Jagan Delhi Tour: మావాడు అడిగితే ఏం చెప్పకు అని హీరో అంటాడు.. ఆడేంటి అడుగుతాడు…వీడేంటి చెప్పొందంటున్నాడు అంటూ స్నేహితుడు నిట్టూరుస్తాడు.. ఆ మధ్యన మహేష్ బాబు, వెంకటేష్ నటించిన సితమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీన్ అది. ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీతో పాటు ఢిల్లీ పెద్దలు కలిసినప్పుడు ఇటువంటి సీనే రిపీట్ అవుతుంటుంది. అవతల వాళ్లు ఏ మూడ్ లో ఉన్నా.. కొద్దిసేపు ముచ్చటించినా.. రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ చర్చించినట్టు చెబుతారు. విభజన సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినట్టు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. గత మూడున్నరేళ్లుగా ఇదే తంతు కొనసాగుతూ వస్తోంది. సీఎం జగన్ బుధవారం ప్రధాని మోదీని కలిశారు. ఇలా కలిసే సమయంలోనే ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ అస్వస్థతకు గురయ్యారని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో మోదీ ఏ మూడ్ లో ఉన్నారో తెలియదు కానీ.. సుమారు అరగంట పాటు సీఎం జగన్ తో సమావేశమయ్యారని.. విన్నపాలన్నీ విన్నారని, సానుకూలంగా స్పందించారని సీఎం జగన్ తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు.

ప్రధానితో భేటీ అనంతరం గత మూడున్నరేళ్లుగా ఒకే ఫార్మెట్ లో ఇస్తున్న ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. కానీ స్వల్ప మార్పులు చేశారండోయ్. ప్రత్యేక హోదా, పోలవరం.. ఇలా అన్నీ అడిగేసినట్టు రాసుకొచ్చారు. గత మూడేళ్లుగా ఇవే అడుగుతున్నట్టు చెప్పినా.. కేంద్ర ప్రభుత్వం దయతలచలేదు. ఇప్పుడు కూడా ఏది ఇస్తుందో కూడా స్పష్టత లేదు. అసలు లోపల ఏం జరిగిందో.. ఎటువంటి చర్చలు జరిగాయో బయటకు రావడం లేదు. కానీ ఇలా వెళ్లిన ప్రతిసారి కేంద్రం నుంచి సానుకూలత అన్న మాట మాత్రం బయటకు వస్తుంది. ప్రధానితో భేటీ అనంతరం జగన్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిని కలిశారు. రుషికొండ తవ్వకాలపై కమిటీ వేయనున్న నేపథ్యంలో సీఎం జగన్ కలవడంపై రకరకాల ఉహాగానాలు రేగుతున్నాయి.
అయితే సీఎం జగన్ చాలా ఆశలతో ఢిల్లీలో అడుగుపెట్టారు. కానీ వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. అన్నింటికంటే మించి ఈ నెల గట్టెక్కాలంటే కేంద్ర ప్రభుత్వం దయతలచాలి. సామాజిక పింఛన్లు కూడా ఇచ్చుకోలేని గడ్డు స్థితిలో ప్రభుత్వం ఉంది, అప్పుల పరిమితి దాటిపోయింది. కేంద్రం అనుగ్రహిస్తే కానీ అప్పుపుట్టదు. ప్రస్తుతం ఓడీలో ఉండగా.. దానిని తిరగేసి మరోసారి అప్పులు తెచ్చుకోవాలి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆస్పత్రిలో ఉన్నారు. అమిత్ షా అందుబాటులో లేరు. దీంతో తాను వచ్చిన పని జరగకపోవడంతో.. ఎవరికీ అంతుపట్టని రీతిలో జగన్ ఢిల్లీ పర్యటన సాగుతోంది.

అటు నేషనల్ మీడియా కూడా జగన్ పర్యటనకు పెద్దగా ఆసక్తికనబరచలేదు. అప్పులు తిప్పలు తప్ప ఎటువంటి రాజకీయాంశాలు లేకపోవడం వల్లే జగన్ పర్యటనకు ఢిల్లీ మీడియా కాస్తా దూరంగా ఉంది. అటు జగన్ పర్యటన సైతం గతానికి భిన్నంగా సాగింది. అటు వైసీపీ నేతలకు సైతం అంతుపట్టలేదు. ఢిల్లీ పెద్దల నుంచి సానుకూలత రాకపోవడంతో జగన్ కూడా ముభావంతో కనిపించారు. ఇదే ఇప్పుడు వైసీపీలో కూడా చర్చనీయాంశంగా మారింది.