
CM KCR: అతి సర్వత్రా వర్జయేత్ అని ఒక సామెత ఉంటుంది. అంటే ఏదైనా మోతాదుకు మించితే ఇబ్బంది పడక తప్పదు అని. ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి దూకుడు మంత్రాన్ని నమ్ముకున్న ఆయన.. పాలన విధానంలోనూ, పాలనలో అవకతవకలు జరిగినప్పుడు, వాటిని ప్రజల దృష్టి నుంచి మరలించేందుకు ఇదే సూత్రాన్ని అవలంబిస్తున్నారు.. కానీ దీనివల్ల జరుగుతున్న నష్టాన్ని ఆయన అంచనా వేయలేకపోతున్నారు. రాజకీయాల్లో ఆయన గండర గండడు అయినప్పటికీ రోజులన్నీ ఒకేలా ఉండాలని లేదు. పశ్చిమ బెంగాల్ ను ఒకప్పుడు వామపక్షాలు ఏకపక్షంగా పాలించాయి.. బుద్ధదేవ్ భట్టాచార్య లాంటివాళ్ళు రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏలారు. కానీ నందిగ్రామ్ ఘటన తర్వాత వాపక్షాల కోటకు బీటలు వారడం ప్రారంభమైంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వామపక్షాల నుంచి కనీసం ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థి కూడా లేడు అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇది ప్రస్తుతం తెలంగాణను ఏలుతున్న కెసిఆర్ కూడా వర్తిస్తుంది.
ఎందుకంటే ఉద్యమం నుంచి ఆయన దూకుడు మంత్రాన్నే ప్రదర్శిస్తున్నారు.. ఉద్యమంలో దూకుడుతనం అనేది ఉండాలి.. కానీ పాలన విషయానికి వచ్చేసరికి అది సరిపోదు.. ఎందుకంటే పాము కాటుకు, తేలుకాటుకు ఒకే మంత్రం సరిపోదు.. పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత విషయాల్లో ఒక తీరుగా, మిగతా విషయాల్లో ఒక తీరుగా వ్యవహరిస్తున్నారు.. ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో తన కూతురు పేరు ప్రముఖంగా వినిపిస్తే కెసిఆర్ రెచ్చిపోయారు. ఆమెను విచారణకు ఈడీ పిలిస్తే నానా రచ్చ చేశారు. చివరికి ఆమె అరెస్టును కూడా రాజకీయంగా వాడుకోవాలని చూశారు. ఇందులో భాగంగానే బండి సంజయ్ ఎప్పుడో అన్న మాటలను ఉటంకిస్తూ ఇబ్బంది పెట్టాలని ప్రశ్నించారు.. తర్వాత కవిత ను ఈడి మలి దఫా విచారిస్తే ఈసారి కౌంటర్ గా టెన్త్ హిందీ ప్రశ్న పత్రం లీకేజీని తెరపైకి తీసుకువచ్చి బండి సంజయ్ ని రాత్రికి రాత్రే అరెస్టు చేశారు.. కానీ తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. మరి ఈ ఎపిసోడ్లో ప్రభుత్వం బండి సంజయ్ నేరానికి పాల్పడినట్టు నిరూపించాల్సి ఉంటుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రభుత్వానికి బండి సంజయ్ మీద మోపిన అభియోగాన్ని నిరూపించేంత దమ్ము లేదని తెలుస్తోంది. ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులోనూ ప్రభుత్వం ఇలాంటి రెండు నాలుకల ధోరణికే పాల్పడింది.. కానీ ఇవాల్టికి ఈ వ్యవహారంలో సిట్ అధికారులు తవ్వుతున్న కొద్దీ కొత్త కొత్త ఉదంతాలు బయట పడుతున్నాయి.

ఇక తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత దేశ రాజకీయాల్లోకి తాము నేరుగా వెళ్తామని కెసిఆర్ అప్పట్లో ప్రకటించారు. అంతేకాదు కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తామని, భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా వెళ్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కర్ణాటకలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కానీ భారత రాష్ట్ర సమితి ఇంతవరకు ఒక్క అడుగు కూడా వేయలేదు. మొన్నటిదాకా రాసుకొని తిరిగిన కుమారస్వామికి అనుకూలంగా ప్రచారం కూడా చేయడం లేదు. ఇక ఆ మధ్య మంత్రి సత్యవతి రాథోడ్, కర్ణాటక వెళ్ళినట్టు ప్రచారం జరిగింది. కానీ అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితి వెంటనే తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది.. కర్ణాటకలో ప్రధానంగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ ఉన్నట్టు ఆమె చెప్పడంతో కెసిఆర్ వెనుకడుగు వేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక మహారాష్ట్రలో కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది.. త్వరలో అక్కడ జరగబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని కెసిఆర్ భావిస్తున్నప్పటికీ అక్కడ అంత సీన్ లేనట్టు క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి.
ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో ఆర్థిక నేరగాడు చంద్రశేఖర్ బయటకు విడుదల చేస్తున్న ఆధారాలు భారత రాష్ట్ర సమితి క్యాంపులో ఆందోళనకు కారణమవుతున్నాయి. అయితే మొన్నటి వరుస విచారణల్లో కవితను అరెస్ట్ చేస్తే రాజకీయంగా వాడుకుందామని కెసిఆర్ భావించారు. కానీ కెసిఆర్ అంచనాలకు భిన్నంగా ఈడి వ్యవహరించింది. నింపాదిగా తన పని తాను చేసుకుంటోంది. ” కుక్కను చంపాలంటే ముందుగా దానిపై పిచ్చిదనే ముద్ర వేయాలి” అనే సామెతను కవిత విషయంలో పాటిస్తోంది. వరుస విచారణల తర్వాత కవితను అరెస్టు చేయాలని ఈడి భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొదట్లో రచ్చ రచ్చ చేసిన బీఆర్ఎస్ కవితను ఒకవేళ అరెస్ట్ చేస్తే ఆ స్థాయిలో హంగామా చేసే అవకాశం ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో చాలా విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మోనార్క్ తీరుగా వ్యవహరిస్తుండటమే ఇక్కడ అసలు సమస్యకు కారణం. అది ప్రజలకు అర్థమైంది కాబట్టే భారత రాష్ట్ర సమితి నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలలో అది కనిపిస్తోంది. మరి దీనిని కేసీఆర్ ఎలా సరిదిద్దుకుంటారనదే ఇప్పుడు అసలు ప్రశ్న.