Chandrababu- Kandukur Sabha: ఓటమి, ప్రతికూల పరిస్థితులు ఎదురైన ప్రతిసారి చంద్రబాబు తట్టుకొని నిలబడుతున్నారు. రాజకీయంగా పోరాటం చేస్తున్నారు. బహుశా ఆయన సక్సెస్ కు అదే కారణం కావచ్చు. గత ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంతో టీడీపీ శ్రేణులు నైరాశ్యంలోకి వెళ్లిపోయాయి. అధికార పార్టీ దాడులు, కేసులకు భయపడి చాలామంది నాయకులు ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు రాజకీయాలు వదిలి వ్యాపారాలు చేసుకున్నారు. క్యాడర్ లో కూడా స్తబ్ధత లేకుండా పోయింది. ఇటువంటి సమయంలో చంద్రబాబు ధైర్యాన్ని పోగుచేసుకొని అధికార పార్టీపై పోరాటం మొదలు పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం నిరాశే ఎదురైనా.. పోరాటం ఆపలేదు. చంద్రబాబు పోరాటానికి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తోడు కావడంతో మళ్లీ టీడీపీ లైమ్ లైట్ లోకి వచ్చినట్టు కనిపిస్తోంది. మరోవైపు జనసేన రూపంలో పొత్తు అవకాశాలు కనిపిస్తుండడంతో నేతలు యాక్టివ్ గా పనిచేయడం ప్రారంభించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సభలకు జనాలు పోటెత్తుతున్నారు. స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు.

కర్నూలు, విశాఖ, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలు సక్సెస్ అయ్యాయి. రోడ్ షోలు, సభలు, సమావేశాలకు లక్షలాది మంది జనాలు తరలివచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబు ప్రజలతో చెప్పించారు. తన ప్రసంగ శైలిని కూడా మార్చారు. పదునైన మాటలతో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుండడాన్ని చూసి టీడీపీ యాక్టివిటీస్ పెంచుకోవాలని భావించారు. అదే స్పూర్తితో ఏపీలోని అన్ని జిల్లాలను చుట్టేయ్యాలని చంద్రబాబు భావించారు.అందులో భాగంగానే నెల్లూరు టూర్ కు శ్రీకారం చుట్టారు. కానీ తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. తొక్కిసలాటలో 8 మంది మృత్యువాత పడడం, మరికొందరు క్షతగాత్రులు కావడంతో యాత్రకు బ్రేక్ పడింది. అటు టీడీపీ అభిమానులు మృతిచెందడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారు. మృతదేహాలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల సాయం ప్రకటించారు. బాధిత కుటుంబాలను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా, ముందస్తు ఎన్నికలు వచ్చినా అప్పటివరకూ ప్రజల మధ్యనే ఉండాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్నారు. లోకేష్ పాదయాత్ర ఒక వైపు సాగేలా.. మరోవైపు చంద్రబాబు రోడ్ షోలు, సభలు, సమావేశాలతో పార్టీని మరింత యాక్టివ్ చేయాలని భావించారు. కానీ నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన రూపంలో మరోసారి చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతానికైతే నెల్లూరు పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేశారు. కాగా తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు టీడీపీ నేతలు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు సాయం ప్రకటిస్తున్నారు. పార్టీ ప్రకటించిన రూ.10 లక్షల సాయంతో పాటు టీడీపీ శ్రేణులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నాయి. బాధిత కుటుంబాలకు స్వాంతన చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.