామన్న నమ్మకంతో ఉన్న ఆ పార్టీకి ఆ రెండు పార్టీల్లో ఏదో ఒక వైపు వెళ్లే పరిస్థితి మాత్రం అనివార్యం. అందుకే బీజేపీ ఆలోచనలో పడింది. పవన్ పొత్తు ప్రతిపాదనకు అందుకే స్పష్టత ఇవ్వలేకపోతోంది.
ఆ సమీకరణలతో మల్లగుల్లాలు..
ప్రస్తుతానికైతే బీజేపీ ఏపీ రాజకీయాలను శాసిస్తోంది. కానీ ఓట్లు, సీట్లు మాత్రం పెంచుకోలేకపోతోంది.అందుకే అంతర్మథనం చెందుతోంది. వాస్తవానికి బీజేపీ పెద్దలకు జగన్ పై అంత ప్రేమా లేదు.. చంద్రబాబు అంటే ద్వేషం లేదు. అయితే జగన్ తో పోలిస్తే చంద్రబాబుతో జాతీయ స్థాయిలో భవిష్యత్ లో ముప్పు ఉంటుందని భయపడుతోంది. మూడు దశాబ్దాల కిందటే జాతీయ స్థాయిలో చంద్రబాబు చక్రం తిప్పడాన్ని గుర్తుచేసుకుంటోంది. బీజేపీని దూరం పెట్టి మరీ యునైటెడ్ ఫ్రంట్ కు సారధ్య బాధ్యతలు తీసుకున్న విషయాన్ని మరిచిపోవడం లేదు. ఆ సమయంలో అమిత్ షా ఎక్కడున్నారో తెలియదు. ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ సామాన్య సేవకుడిగా మాత్రమే కొనసాగారు.
చంద్రబాబు సీనియార్టీ అడ్డంకి…
అయితే టీడీపీతో బీజేపీ కలవడానికి చంద్రబాబు సీనియార్టీ అడ్డం వస్తోంది. ఆయన జాతీయ స్థాయిలో చూపిన ఫెర్ఫార్మెన్స్ ప్రతిబంధకంగా మారింది. చంద్రబాబు ఎన్టీఏ కన్వీనర్ గా ఉన్న సమయంలో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. నాటి గోద్రా అల్లర్లతో ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్న చంద్రబాబు మోదీని గుజరాత్ సీఎంగా తప్పించాలని వాజ్ పేయ్ ను కోరిన విషయం అందరికీ తెలిసిందే. 2014లో సంయక్తంగా అధికారంలోకి వచ్చి 2018లో విడిపోయినప్పుడు చంద్రబాబు వ్యతిరేక భావన చూపించారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. తిరుపతికి వచ్చిన అమిత్ షా రాళ్లదాడిని ఎదుర్కొన్నారు. అయితే రాజకీయాల్లో ఇవి సహజమే అయినా.. ఇటువంటి చర్యలను మోదీ, అమిత్ షా అంత వేగంగా మరిచిపోరని కాషాయదళం చెబుతోంది.
ఇష్టపడని బీజేపీ…
2024 ఎన్నికల్లో ఓట్లు, సీట్లుపరంగా ఏపీలో బలం చాటుకోవాలంటే టీడీపీతో పొత్తు ద్వారా సాధ్యమన్న విషయం హైకమాండ్ కు తెలుసు. తద్వారా చంద్రబాబు సీఎం అవుతారు. సీట్ల పరంగా కూడా బీజేపీ ఒక అడుగు ముందుకేయగలుగుతుంది. అయితే చంద్రబాబు సీఎం అయిన మరుక్షణం జాతీయ రాజకీయాల వైపు చూస్తారు అన్నది బీజేపీ అనుమానం. గడిచిన రెండు ఎన్నికలతో పోలీస్తే బీజేపీకి 50,60 స్థానాలు తగ్గుతాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి.నివేదికలు, సర్వేలు ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా బిహార్, కర్నాటకలో దెబ్బ ఖాయమన్న ప్రచారం ఉంది. అదే జరిగితే చంద్రబాబు చక్రం తప్పి నాన్ బీజేపీ కూటమికి ఆజ్యం పోస్తారన్నది బీజేపీ అనుమానం. అందుకే ఏపీలో సీట్లు, ఓట్లను ఆశిస్తే చంద్రబాబు నెత్తిన పాలుపోసినట్టవుతుందన్నది వారి వాదన. అందుకే మిత్రపక్షం జనసేన ఎంత ఒత్తడిచేస్తున్నా బీజేపీ నుంచి ఎటువంటి కదలిక రాకపోవడానికి ఇదే కారణంగా తెలుస్తోంది.

ఆసక్తిగా కేంద్ర ఇంటలిజెన్స్ రిపోర్టు…
మరోవైపు ఏపీ రాజకీయ పరిస్థితులపై కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు ఒకే సర్వేచేశాయట. అందులో వైసీపీకి ఇప్పుడున్న మెజార్టీ తగ్గినా అధికారంలోకి వస్తుందట. దీంతో బీజేపీ పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం బీజేపీకి సుతరామూ ఇష్టం లేదు.ఎందుకంటే చంద్రబాబు మళ్లీ పవర్ లోకి వస్తే కచ్చితంగా మరో పదేళ్ల పాటు కుదురుకుంటారని ఈసారి ఆయన వారసుడు కూడా రెడీగా ఉన్నందువల్ల ఏపీలో బీజేపీకి ఎలాంటి స్కోప్ ఉండదని భావిస్తున్నారుట. అదే వైసీపీ మరో అధికారంలోకి వస్తే 2029 నాటికి తెలుగుదేశం పూర్తిగా నిర్వీర్యం అయి బీజేపీకి పూర్తి సానుకూలత ఉంటుందని కూడా గట్టి నమ్మకంతో ఉన్నారట.అయితే తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న వైసీపీ సర్కారుకు కేంద్ర ఇంటలిజెన్స్ ఇచ్చిన సర్వే నివేదిక కాస్తా ఉపశమనం కలిగించే విషయం. కానీ బీజేపీ విషయంలో చివరి వరకూ వేచిచూసే ధోరణికే చంద్రబాబు మొగ్గుచూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరీ ఎన్నికల ముందు ఏం జరుగుతుందో?