Anant Ambani: ముకేశ్ అంబానీ.. మనదేశంలో అతిపెద్ద ధనవంతుడు. పెట్రోల్ నుంచి దుస్తుల దాకా ప్రతి రంగంలో వ్యాపారం సాగించే ఆగర్భ శ్రీమంతుడు. అలాంటి వ్యక్తి ఇంట్లో జరుగుతున్న వేడుకంటే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. పైగా అంబానీ తన ఇంట్లో జరిగే ఏ వేడుకనైనా ఆకాశాన్ని తాకే విధంగా నిర్వహిస్తాడు. ప్రస్తుతం ముఖేష్ అంబానీ ఇంట్లో జరుగుతున్న “లగన్ లఖ్ నవూ” వేడుక సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ వేడుక ఏమిటి? అంబానీ ఇంట్లో ఎందుకు నిర్వహిస్తున్నారు? ఈ కథనంలో తెలుసుకుందాం.
ముకేశ్ అంబానీ రెండో కొడుకు అనంత్ అంబానీ సుపరిచితమే. భారీ కాయంతో ఉండే ఇతడు గతంలో బరువు తగ్గాడు. మళ్లీ ఇటీవల పెరిగాడు. అనంత్ కొంతకాలంగా రాధిక మర్చంట్ అనే యువతితో ప్రేమలో ఉన్నాడు. అప్పట్లో వీరికి సంబంధించి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే వీరిద్దరి పెళ్లికి అంబానీ కుటుంబం రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు తాజాగా జరిపిన వేడుక దానికి సంకేతాలు ఇచ్చింది. వీరి పెళ్లిలో భాగంగా తొలి వేడుకను అంబానీ కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ” లగన్ లఖ్ వనూ” పేరుతో ఈ సంబరాన్ని నిర్వహించారు.
అంబానీ ఇంట్లో వేడుకంటే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అతిరథ మహారధులు ఆ వేడుకకు హాజరవుతారు. మీడియా దృష్టి మొత్తం దాని మీదే ఉంటుంది.. ” లగన్ లఖ్ వనూ” పేరుతో అంబానీ కుటుంబం నిర్వహించిన వేడుకలో ఆయనకు కాబోయే కోడలు రాధికా మర్చంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సందర్భానికి అనుగుణంగా రెడీ అవ్వడం రాధికకు ఎప్పటినుంచో ఉన్న అలవాటు. పైగా తన ఇంట్లో జరిగే వేడుకలకు ఆమె అందంగా ముస్తాబవుతుంది.
” లగన్ లఖ్ వనూ” వేడుకలో రాధిక సంప్రదాయ దుస్తులు దర్శనమిచ్చింది. ఇందుకోసం ప్రముఖ డిజైనర్ అనామిక ఖన్నా రూపొందించిన భారీ ఎంబ్రాయిడరీ పేస్టల్ బ్లూ లెహంగా ధరించింది. దీనిని ఫ్లోరల్ ఆప్టిక్ డిజైన్ తో రూపొందించారు. దానికి తగ్గట్టుగానే బ్లౌజ్, దుపట్టాను రాధిక ధరించింది. వజ్రాలతో పొదిగిన నగలను ధరించింది. వదులైన హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్ తో రాధిక ఆకట్టుకుంది.
” లగన్ లఖ్ వనూ” అంటే..
వివాహం సందర్భంగా మన ఇంట్లో లగ్నపత్రిక ఎలా అయితే రాసుకుంటామో.. గుజరాతి సంప్రదాయంలో ” లగన్ లఖ్ వనూ”పేరుతో పెళ్లి వేడుకలు మొదలుపెడతారు. దీనిని వారు కంకోత్రి అనే పేరుతోనూ పిలుస్తారు. వధూవరుల తీరు కుటుంబ సభ్యులు, బంధువులు, పూజారి సమక్షంలో పెళ్లి తేదీ, ముహూర్తం నిర్ణయించుకుంటారు. లగ్న పత్రిక రాసి దేవుడి సమక్షంలో ఉంచుతారు. తద్వారా కాబోయే జంటకు భగవంతుడి ఆశీస్సులు అందించమని కోరుతారు. వివాహానికి నెల రోజుల ముందు ఈ వేడుక నిర్వహిస్తారు. ఇలా రాధిక మర్చంట్, అనంత్ అంబానీ కుటుంబ సభ్యులు ఈ వేడుక నిర్వహించారు. ఇందులో భాగంగా పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయించారు.
ఇక గత ఏడాది అనంత్_ రాధిక వివాహ నిశ్చితార్థం జరిగింది. గోల్ ధానా పేరుతో అంబానీ నివాసమైన యాంటీలియాలో ఈ వేడుకలు నిర్వహించారు. అప్పటి వేడుకలను అనంత్, రాధిక సంప్రదాయ దుస్తులను మెరిసిపోయారు..గోల్ ధానా లో ధనియాలు, తయారుచేసిన వంటకాలను వధూవరుల కుటుంబాలు ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటాయి. అత్తింటి వారు కాబోయే కోడలికి బహుమతులు ఇస్తారు. వరుడు ఇంట్లో జరిగే ఈ వేడుకలో కొత్తజంట దండలు, ఉంగరాలు మార్చుకొని వివాహ వేడుకలో వేస్తుంది. చివర్లో ఇరు కుటుంబాలకు సంబంధించిన ఐదుగురు ముత్తైదువులు కాబోయే జంటను ఆశీర్వదిస్తారు. అనంతరం విందు భోజనం చేసి వేడుకను ముగిస్తారు. ” లగన్ లఖ్ వనూ” వేడుకలోనూ అంబానీ కుటుంబ సభ్యులు ఉత్సాహంగా గడిపారు. అతికొద్దిమంది అతిధుల సమక్షంలో ఈ వేడుకను జరిపారు.