
Rayalaseema- YCP: ఆవిర్భావం నుంచి రాయలసీమలో ఎదురులేని విజయాలను అందుకుంటున్న వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్ట పోయిన పరిస్థితి నెలకొంది. ఆ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని అనుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. పార్టీ శ్రేణులంతా కలిసి పనిచేసినా, మండలి పోరు ఆ పార్టీ నేతలను ఉలికిపాటు గురిచేస్తుంది.
పశ్చిమ రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. వైసీపీ తరుపున ఎంవీ రామచంద్రారెడ్డికి 10787 ఓట్లు రాగా, టీడీపీ బలపరిచిన ఒంటే శ్రీనివాసరెడ్డికి 10 618 ఓట్లు వచ్చాయి. అంటే, వీరిద్దరి మధ్య తేడా కేవలం 169 ఓట్లు మాత్రమే.

అలాగే, పట్టభద్రుల స్థానం నుంచి వైసీపీ తరుపున వెన్నపూస రవీంద్రారెడ్డి ఉన్నారు. ఈయన స్వస్థలం పులివెందుల. టీడీపీ మద్దతు ఇస్తున్న భూమిరెడ్డి రామ్‌గోపాల్ కర్నూలుకు చెందినవారు. సాధారణంగా పులివెందుల వైసీపీకి కంచుకోట. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థికి గెలుపు ఖాయమనే అనుకుంటారు. కానీ, గెలుపు కోసం వెన్నపూస రవీంద్రారెడ్డి ఎదురీతుతున్నారు. ఇక్కడ టీడీపీ గెలుపు ఖాయంగానే కనిపిస్తుంది.

మొత్తంగా వైసీపీకి ఓటమి భయాన్ని ఉద్యోగులు, పట్టభద్రులు చూపించారని టీడీపీ శ్రేణులు అంటున్నారు. కడప జిల్లాతో పాటు మిగతా జిల్లాల్లో సాధారణ ఎన్నికల్లో ఉన్న పట్టు పట్టభద్రుల్లో కనిపించలేదన్న సంకేతాల ఈ ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణ మినహా కడప కర్నూలు జిల్లాలో ఎక్కడ కూడా ఆ పార్టీకి సీట్లు దక్కలేదు. రాయలసీమ విషయానికొస్తే చిత్తూరు జిల్లాలో కుప్పం నుంచి చంద్రబాబు గెలిచారు. రాయలసీమ మొత్తం రెండు సీట్లకే పరిమితమైన టీడీపీ ఇప్పుడు వైసీపీకి గట్టి దెబ్బ కొట్టింది. ఈ తరుణంలో రాబోవు ఎన్నికల పరిస్థితిపై అంచనాలు పెరిగిపోయాయి.